క్వారీలో.. నలుగురి గల్లంతు

ABN , First Publish Date - 2021-07-12T06:08:30+05:30 IST

ఆదివారం.. సెలవు దినం.. స్నేహితులతో సరదాగా గడపాలనుకున్నారు.. అదే వారి పాలిట శాపంలా మారింది.

క్వారీలో.. నలుగురి గల్లంతు

ప్రాణాల మీదకు తెచ్చిన మద్యం మత్తు

ఓ యువకుడ్ని రక్షించే యత్నంలో మరో ముగ్గురు

క్వారీలోకి దిగేందుకు సాహసించని స్థానిక ఈతగాళ్లు

సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అర్బన్‌ ఎస్పీ ఆరీఫ్‌   

యువకుల కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం గాలింపు


ప్రత్తిపాడు, జూలై 11: ఆదివారం.. సెలవు దినం.. స్నేహితులతో సరదాగా గడపాలనుకున్నారు.. అదే వారి పాలిట శాపంలా మారింది. క్వారీ గుంతలో మునిగి నలుగురు యువకులు గల్లంతైన సంఘటన ఆదివారం ప్రత్తిపాడు మండలం బోయపాలెం సమీపంలోని డైట్‌ కళాశాల వెనుక కొండరాళ్ల వద్ద చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు.. ప్రత్తిపాడుకు చెందిన లంబు వంశీ(21), శిద్దంశెట్టి వెంకటేష్‌(21), బిల్లా సాయి ప్రకాష్‌(23), ఇగుటూరి వీరశంకర్‌రెడ్డి(22)లతో పాటు పాతంపాటి యశ్వంత్‌, ఉదయగిరి హేమంత్‌లు స్నేహితులు. ఆదివారం సెలవు కావడంతో వీరంతా సరదా గడిపేందుకు  ద్విచక్ర వాహనాలపై బోయపాలెం, తుమ్మలపాలెం గ్రామాలకు మధ్యఉన్న  క్వారీల వద్దకు వెళ్లారు. అక్కడ తమ వెంట తెచ్చుకున్న మద్యాన్ని తాగారు. ఉదయం 11 గంటల సమయంలో క్వారీ వద్దకు వెళ్లిన వారు సాయంత్రం నాలుగు గంటల వరకు కాలక్షేపం చేశారు. ఆ తర్వాత మత్తులో ఉన్న ఇద్దరు యువకులు దుస్తులు ఒడ్డున వేసి నీటితో నిండుగా ఉన్న క్వారీలోకి దిగారు. మరో ఇద్దరు కాళ్లు చేతులు కడుక్కునేందుకు దిగారు. క్వారీలో నాలుగు అడుగుల లోపే పెద్ద గొయ్యి ఉందని గ్రహించని యువకుల్లో ఒకడు మునిగిపోయాడు. గమనించి అతడ్ని కాపాడే యత్నంలో మరో ముగ్గురు యువకులు కూడా మునిగిపోయారు. యశ్వంత్‌ తాగునీటి బాటిళ్ల కోసం సమీపంలోని జాతీయ రహదారిపైకి వెళ్లాడు. అతడు తిరిగి వచ్చేప్పటికి క్వారీగుంతలో మునిగిపోతున్న సాయిప్రకాష్‌ను చూసి కాపాడేందుకు యత్నించిన ఫలితం లేకుండా పోయింది. క్వారీలో చిక్కుకు పోయిన తాను చాలా కష్టంతో ఒడ్డుకు వచ్చినట్లు యశ్వంత్‌ చెప్పాడు.


ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం గాలింపు

క్వారీ గుంతలో నలుగురు మునిగిపోయిన విషయాన్ని  ఉదయగిరి హేమంత్‌, ప్రత్తిపాటి యశ్వంత్‌లు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబసభ్యులు, గ్రామస్థులు పెద్దసంఖ్యలో క్వారీ వద్దకు వచ్చారు. అయితే క్వారీ గుంతలోకి దిగేందుకు స్థానిక ఈతగాళ్లు సాహసించలేకపోయారు. నలుగురు యువకులు గల్లంతయిన విషయం తెలిసి అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌,  డీఎస్పీ జెస్సీ ప్రశాంతి, ఆర్డీవో భాస్కర్‌రెడ్డి సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాన్ని పిలిపించారు. రాత్రి ఎనిమిది గంటలకు సంఘటనా స్థలానికి చేరుకున్న బృందం ఫ్లడ్‌లైట్ల వెలుగులో అర్ధరాత్రి వరకు యువకుల కోసం గాలింపు చేపట్టింది. ప్రత్యేకంగా పడవను ఏర్పాటు చేసుకుని ఆక్సిజన్‌ సిలిండర్లతో నీళ్ల అడుగు బాగానికి వెళ్లి గాలింపు చేపట్టారు. చేబ్రోలు సీఐ మధుసూదన్‌, ఎస్‌ఐ అశోక్‌, తహసీల్దార్‌ పూర్ణచంద్రరావు  క్వారీ వద్దే ఉండే పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.


కుటుంబాలలో పెనువిషాదం

క్వారీలో గల్లంతైన యువకుల కుటుంబాలలో పెనువిషాదం అలుముకుంది. వంశీ మలినేని కళాశాలలో బీటెక్‌ చదువుతుండగా, వెంకటేష్‌ హైదరాబాద్‌లో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చేస్తున్నాడు. సాయిప్రకాష్‌ ప్రత్తిపాడులోని ఓ పురుగు మందుల దుకాణంలో పనిచేస్తుండగా వీరశంకర్‌రెడ్డి గుంటూరులోని ఓ వైద్యశాలలో పనిచేస్తున్నాడు.  


Updated Date - 2021-07-12T06:08:30+05:30 IST