ఉత్సాహంగా.. ఉద్వేగంగా..

ABN , First Publish Date - 2021-11-06T05:20:52+05:30 IST

ప్రజా స్వాగతాలు.. జనం జేజేలు.. మధ్య గురు, శుక్రవారాల్లో అమరావతి పాదయాత్ర జిల్లాలో కొనసాగింది. రండి.. రండి ప్రజాయాత్రకు మద్దతివ్వండి.. అంటూ యాత్రకు ముందు ప్రజాగాయకుడు రమణ బృం దం ఆలపిస్తున్న పాటలు అందరినీ ఆలోచింప చేస్తున్నా యి.

ఉత్సాహంగా.. ఉద్వేగంగా..
తిక్కిరెడ్డిపాలెంలో అమరావతి రైతుల దీపావళి వేడుక

ఐదో రోజుకు చేరిన మహా పాదయాత్ర

గ్రామాల్లో ఎక్కడికక్కడ అపూర్వ ఆహ్వానాలు

రైతులతో కలిసి జేడీ శీలం, నరేంద్ర, రావెల నడక

హైకోర్టు న్యాయవాదులు, తెలంగాణ రైతు సంఘం సంఘీభావం


జై అమరావతి.. జైజై అమరావతి.. అనే నినాదాలు హోరెత్తుతుండగా.. వివిధ వర్గాల నుంచి ఊహించ ని రీతిలో వస్తున్న అపూర్వ స్పందన మధ్య ఐదో రోజు శుక్రవారం ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు మహాపాదయాత్ర’ కొనసాగింది.  వివిధ వర్గాల నుంచి వస్తున్న ఆదరణతో  రైతులు, మహిళ లు మరింత ఉత్సాహంగా ముందుకు సాగు తున్నారు.   మార్గమధ్య లో గ్రామగ్రామాన రైతులు, మహిళలు ఎదురొచ్చి వీర తిలకాలు దిద్దుతూ.. వార పోస్తూ.. పూల వర్షం కురి పిస్తూ అమరావతి యాత్రకు జేజేలు పలుకుతున్నారు. గురువారం దీపావళి పర్వదినం రోజున కూడా పాదయాత్ర సాగింది. తెలంగాణ రైతు సంఘం నాయ కులు, హైకోర్టు న్యాయవాదులతో పాటు వివిధ పార్టీల నేతలు పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు. 


ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు / గుంటూరు, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): ప్రజా స్వాగతాలు.. జనం జేజేలు.. మధ్య గురు, శుక్రవారాల్లో అమరావతి పాదయాత్ర జిల్లాలో కొనసాగింది. రండి.. రండి ప్రజాయాత్రకు మద్దతివ్వండి.. అంటూ యాత్రకు ముందు ప్రజాగాయకుడు రమణ బృం దం  ఆలపిస్తున్న పాటలు అందరినీ ఆలోచింప చేస్తున్నా యి. యాత్ర తమ ప్రాంతానికి చేరుకుంటున్న సమయంలో స్థానిక రైతులు, మహిళలు యాత్రధారులకు పళ్లు, మజ్జిగ, మంచినీరు, బిస్కెట్లు అందించేందుకు పోటీపడుతున్నారు. శుక్రవారం ప్రత్తిపాడు రైతులు కాడెద్దులతో ఆహ్వానం పలికారు. అబ్బినేనిగుంటపాలెంలో మాజీ మంత్రి డాక్టర్‌ మాకినేని రత్తయ్య ఆహ్వానం పలకగా, స్థానికులు గుమ్మడి కాయలతో హారతులు ఇచ్చి పూలవర్షం కురిపించారు. మధ్యాహ్న భోజన విరామం అనంతరం వరగానికి యాత్ర చేరుకోగా అక్కడ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అక్కడి నుంచి పెదనందిపాడు చేరుకోవడంతో ఐదో రోజు యాత్రకు విరామం ప్రకటించారు. టీడీపీ సీనియర్‌ నేత ధూళ్లిపాళ్ల నరేంద్ర, ఆయన కుమార్తె, సంగం డెయిరీ సిబ్బంది రైతులకు మద్దతు తెలుపుతూ రైతులతో కలిసి నడిచారు. హైకోర్టు లాయర్లు సుంకర రాజేంద్ర ప్రసాద్‌, పోసాని వెంకటేశ్వరరావు, నర్రా శ్రీనివాసరావు, రుక్మిణి, లావు అంకమ్మచౌదరి, జీ శేషగిరిరావు, సాయి వరప్రసాద్‌, సీహెచ్‌ అశ్వన్‌బాబు, బీ సలామ్‌తో పాటు పలువురు లాయర్లు రైతులతో కలిసి పాదయాత్రలో తిక్కిరెడ్డిపాలెం వరకు వచ్చారు. పాదయాత్రలో పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం, మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు, రాయపాటి శ్రీవావాస్‌, సినీనటి, టీడీపీ నేత దివ్వవాణి, సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు,  తెలుగుయువత గుంటూరు పార్లమెంట్‌ అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.   


