మాటిచ్చి.. మడమ తిప్పారు

ABN , First Publish Date - 2021-11-26T05:37:24+05:30 IST

అమరావతిని స్వాగతిస్తున్నామని.. విజయవాడ గుంటూరు మధ్య 30వేల ఎకరాలుండాలని.. ప్రతిపక్షంలో ఉన్పప్పుడు పేర్కొన్న సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత భూములు త్యాగం చేసిన రైతులను మోసం చేస్తూ మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చారని రాజధాని రైతులు ఆగ్రహించారు.

మాటిచ్చి.. మడమ తిప్పారు
తుళ్లూరు ధర్నా శిబిరంలో జై అమరావతి అంటూనినాదాలు చేస్తున్న రాజధాని అమరావతి మహిళలు

అన్నదాతను మోసం చేస్తున్న ప్రభుత్వం 

రైతుల పక్షానే న్యాయం, ధర్మం

709వ రోజుకు చేరుకున్న ఆందోళనలు 

 

తుళ్లూరు, నవంబరు 25: అమరావతిని స్వాగతిస్తున్నామని.. విజయవాడ గుంటూరు మధ్య 30వేల ఎకరాలుండాలని.. ప్రతిపక్షంలో ఉన్పప్పుడు పేర్కొన్న సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత  భూములు త్యాగం చేసిన రైతులను మోసం చేస్తూ మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చారని రాజధాని రైతులు ఆగ్రహించారు.  ఇప్పుడు మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ అంటూ మరో నాటకానికి తెరతీశారని ఆరోపించారు.  రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి అభివృద్ధి కొనసాగాలని రైతులు చేస్తున్న ఆందోళనలు శుక్రవారం 709వ రోజుకు చేకున్నాయి. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల  నుంచి వారు మాట్లాడుతూ అమరావతిని నిర్వీర్యం చేయడానికి మూడు ముక్కల ఆట ఆడుతున్నారని ఆరోపించారు. కేవలం రాజకీయ,  స్వార్థ ప్రయోజనాల కోసమే ఈ డ్రామా అని పేర్కొన్నారు. రాష్ట్ర ఆదాయ వనరైన అమరావతిని రక్షించుకోవాలని, ఏకైక రాజధానిగా  అమరావతి కొనసాగాలని రైతుల చేస్తున్న మహా ప్రజా పాదయాత్రను ఐదుకోట్ల మంది ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. పాదయాత్రను అడ్డుకోవాలని ప్రతి  జిల్లాలో పోలీసులను ప్రయోగిస్తున్నారని అన్నారు.  అయినా ప్రజాబలంతో యాత్ర ముందుకు సాగుతుందన్నారు. ప్రత్యేక హోదా తెస్తామని దాని ఊసే లేకుండా చేశారన్నారు. విభజన హామీలను అమలు చేసేందుకు కేంద్రంతో పోరాడతామన్న మాటలు ఈ రోజు ఎందుకు వినబడటం లేదన్నారు. అమరావతి వెలుగు కార్యక్రమంలో భాగంగా దీపాలు వెలిగించి జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. అమరావతికి వెలుగులు ప్రసాదించాలని న్యాయదేవతను వేడుకున్నారు. 

Updated Date - 2021-11-26T05:37:24+05:30 IST