ఆస్తిపన్ను పెంపుపై విపక్షాల ఆగ్రహం

ABN , First Publish Date - 2021-08-03T05:40:02+05:30 IST

గుంటూరు నగరపాలకసంస్థ పరిధిలో ఆస్తిపన్ను పెంపుపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

ఆస్తిపన్ను పెంపుపై విపక్షాల ఆగ్రహం
చెత్తపన్ను, ఆస్తిపన్నులను వ్యతిరేకిస్తూ కార్పొరేషన్‌ ముట్టడికి ర్యాలీగా వస్తున్న వామపక్షాలు

జీఎంసీ ముట్టడికి విఫలయత్నం ఫ టీడీపీ, వామపక్ష, జనసేన నాయకుల అరెస్టు

గుంటూరు (ఆంధ్రజ్యోతి)/(కార్పొరేషన్‌), ఆగస్టు 2: గుంటూరు నగరపాలకసంస్థ పరిధిలో ఆస్తిపన్ను పెంపుపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆస్తిపన్ను పెంపు తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం తెలుగుదేశం పార్టీ, వామపక్షాలు, జనసేన నాయకులు వేర్వేరుగా నగరపాలకసంస్థ ముట్టడికి తరలివచ్చారు. మేయర్‌ మనోహర్‌ అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో ఆస్తిపన్ను పెంపునకు సంబంధించి తీర్మానం వాయిదా వేయాలంటూ నాయకులు డిమాండ్‌చేశారు.

- ఆస్తిపన్ను పెంపును నిరసిస్తూ టీడీపీ నాయకులు హిమజ సెంటర్‌లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళర్పించి మున్సిపల్‌ కార్యాలయ ముట్టడికి యత్నించారు. కార్యాలయ సమీపంలోనే పోలీసులు అడ్డుకుని నేతలను అరెస్టుచేసి బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులను పాతగుంటూరుస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా టీడీపీనేతలు మాట్లాడుతూ ఆస్తిపన్ను స్వల్పంగానే పెరుగుతుందని మున్సిపల్‌ ఎన్నికలముందు చెప్పిన ప్రభుత్వం ఇప్పుడుభారీగా భారం మోపుతోందంటూ మండిపడ్డారు. పన్నుల రూపంలో ప్రజల నడ్డివిరుస్తున్న సీఎం జగన్‌ నిలువు దోపిడీకి నిజస్వరూపమని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, తూర్పు ఇన్‌చార్జి మహ్మద్‌ నసీర్‌ ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు చిట్టాబత్తిని చిట్టిబాబు, ఎల్లావుల ఆశోక్‌యాదవ్‌, ముప్పవరపు భారతి, ఎస్‌ఎస్‌పీ జాదా, గోళ్ల ప్రభాకర్‌, తాడివాక సుబ్బారావు, దయారత్నం, రావిపాటిసాయికృష్ణ; నాగుల్‌ మీరా, రాచకొండ లక్ష్మయ్య, ఆర్యాదుల రమణ, జిన్నాటవర్‌ సుభాని, మల్లిక, రమాదేవి, సూరే శ్రీను, పఠాన్‌ జమీర్‌, ఎస్‌కే హఫీజ్‌, పాటిబండ్ల బలరాం తదితరులు పాల్గొన్నారు. టీడీపీ పశ్చిమ నియోజకవర్గ నేతలను ముందస్తుగా పోలీసులు గృహనిర్బంధం చేశారు. 


- అంతకుముందు ర్యాలీగా వామపక్ష నాయకులు నినాదాలు చేసుకుంటూ తరలివచ్చారు. అక్కడ పోలీసులు, వామపక్షాల నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సీపీఎం నగర కార్యదర్శి నళినీకాంత్‌, సీపీఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి తదితర నాయకులు పాల్గొన్నారు. అలాగే ఆస్తిపన్ను పెంపును నిరసిస్తూ జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు ర్యాలీగా తరలివచ్చారు. వీరిని కూడా పోలీసులు అడ్డుకుని వాహనాల్లో ఎక్కించి పోలీసుస్టేషన్‌కు తరలించారు.  Updated Date - 2021-08-03T05:40:02+05:30 IST