నై..ట్ షెల్టర్లు
ABN , First Publish Date - 2021-12-27T05:27:45+05:30 IST
చూసే వారు లేక.. ఇళ్ల నుంచి పారిపోయి వచ్చిన వారు.. గ్రామాల్లో బతకలేక ఇలా ఎందరో అభాగ్యులు పట్టణాలు, నగరాలను ఆశ్రయిస్తుంటారు.

నిర్వహణపై ప్రభుత్వ నిర్లక్ష్యం
చలికి వణుకుతున్న నిరాశ్రయులు
ఫుట్‌పాత్‌లు, రోడ్డుపక్క స్థలాల్లో ఆశ్రయం
నిద్రకు.. ఆకలికి అలమటిస్తున్న అభాగ్యులు
ఉన్న వాటిని పట్టించుకోరు.. కొత్తగా నిర్మించరు
సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా పట్టించుకోని అధికారులు
గూడు లేని.. ఆదరించే వారు లేని అభాగ్యులు వారు. అలాంటి వారికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఆశ్రయం కల్పించి ఆదరించాలి.. రోడ్లపై చలికి వణికుతూ.. ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ ఎందరో అభాగ్యులు కనిపిస్తుంటారు. వారి అవస్థలు చూసిన వారు అయ్యోపాపం అంటారు. ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు కూడా గతంలో ప్రత్యేకంగా స్పందించి నిరాశ్రయులకు నీడ కల్పించాలని తీర్పు ఇచ్చింది. దీంతో అప్పటి ప్రభుత్వం నైట్‌షెల్టర్లను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం నిధులు సమకూర్చి.. స్వచ్ఛంద సంస్థలు నిర్వహించేలా.. స్థానిక మున్సిపల్ అధికారులకు పరిశీలన బాధ్యతలు అప్పగించింది. దీంతో ఆయా ప్రాంతాల్లోని నిరాశ్రయులు ఈ కేంద్రాల్లో ఆశ్రయం పొందేవారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం వాటి నిర్వహణను పట్టించుకోవడంలేదు. ఈ పరిస్థితుల్లో తిండికి ఎలాగోలా తిప్పలు పడే అభాగ్యులు.. ఆశ్రయం కోసం అల్లాడుతున్నారు. షెల్టర్ జోన్లకు నిధులు విడుదల చేయడంలేదు. పైగా స్థానిక అధికారుల నిరాసక్తతో చాలాప్రాంతాల్లో మూతపడగా.. కొన్ని దగ్గర్ల పేరుకు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ సరైన వసతులు లేకపోవడంతో నిరాశ్రయులు రావడంలేదు.
దాతల ఔధార్యంతో దుప్పట్లు
వర్షాకాలం, చలికాలంలో చలిగాలులకు రోడ్లపై నిద్రించే నిరాశ్రయులు తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు. దోమలతో కంటి మీద కునుకు ఉండదు. రోడ్డు పక్కన చలికి వణుకుతూ కనిపించే వారిని చూసిన వారు మానవత్వంతో స్పందించి ఆహారం, దుప్పట్లు వంటివి అందజేస్తుంటారు. ఇలాంటివారు అందచేసే దుప్పట్లతో చలిగాలులు, దోమల నుంచి రక్షణ పొందుతుంటారు. మళ్లీ కొత్తగా ఎవరైనా దాతలు ఇచ్చే వరకు గతంలో అందజేసిన దుప్పట్లతోనే కాలం వెళ్లదీస్తూ ఉంటారు. రోడ్లపై ఆశ్రయం పొందేవారు వ్యక్తిగత శుభ్రత లోపించి రోగాల బారిన పడుతున్నారు. స్నానం తదితరాలు లేక, దుస్తులు శుభ్రం చేసుకునే పరిస్థితి లేక మురికిగా కాలం వెళ్లదీస్తుంటారు.
(ఆంధ్రజ్యోతి - న్యూస్ నెట్‌వర్క్)
చూసే వారు లేక.. ఇళ్ల నుంచి పారిపోయి వచ్చిన వారు.. గ్రామాల్లో బతకలేక ఇలా ఎందరో అభాగ్యులు పట్టణాలు, నగరాలను ఆశ్రయిస్తుంటారు. ఇలాంటి వారు తమకు చేతనైన చిన్నాచితకా పనులు చేసుకుంటూ రాత్రిళ్లు రోడ్లపైన నిద్రిస్తుంటారు. చలి, వర్షాకాలాల్లో ఇలాంటి వారు రోడ్లపై నిద్రించలేక తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటారు. గతంలో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో ఆశ్రయం పొందేవారు. అయితే రైల్వే, ఆర్టీసీ అధికారులు వీరిని రానీయకపోవడంతో రోడ్లే దిక్కవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు తీర్పుతో పట్టణ కేంద్రాల్లో నైట్‌షెల్టర్లను ఏర్పాటు చేశారు. బాటసారులు, కార్మికులు రాత్రి సమయాల్లో ఇక్కడ బస చేసే ఏర్పాట్లు చేశారు. పగలంతా కష్టపడి పనిచేసి పొట్టనింపుకొని సుఖంగా నిద్రపోవడానికి అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో నైట్‌షెల్టర్లను ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం వీటిని పట్టించుకోవడంలేదు. నిధులు మంజూరుకాక.. నిర్వహణ లేక చాలాదగ్గర్ల నైట్‌షెల్టర్లు మూత పడ్డాయి. మరికొన్ని దగ్గర్ల పేరుకు మాత్రం ఉన్నాయి. తలదాచుకోవటానికి నైట్ షెల్టర్లు లేక పోవటంతో ఇక్కట్లు పడాల్సి వస్తుందని నిరాశ్రయులు, కార్మికులు, బాటసారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత మూడు రోజులుగా జిల్లాలో విపరీతంగా వీస్తున్న చలిగాలుల మధ్యే అభాగ్యులు ఎందరో రోడ్లపైనే ఒకవైపు దోమలు, మరోవైపు చలికి వణుకుతూ నిద్రిస్తున్నారు. నిరాశ్రయుల్లో వృద్ధులు ఎక్కువగా ఉండడంతో వారి యాతన చెప్పనలివి కాకుండా ఉంది. ఇక పనులు దొరక్క ఆకలితో అలమటించే వారు కూడా ఎందరో ఉన్నారు. సుదూర ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వచ్చి లాడ్జీల్లో అద్దెలు భరించలేని పేదలకు కూడా ఈ నైట్‌షెల్టర్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఈ పరిస్థితుల్లో ఎక్కడికక్కడ నైట్‌షెల్టర్లను పునరుద్ధరించి నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థల సహకారంతో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పలువురు కోరారుతున్నారు.
