పాలకులను నమ్మని న్యాయదేవత

ABN , First Publish Date - 2021-05-18T06:34:52+05:30 IST

రాజ్యాంగ పరంగా ఆంధ్ర ప్రదేశ్‌లో పాలన సాగటం లేదని అందువల్లే న్యాయదేవత వారిని నమ్మడంలేదని రాజధాని రైతులు, మహిళలు, దళిత జేఏసీ సభ్యులు తెలిపారు.

పాలకులను నమ్మని న్యాయదేవత
పెదపరిమి శిబిరంలో నినాదాలు చేస్తున్న రాజధాని రైతులు

517వ రోజు దీక్షల్లో రాజధాని రైతులు


తుళ్లూరు, తాడికొండ, మే 17: రాజ్యాంగ పరంగా ఆంధ్ర ప్రదేశ్‌లో పాలన సాగటం లేదని అందువల్లే న్యాయదేవత వారిని నమ్మడంలేదని రాజధాని రైతులు, మహిళలు, దళిత జేఏసీ సభ్యులు తెలిపారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాలని వారు చేస్తోన్న ఉద్యమం సోమవారంతో 517వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరావతికి అండగా ఉండి ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలను ఎండగడుతున్న వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలను సహించలేక వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందన్నారు. ప్రజల గొంతుకను వినిపిస్తున్న మీడియాపై కూడా అక్రమ కేసులు పెట్టడం దారుణమన్నారు. కోర్టు ఉత్తర్వులు అమలు చేయకుండా నియంత పాలన సాగిస్తున్నారన్నారు. అక్రమ కేసులపై న్యాయదేవత ఉక్కుపాదం మోపుతుందన్నారు. న్యాయదేవత లేకపోతే అక్రమాలను ప్రశ్నించే గొంతులను ఈ ప్రభుత్వం నొక్కేసేదని తెలిపారు. మూడు రాజధానులు వద్దు అంటూ రైతులు ఉద్యమం చేస్తుంటే అక్రమ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారితే రాజధాని మారుతుందా.. మూడు ముక్కల ఆట చట్ట విరుద్ధం కాదా అని ప్రశ్నించారు. అన్యాయం చేసిన పాలకులకు ప్రజాకోర్టులో శిక్ష తప్పదన్నారు. అమరాతి వెలుగు కార్యక్రమం కొనసాగింది. దీపాలు వెలిగించి జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. తుళ్లూరు, ఐనవోలు, రాయపూడి, లింగాయపాలెం, వెలగపూడి, మందడం, ఉద్దండ్రాయునిపాలెం, వెంకటపాలెం, అనంతవరం, నెక్కల్లు, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, దొండపాడు, పెదపరిమి, తాడికొండ మండలం మోతడక తదితర గ్రామాలో ఆందోళనలు కొనసాగాయి. 

Updated Date - 2021-05-18T06:34:52+05:30 IST