పండ్ల మొక్కల నిధులు స్వాహా
ABN , First Publish Date - 2021-03-25T05:09:15+05:30 IST
మండలంలోని 23గ్రామ పంచాయతీల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.2.20 కోట్లతో జరిగిన పనులపై 12వ విడత సోషల్ ఆడిట్ బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద ప్రజావేదిక నిర్వహించింది.

ప్రజావేదికలో వెలుగుచూసిన అవినీతి అక్రమాలు
బొల్లాపల్లి, మార్చి 24: మండలంలోని 23గ్రామ పంచాయతీల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.2.20 కోట్లతో జరిగిన పనులపై 12వ విడత సోషల్ ఆడిట్ బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద ప్రజావేదిక నిర్వహించింది. డ్వామా అదనపు పీడీ జోసఫ్‌కుమార్ అధ్యక్షతన ప్రజావేదిక జరిగింది. ప్రజావేదికలో 23 పంచాయతీల్లో జరిగిన ఉపాధి పనుల గురించి డీఆర్‌పీలు చదివి వినిపించారు. వాటర్‌షెడ్ పథకం కింద రేమిడిచర్ల, గుమ్మనంపాడు, గరికపాడు, అయ్యన్నపాలెం, మేళ్ళవాగు గ్రామాల్లో భారీ అవినీతి చోటుచేసుకున్నట్లు గుర్తించారు. రేమిడిచర్ల, గుమ్మనంపాడు, గరికపాడు గ్రామాల్లో రైతులకు ఇచ్చిన తైవాన్ స్ర్పేయర్లు నాసిరకంగా ఉన్నాయని సోషల్ ఆడిట్ బృందం దృష్టికి తీసుకువచ్చారు. రేమిడిచర్ల, మేళ్ళవాగు, అయ్యన్నపాలెం గ్రామాల్లో మొక్కలు లేకుండానే బిల్లులు మంజూరు చేశారని, ఎక్కడా ఒక మొక్క కానరాలేదని సోషల్ ఆడిట్ బృందం నిగ్గుతేల్చింది. వాటర్‌షెడ్‌లో మొక్కలు లేకపోగా తరువాత వచ్చిన వెలుగు ఆధ్వర్యంలో పండ్ల మొక్కలు ఎక్కడా కానరాకపోగా మళ్లీ ఉపాధి హామీలో రేమిడిచర్ల, అయ్యన్నపాలెం, దోమలగుండం గ్రామాల్లో మొక్కలే లేవని ఆడిట్ బృందం తెలిపింది. లక్షల రూపాయల మేర మొక్కల పేరుతో బొల్లాపల్లి మండలంలో స్వాహా చేస్తున్నట్టు అధికారుల దృష్టికి తెచ్చింది. కార్యక్రమంలో సోషల్ ఆడిట్ బృందం ఎస్‌ఆర్‌పీలు, డీఆర్‌పీలు 19మంది, డ్వామా ఏవో రవికుమార్, ఎంపీడీవో పి.సీతారామయ్య, ఏపీడీ రామారావు, సెర్ప్ విజయభాస్కర్, పలు శాఖల ఏఈలు, డీఈలు, ఫీల్డ్, టెక్నికల్ అసిస్టెంట్లు, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.