రాజకీయ కక్షతోనే రాజధాని విభజన

ABN , First Publish Date - 2021-07-12T06:06:11+05:30 IST

రాజకీయ కక్షతోనే సీఎం జగన్‌రెడ్డి అమరావతిని విభజన చేయాలని చూస్తున్నారని రాజధాని రైతులు, మహిళలు ఆరోపించారు.

రాజకీయ కక్షతోనే రాజధాని విభజన
పెదపరిమి శిబిరంలో దీపాలు వెలగించి నినాదాలు చేస్తున్న రైతులు, మహిళలు

572వ రోజు ఆందోళనల్లో అమరావతి రైతులు

తుళ్లూరు, తాడికొండ, జూలై 21: రాజకీయ కక్షతోనే సీఎం జగన్‌రెడ్డి అమరావతిని విభజన చేయాలని చూస్తున్నారని రాజధాని రైతులు, మహిళలు ఆరోపించారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరాతిని కొనసాగించాలని వారు చేస్తోన్న ఉద్యమం ఆదివారంతో 572వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రైతులు, రైతు కూలీలు, మహిళలు మాట్లాడుతూ పాలకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం అమరావతిని నాశనం చేయవచ్చా అని ప్రశ్నించారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగితే ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుందన్నారు. అయినా అమరావతిని మూడు ముక్కలు చేయాలనుకోవడం అవివేకమన్నారు. పాలకులు రాజధాని రైతులకు అన్యాయం చేయాలని చూస్తున్నారన్నారు. దీపాలు వెలిగించి జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. తుళ్లూరు, పెదపరిమి, అనంతవరం, నెక్కల్లు, దొండపాడు, ఉద్దండ్రాయునిపాలెం, వెలగపూడి, మందడం, వెంకటపాలెం, ఐనవోలు తదితర రాజధాని గ్రామాల్లో ఆందోళనులు కొనసాగాయి. మూడు రాజధానులకు వ్యతిరేకంగా తాడికొండ మండలం మోతడక గ్రామంలో రైతులు, మహిళలు ఆదివారం నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖకు రాజధాని అని ప్రజలను మభ్యపెట్టి ప్రభుత్వ ఆస్తులను దోచుకోవడానికి సీఎం పన్నాగం పన్నారన్నారు. మూడు రాజధానుల ప్రకటనతో రాజధానిలో నిర్మాణాలు పూర్తిగా నిలిచిపోవటంతో వేలాదిమంది కార్మికులు పనులు లేక రోడ్డున పడ్డారన్నారు. వేల కోట్లతో నిర్మించిన భవనాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.  


 


Updated Date - 2021-07-12T06:06:11+05:30 IST