పెట్రో పరుగు!
ABN , First Publish Date - 2021-02-06T05:52:08+05:30 IST
పెట్రోల్ ధర పరుగులిడుతోంది. డీజిల్ ధర దూసుకు పోతోంది. వందకు చేరువలోకి పెట్రోల్ ధర చేరుతోంది.

సెంచరీకి చేరువలో...
రూ.93.01కి చేరిన లీటరు పెట్రోల్ ధర
డీజిల్ ధర దూసుకు పోతోంది
ఇంధన వినియోగదారులు బెంబేలు
వ్యవసాయం, రవాణా రంగంపై తీవ్ర ప్రభావం
నరసరావుపేట, ఫిబ్రవరి 5: పెట్రోల్ ధర పరుగులిడుతోంది. డీజిల్ ధర దూసుకు పోతోంది. వందకు చేరువలోకి పెట్రోల్ ధర చేరుతోంది. దీంతో ఇంధన వినియోగదారులు విలవిల్లాడుతున్నారు. ధర రోజురోజుకు పెరుగుతుండటంతో అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. లీటరు పెట్రోల్ ధర శుక్రవారం రూ.93.01కి (నరసరావుపేటలో) చేరింది. పవర్ పెట్రోల్ ధర ఐతే లీటరు రూ.96.44కి చేరింది. ఇదే స్థాయిలో డీజిల్ ధరలు పెరుగు తుండటంతో వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. డీజిల్ లీటరు ధర రూ.86.22కి చేరుకుంది. నిత్యావసరాల్లో ద్విచక్ర వాహనం ఒకటైంది. ఏ పనికి వెళ్ళాలన్నా వాహన వినియోగం తప్పనిసరి. చిరు ఉద్యోగుల నుంచి బడాబాబుల వరకు వాహనం లేనిదే కాలు బయట పెట్టలేని పరిస్థితి. రోజురోజుకి ఇంధన ధరలు పెరుగుతుండటంతో మధ్య తరగతి వర్గాల వారు బెంబేలెత్తు తున్నారు. కొందరు ఉద్యోగులైతే ఒకే చోట పని చేసే వారు ఒక రోజు ఒకరి వాహనం, ఇంకొక రోజు ఇంకొకరిది.. ఇలా వాడుతున్న పరిస్థి తులు నెలకొన్నాయి. రబీ వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. డీజిల్ ధరలు పెరగటంతో వ్యవసాయ పనులకు ట్రాక్టర్ వినియోగం మరింత భారమైంది. గృహిణుల్లో కూడా వాహనాల వినియోగం పెరిగింది. పెట్రోల్ ధరలు పెరిగి పోతుండటంతో వాహనాలను పక్కనపెట్టి కాలికి పని చెప్పాల్సిన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఆటో వాలాల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. అద్దె ఆటోలను నిర్వహిస్తూ వేలాదిమంది యువకులు జీవనం సాగిస్తున్నారు. ఆటో బాడుగ డబ్బు ఆయిల్‌కే సరిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డీజిల్ ధరలు పెరగటంతో నిత్యావసర సరుకులు, కూరగాయలపై కూడా ప్రభావం చూపుతోది. వీటిధరలు కూడా చుక్కలను అంటుతున్నాయి. పొరుగు రాష్ట్రాలలో పెట్రోల్ ధరలు తక్కువగా ఉన్నాయని, అక్కడ అమలు చేస్తున్న విధానాలను మన రాష్ట్రంలో అమలు చేసి ఇందన ధరలను తగ్గించాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.