ప్రభుత్వం మారితే రాజధాని మారుతుందా?

ABN , First Publish Date - 2021-08-21T05:22:30+05:30 IST

ఐదేళ్ల నుంచి పరిపాలన అమరావతి నుంచి కొనసాగుతుండగా, ప్రభుత్వం మారితే రాజధాని ఎలా మారుతుందని రైతులు ప్రశ్నించారు.

ప్రభుత్వం మారితే రాజధాని మారుతుందా?
వెలగపూడి శిబిరంలో నినాదాలు చేస్తున్న రైతులు

612వ రోజు ఆందోళనల్లో అమరావతి రైతులు


తుళ్లూరు, ఆగస్టు 20: ఐదేళ్ల నుంచి పరిపాలన  అమరావతి నుంచి కొనసాగుతుండగా, ప్రభుత్వం మారితే రాజధాని ఎలా మారుతుందని రైతులు ప్రశ్నించారు. అమరావతి రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగాలని రైతులు, మహిళలు, రైతు కూలీలు చేస్తోన్న ఉద్యమం శుక్రవారంతో 612వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరావతి అభివృద్ధిని పక్కన పెట్టడానికి మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చారన్నారు. అమరావతి అభివృద్ధిని కొనసాగించకుండా ఉండటం కోసం  కుట్ర పూరితంగా చెల్లని కమిటీలు వేసి మూడు ముక్కల ఆటకు అనుమతి కావాలంటూ అసెంబ్లీలో పాలకులు తీర్మానించడం దారుణమన్నారు. రాజ్యాంగంలోనే మూడు రాజధానుల అనే అంశం లేదని, అలాంటప్పుడు ఆ బిల్లును ఎలా ఆమోదిస్తారన్నారు. రైతుల పక్షాన న్యాయదేవత ఉంటుందన్నారు. రాజకీయ కుట్రతో అమరావతి రైతులను బలిపశువులు చేశారన్నారు. న్యాయం అడిగితే అక్రమ కేసులు పెట్టారన్నారు. రాష్ట్ర రాజధానిపై విషం చిమ్మడం కుట్ర, మోసం కిందకు వస్తుందన్నారు. అలా చేసిన పాలకులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. రాజధాని గ్రామాల్లో ఇంటింటా దీపాలు వెలిగించి సేవ్‌ అమరావతి, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ నినాదాలు చేశారు. 

Updated Date - 2021-08-21T05:22:30+05:30 IST