అయ్యోర్లు

ABN , First Publish Date - 2021-05-19T05:18:59+05:30 IST

గుంటూరు(విద్య), మే 18: ఆయన పేరు విజయకుమార్‌. ఆరు పీజీ డిగ్రీలు చేశారు. గత సంవత్సరం వరకు ఆయన ప్రైవేటు స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా, కళాశాలలో పార్ట్‌టైమ్‌ అధ్యాపకుడిగా పనిచేస్తూ జీవనం సాగించారు.

అయ్యోర్లు
యూనియన్‌ బ్యాంకు చేసే ఆర్ధిక సహాయం కోసం వచ్చిన ప్రైవేటు స్కూల్స్‌ ఉపాధ్యాయులు

కనాకష్టంగా ప్రైవేటు టీచర్ల జీవనం

ఉపాధి కోల్పోయిన విద్యాసంస్థల సిబ్బంది 

14 నెలలకు జీతాలు తీసుకుంది నాలుగు నెలలే 

సాయం కోసం అర్థిస్తున్నా పట్టించుకోని పాలకులు

విద్యారంగంపై ఆధారపడిన 50 వేల కుటుంబాల్లో ఆకలి కేకలు

తెలంగాణ మాదిరిగా ఉపాధ్యాయులను ఆదుకోవాలని వినతులు 


గుంటూరు(విద్య), మే 18: ఆయన పేరు విజయకుమార్‌. ఆరు పీజీ డిగ్రీలు చేశారు. గత సంవత్సరం వరకు ఆయన ప్రైవేటు స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా, కళాశాలలో పార్ట్‌టైమ్‌ అధ్యాపకుడిగా పనిచేస్తూ జీవనం సాగించారు. కరోనాతో విద్యాసంస్థలు మూతపడటంతో ఆయన జీవనం కనాకష్టంగా మారింది.  ఫలితంగా ఆయన ఇప్పుడు ఓ బేకరిలో సేల్స్‌మన్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇలా ఒక్క విజయకుమార్‌ మాత్రమే కాదు జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పాఠశాలలు, కళాశాలల మూత, ఆన్‌లైన్‌ తరగతులతో పెద్దసంఖ్యలో ఉపాధ్యాయులు, అధ్యాపకులు అవసరం లేకుండా పోయింది. ఇదే అదనుగా ఆయా విద్యాసంస్థలు పలువుర్ని అనధికారికంగా తొలగించాయి. విధుల్లో ఉన్న వారికి కూడా అరకొరగానే జీతాలు ఇస్తున్నారు. దీంతో ఆయా కుటుంబాలు ఆకలి కేకలతో అల్లాడుతున్నారు. కరోనా కారణంగా 14 నెలలుగా విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఇంట్లో గడవక కొంతమంది ఉపాధి కూలీలుగా, మరికొందరు ఆటోడ్రైవర్లుగా, కిరాణా సరుకులు, కూరగాయల విక్రయదారులుగా, చిరు వ్యాపారులుగా, క్యాటరింగ్‌ పనుల్లో చేరి జీవనం సాగిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులను   ఆదుకోవాలని ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఫలితం లేదని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాలో ప్రైవేటు, కార్పొరేట్‌, చిన్నాచితక పాఠశాలలు దాదాపు 2 వేల వరకు ఉన్నాయి. ప్రైవేటు జూనియర్‌ కళాశాలలు, డీఈడీ, బీఈడీ కళాశాలలు వందల సంఖ్యలో ఉన్నాయి. ఇంజనీరింగ్‌, ఫార్మసీ విద్యాసంస్థలు 65పైగా ఉన్నట్లు సమాచారం. ఆయా పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయులు, అధ్యాపకులు దాదాపు 35 వేల నుంచి 40 వేల మంది వరకు ఉంటారని అంచనా. మరో 10 వేల మంది నాన్‌ టీచింగ్‌ సిబ్బంది ఉంటారు. కరోనా కారణంగా వీరికి గత ఏడాది మార్చి నుంచి ఉపాధి లేకుండా పోయింది. దీంతో జీతాలు రాక నానా అవస్థలు పడుతున్నారు. ప్రైవేటు స్కూల్స్‌ యాజమాన్యాల ఆధ్వర్యంలో కరోనా సాయం కింద సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ.50 లక్షలను ఇచ్చారు. అయితే ప్రభుత్వం ఆయా విద్యాసంస్థల్లో పని చేసే వారి గోడు పట్టించుకోవడంలేదని పలువురు విమర్శిస్తున్నారు. పాఠశాల విద్యాశాఖ వద్ద ఉన్న యు డైస్‌లో నమోదైన ఉపాధ్యాయులకు తక్షణ సహాయంగా రూ.10 వేలు ఇవ్వాలని అనేక నెలలుగా విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోవడంలేదని యాజమాన్యాలు  ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు ఉపాధ్యాయులకు కొంతలోకొంత చేయూత ఇస్తోంది. యుడైస్‌ ప్రకారం నమోదైన ఉపాధ్యాయులకు నెలకు 2 వేలు నగదు, 25 కేజీల బియ్యం అందజేస్తున్నది. కనీసం ఇటువంటి ప్రతిపాదన అయినా ఏపీ ప్రభుత్వం చేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.


పూర్వ విద్యార్థులను సంప్రదిస్తే 

ప్రైవేటు ఉపాధ్యాయుల్ని ఆదుకునేందుకు పూర్వ విద్యార్థుల చేయూత కోసం యాజమాన్యాలు కృషి చేయవచ్చునని ప్రజా ఆలోచన వేదిక వ్యవస్థాపకులు మేడూరి రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. ప్రతి పాఠశాల వద్ద  పూర్వ విద్యార్థుల అడ్రసులు ఉంటాయని వారిలో స్థితిమంతులైన వారిని  సంప్రదిస్తే ఉపాధ్యాయుల కష్టాలు కొంత వరకు తీర్చవచ్చునని చెప్పారు.


Updated Date - 2021-05-19T05:18:59+05:30 IST