ఉన్నోళ్లకూ.. సాయం!

ABN , First Publish Date - 2021-08-21T04:41:59+05:30 IST

కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల నుంచి అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన సమ్మాన నిథి పథకం లబ్ధిదారుల్లో అనర్హులున్నట్లు ప్రభుత్వం గుర్తించింది.

ఉన్నోళ్లకూ.. సాయం!

కిసాన సాయం లబ్ధిదారుల్లో స్థితిమంతులు

ఇందులో లక్షాధికారులు, విశ్రాంత ఉద్యోగులు 

జిల్లాలో 15,495 మంది అనర్హులను గుర్తించిన అధికారులు

వారికి ఆర్‌బీకేల నుంచి నోటీసులు

సొమ్ము రికవరీకి అధికారుల చర్యలు 

  

                   (ఆంధ్రజ్యోతి - గుంటూరు) 

కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల నుంచి అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన సమ్మాన నిథి పథకం లబ్ధిదారుల్లో అనర్హులున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ పథకం కింద ఏటా అర్హులైన రైతులకు వారి బ్యాంక్‌ ఖాతాల్లో మూడు విడతలుగా డబ్బు జమ అవుతాయి. కాగా పేద రైతుల కోసం అమలు చేస్తున్న ఈ పథకంలో లక్షాధికారులు, విశ్రాంత ఉద్యోగులు కూడా ఉన్నట్లు తేలింది. దీంతో వీరందరికీ నోటీసులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వారినుంచి పీఎం కిసాన సొమ్మును కూడా రికవరీ చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. 

  మూడేళ్ల కిందట ఎన్నికలకు ముందు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనిలో కొన్ని విధివిధానాలు రూపొందించి దరఖాస్తులు ఆహ్వానించారు. పట్టాదారు పాస్‌పుస్తకాల ఆధారంగా లబ్ధిదారులను గుర్తించారు. ఈ పఽథకం ప్రవేశపెట్టిన తరువాత ఇప్పటివరకు ఎనిమిదిసార్లు కేంద్రం రైతుల ఖాతాల్లో విడతకు రూ.2వేల చొప్పున డబ్బును జమచేసింది. ఇప్పటివరకు ఒక్కో రైతుకు  రూ.16 వేలు లబ్ధి చేకూరింది.

 ఇందులో అనర్హులు ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం వారి ఏరివేతకు ఉపక్రమించింది. ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ ఖాతా ద్వారా ఆధారాలు సేకరించింది. దీంతో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆదాయం పన్ను చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగులు కూడా ఈ లబ్ధి పొందినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఇలా జిల్లాలో మొత్తం 15,495మంది అనర్హులుగా తేల్చారు. ఇందులో ఆదాయపన్ను చెల్లించేవారు 13,495 మంది, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులుగా రిటైరన వారు (పెన్షనర్‌లు) 1,750 మంది ఉన్నారు.ఈ సొమ్మును రికవరి చేయటానికి చర్యలు తీసుకొంటున్నారు. 

పీఎం కిసానలో అనర్హులుగా గుర్తించిన 5,495 మందికి నోటీసులిస్తున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. వ్యవసాయ సబ్‌ డివిజన్లవారీగా అనర్హుల జాబితాలను పంపారు. మండలం యూనిట్‌గా రైతు భరోసా కేంద్రాల నుంచి వీటిని పంపిణీ చేస్తారు. అనర్హుల ఖాతాల్లో రూ.9.27 కోట్లు జమ అయిందని వాటిని రికవరీ చేస్తామని వ్యవసాయ శాఖ జేడీ విజయభారతి తెలిపారు.  

 

Updated Date - 2021-08-21T04:41:59+05:30 IST