నల్లబ్యాడ్జీలతో తహసీల్దార్ల నిరసన
ABN , First Publish Date - 2021-09-03T06:29:02+05:30 IST
కొవిడ్ వ్యాక్సినేషన్ టార్గెట్‌కి చేరుకోలేదని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తహసీల్దార్లను పరుష పదజాలంతో దుర్భాషలాడటంపై గుంటూరు జిల్లా తహసీల్దార్లు నిరసన తెలిపారు.

పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ క్షమాపణ చెప్పాలిని డిమాండ్
గుంటూరు, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): కొవిడ్ వ్యాక్సినేషన్ టార్గెట్‌కి చేరుకోలేదని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తహసీల్దార్లను పరుష పదజాలంతో దుర్భాషలాడటంపై గుంటూరు జిల్లా తహసీల్దార్లు నిరసన తెలిపారు. గురువారం తహసీల్దార్లంతా నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. కలెక్టరేట్‌లో జేసీ ఏఎస్ దినేష్‌కుమార్ నిర్వహించిన సమావేశానికి నల్లబ్యాడ్జీలతో హాజరై వినతిపత్రాన్ని అందజేశారు. కార్తికేయ మిశ్రా వాడిన పదాలు ఐఏఎస్ అధికారి హుందాతనాన్ని పోగొట్టేలా ఉన్నాయని వారు ఆక్షేపించారు. ఈ దృష్ట్యా ఐఏఎస్ అధికారులకు శిక్షణతో పాటు విధి నిర్వహణలో ఉద్యోగులతో ఎలా మెలగాలో నేర్పించాలన్నారు. అసలు రెవెన్యూ శాఖ అనేది భూపరిపాలన వ్యవహారాలను పర్యవేక్షించేది మాత్రమేనన్నారు. ఇదేమి సాధారణ పరిపాలన శాఖలా అన్ని కార్యకలాపాలు చూసేది కాదని స్పష్టం చేశారు. వలంటీర్లు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఉండగా వ్యాక్సినేషన్‌కి సంబంధించి లక్ష్యాలను తహసీల్దార్లకు కేటాయించడం సబబు కాదన్నారు. తక్షణమే కార్తికేయ మిశ్రాపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ల సంఘం జిల్లా అధ్యక్షుడు తాతా మోహన్‌రావు, నాయకులు భవానీ శంకర్, శ్రీకాంత, శ్రీనివాసరెడ్డి, అనీల్‌కుమార్, మల్లికార్జునరావు, బత్తుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.