అపూర్వ స్వాగతం

ABN , First Publish Date - 2021-12-27T05:21:28+05:30 IST

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, తెలుగు రైతు బిడ్డ జస్టిస్‌ నూతలపాటి రమణకు అమరావతి రాజధాని రైతులు ఘనస్వాగతం పలికారు.

అపూర్వ స్వాగతం

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమణకు రాజధాని రైతుల ఘన స్వాగతం

మూడు కిలోమీటర్ల మేర పూల జల్లు

జాతీయ జెండాలు, స్వాగత ప్లకార్డుల ప్రదర్శన 

రైతులకు అభివాదం చేసుకుంటూ కదిలిన సీజేఐ కాన్వాయ్‌ 

 

తుళ్లూరు, డిసెంబరు 26: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, తెలుగు రైతు బిడ్డ జస్టిస్‌ నూతలపాటి రమణకు అమరావతి రాజధాని రైతులు ఘనస్వాగతం పలికారు. ఆదివారం ఆయన నేలపాడులోని హైకోర్టుకు వచ్చి బార్‌ అసోసియేషన్‌ సత్కార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు రాజధాని రైతులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాయపూడిలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవన సముదాయాల దగ్గర నుంచి హైకోర్టు ప్రాంతం వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర రోడ్డు పక్కన జాతీయ జెండాలు, స్వాగత ప్లకార్డులు, పూలు పట్టుకొని నాలుగు గంటలపాటు వేచి ఉన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని సీజేఐ మధ్యాహ్నం 2.45గంటలకు రాగా అప్పటివరకు రైతులు ఎండను సైతం లెక్క చేయకుండా రోడ్డు పక్కన నిల్చునే ఉన్నారు. సీజేఐ కాన్వాయ్‌ హైకోర్టు రోడ్డులోకి ప్రవేశించగానే రైతులు పూలు చల్లారు. కారు టాప్‌ నుంచి రైతులకు, మహిళలకు ఆయన అభివాదం చేసుకుంటూ ముందుకు కదిలారు. ఎక్కడా ఆగకుండా నేరుగా హైకోర్టు వద్దకు వెళ్లారు. ఆయనకు అందించేందుకు కొందరు బుద్ధుని ప్రతిమ, పెరటిలో పండిన పండ్లు తీసుకుని రాగా ఆ అవకాశం కలగలేదు. అయినా ఎంతో  ఆనందంగా ఉందని మహిళలు చెప్పారు. రైతు బిడ్డ, తెలుగుతేజం జస్టిస్‌ రమణ దేశంలోనే ఉన్నతమైన కీర్తి శిఖరాన్ని అధిరోహించటం చాలా గర్వంగా ఉందని రైతులు తెలిపారు.  

 

Updated Date - 2021-12-27T05:21:28+05:30 IST