తిక్కిరెడ్డిపాలెంలో దీపావళి

వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట నుంచి కోయవారిపాలెం మీదగా తిక్కిరెడ్డిపాలెం వరకు గురువారం పాద యాత్ర సాగింది. అక్కడ రాములవారి దేవస్థాన కల్యాణ మండపంలో రాత్రి బస చేశారు. సాయంత్రం వేంకటేశ్వరస్వామి విగ్రహం వద్ద దీపాలు వెలిగించారు. ప్రజలు కొవ్వొత్తు లు చేతబూని అమరావతి ని నాదాలు చేశారు. పండుగ నాడు ఇళ్ల వద్ద కుటుంబ సభ్యుల మధ్య ఉంచకుండా పాలకులు చేశారంటూ పలు వురు కన్నీటి పర్యంతమ య్యారు. శుక్రవారం ఉదయం తిక్కిరెడ్డిపాలెం నుంచి ప్రత్తిపాడు వరకు సాగింది. 


పలువురు విరాళాలు

ప్రత్తిపాడు పాదయాత్రలో పలువురు విరాళాలు అందజేశారు. మాజీ ఎమ్మెల్యే  యరపతినేని శ్రీనివాసరావు రూ.10 లక్షలు, ప్రత్తిపాడు చౌదరి యూత్‌ సభ్యులు రూ.1.7 లక్షలను అందజేశారు. తిక్కిరెడ్డిపాలెం, కోయవారిపాలెం గ్రామస్థులు మధ్యాహ్న, రాత్రి భోజనం, అల్పాహారం ఏర్పాటు చేశారు. పుల్లడిగుంట సమీపంలోని కళాశాలల్లో విశ్రాంతి తీసుకున్న రైతులకు లేమల్లెపాడు గ్రామస్థులు  అల్పాహర విందు ఇచ్చారు. పుల్లడిగుంట సమీపంలోని కళాశాల విద్యార్థులు పులువురు రూ.10వేలను అందజేశా రు. టీడీపీ నాయకురాలు జయలక్ష్మి, భర్త శ్రావణ్‌కుమార్‌తో కలసి 50 వేల నగదును అందజేశారు. చమళ్ళమూడి గ్రామస్థులు 27 వేలు నగదు, వట్టిచెరుకూరుకి చెందిన బుర్రా మోహనరావు రూ.10 వేల చెక్కును అందజేశారు. వరగానికి చెందిన చిన్నారి ధన్య తన కిడ్డీ బ్యాంక్‌ను జేఏసీ నాయకులు అందజేసింది. విశ్రాంత విజిలెన్స్‌ ఏఎస్పీ కాళహస్తి సత్యనారాయణ, వారి కుమారుడు రాజశేఖర్‌  ప్రవాసాంధ్రులైన పర్చూరి విక్రమ్‌, అయినంపూడి ఫణిలు పంపించిన నగదు 1.50 లక్షలు, 200 టీ షర్టులు, శ్రీనివాసా కాటన్‌ అండ్‌ ఆయిల్‌ మిల్స్‌ లిమిటె డ్‌ వారు 25000 నగదు అంద జేశారు.   


వైసీపీ నాయకుల మద్దతు

ప్రత్తిపాడులో పాదయాత్రకు వైసీపీ నాయకులు సైతం మద్దతు తెలిపారు. కోయవారిపాలెం నుంచి పెదనందిపాడు వరకు సీనియర్‌ వైసీపీ నాయకుడు కమ్మా శివప్రసాద్‌తో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. 

  

 

Updated Date - 2021-11-06T05:20:52+05:30 IST