తెనాలిలో.. ఒమైక్రాన్‌

ABN , First Publish Date - 2021-12-30T05:58:29+05:30 IST

కరోనా కేసులు తగ్గాయి. జిల్లాలో నిత్యం చాలా తక్కువగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి.

తెనాలిలో.. ఒమైక్రాన్‌

జిల్లాలో తొలి కేసు నమోదు

నైజీరియా నుంచి వచ్చిన వ్యక్తికి నిర్ధారణ


తెనాలి, గుంటూరు, డిసెంబరు (ఆంధ్రజ్యోతి) 29: కరోనా కేసులు తగ్గాయి. జిల్లాలో నిత్యం చాలా తక్కువగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. టెస్టుల్లో పాజిటివిటీ ఐదు శాతం లోపే ఉంటుంది. ఇక జిల్లాలో కరోనా ముప్పు తప్పినట్లే  అని అందరూ భావిస్తున్న తరుణంలో ఒమైక్రాన్‌ కేసు తొలిగా తెనాలిలో నమోదైంది. రాష్ట్రంలో బుధవారం మొత్తం పది కేసులు ప్రకటిస్తే అందులో తెనాలిలో ఒక కేసు  ఒకటి. ఇటీవల నైజీరియా నుంచి వచ్చిన 48 ఏళ్ల వ్యక్తి ఒమైక్రాన్‌ బారిన పడినట్లు వైద్యఆరోగ్యశాఖ అధికారులు నిర్ధారించారు. ఇతడు ఈ నెల 18న తెనాలికి రాగా రెండు రోజుల తర్వాత స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష చేయించగా పాజిటివ్‌గా నిర్ధారణైంది. దీంతో అప్పుడే అప్రమత్తమైన వైద్యఆరోగ్యశాఖ అధికారులు అతడి జీనోమ్‌ సీక్వెన్స్‌ని హైదరాబాద్‌కి పంపించి టెస్టింగ్‌ చేశారు. ఒమైక్రాన్‌ సోకినట్లు బుధవారం స్పష్టమైంది. బాధితుడ్ని ఐసోలేషన్‌ చేసినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ తెలిపారు. జిల్లాలో ఒమైక్రాన్‌ కేసులు పెరిగితే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామన్నారు. తనకు కేవలం ఒక్కరోజే ఒళ్లు నొప్పులు అనిపించడం మినహా ఇతర కరోనా లక్షణాలు ఏమీ లేవని అతడు తెలిపారు. అతడి కుటుంబంలోనే మరో ముగ్గురు సభ్యులు ఉన్నా వారికి ఎటువంటి లక్షణాలు లేవు. తెనాలిలో తొలి ఒమైక్రాన్‌ కేసు నమోదు కావడంతో స్థానికులంతా అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు కరోనా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో రవిబాబు తెలిపారు. 


17 మందికి కరోనా

జిల్లాలో కొత్తగా 17 మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు. వారిలో ఒకరికి ఒమైక్రాన్‌ వేరియంట్‌ సోకినట్లు నిర్ధారణ జరిగింది. కాగా బుధవారం గుంటూరు నగరంలో 8, తాడేపల్లి అర్బన్‌లో 3, రూరల్‌లో 1, తుళ్లూరులో 1, పెదకాకానిలో 1, గురజాలలో 1, పిడుగురాళ్ల అర్బన్‌లో 1, రేపల్లె అర్బన్‌లో 1 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో తెలిపారు. 

Updated Date - 2021-12-30T05:58:29+05:30 IST