- గుంటూరు నగరంలోని నైట్ షెల్టర్ జోన్స్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అధ్వానంగా మారాయి. ఆర్టీసీ బస్టాండ్ వెనుక, పట్టాభిపురం, అరండల్‌పేట ఒకటో లైనులోని నైట్ షెల్టర్ జోన్లను పట్టించుకునే వారే లేరు. ఒకప్పుడు పెద్ద సంఖ్యలో నిరాశ్రయులు వీటిల్లో ఆశ్రయం పొందేవారు. ప్రస్తుతం ఈ మూడు జోన్లలో పట్టుమని పది మంది కూడా లేరు. అరండల్‌పేట, బ్రాడీపేట, నాజ్‌సెంటరు, జీజీహెచ్, పట్నంబజారు తదితర ప్రాంతాల్లో రోడ్లు, దుకాణాల ఎదుట నిరాశ్రయులు చలికి మగ్గుతూ నిద్రిస్తున్నారు.
- తెనాలి ప్రాంతంలో పట్టణ శివార్లలో బాలాజిరావు పేటలో ఆ పరిసర ప్రాంతవాసులకు తప్పించి మిగిలన వారెవ్వరికీ తెలియకుండా ఏర్పాటు చేశారు. అందులో వసతులు అంతంతమాత్రమే. 30- 35 మందికి మాత్రమే ఆశ్రయం పొందే ఏర్పాట్లు ఉన్నాయి. అయితే తెనాలి ప్రాంతంలో దాదాపుగా 300 - 500 వరకూ నిరాశ్రయులు నిత్యం రోడ్లపై కనిపిస్తుంటారు. నిరాశ్రయులందరికీ షెల్టర్ ఉండాలని గత ప్రభుత్వ హయాంలో 2018లో రైల్వేస్టేషన్‌కు అతి సమీపంలో నిరాశ్రయుల ఆశ్రమం నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం మారడంతో పనలుఉ నిలిచిపోయాయి. ఆక్రమణదారులు ఖాళీగా ఉన్న ఆ స్థలంపై కన్నేశారు.
- వినుకొండ మున్సిపాలిటీ పరిధిలో ఏనుగుపాలెం రోడ్డులోని రైల్వేగేటు సమీపంలో గత ఏడాది ఏర్పాటు చేసిన నిరాశ్రయుల ఆశ్రమం అలంకారప్రాయంగా మారింది. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో ఇక్కడ ఆశ్రయం పొందుతున్న వారికి దుప్పట్లు, దిండ్లు తప్ప ఇతర వసతి సౌకర్యాలు అందడంలేదు. భోజన వసతి లేక పోవడంతో ఆకలికి అలమటిస్తున్నారు. కొందరు మాత్రం పట్టణంలోని కాశీనాయన ఆశ్రమంలో ఆకలి తీర్చుకుంటున్నారు.
- పొన్నూరు పట్టణంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక నైట్ షెల్టరు వినియోగంలోలేదు. దీంతో బాటసారులు, రిక్షా కార్మికులు డివైడర్లు, రైల్వే వంతెనలపై నిద్రిస్తున్నారు. ఇలాంటి వారు పట్టణంలో 40 నుంచి 50 మంది వరకు ఉంటారు.
- నరసరావుపేటలో కాంట్రాక్ట్ ముగియడంతో నిరాశ్రయుల వసతిగృహం మూతపడింది. ఈ వసతిగృహ పునరుద్ధరణపై మునిసిపల్ అధికారులు చర్యలు చేపట్టలేదు. దీంతో పట్టణంలోని నిరాశ్రయులు దుకాణాల ఎదుట, రైల్వేస్టేషన్ ప్రాంతాల్లో రోడ్లపై నిద్రిస్తున్నారు.
- చిలకలూరిపేటలో మర్రి చెన్నారెడ్డి మునిసిపల్ పాఠశాలలో గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన నైట్‌షెల్టర్ మూతపడింది. సుమారు రూ.10 లక్షల వరకు షెల్టర్ కోసం ప్రభుత్వం ఖర్చు చేసింది. అయినా ప్రస్తుతం బ్యాంక్‌కాలనీలో అద్దె భవనంలో నైట్‌షెల్టర్‌ను అట్టహాసంగా ప్రాంభించారు. అయితే చలికాలం ప్రవేశించినా ఇక్కడ సేవలు ప్రారంభం కాలేదు. ప్రభుత్వం నిధుల విడుదలలో జాప్యం కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని సమాచారం.
- దాచేపల్లి, గురజాల పురపాలక సంఘాల్లో అలాంటివేమీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. పిడుగురాళ్లలో కొన్నాళ్లుగా నైట్ షెల్టర్ కొనసాగుతున్నా అక్కడికి వచ్చి వసతి పొందే వారు తక్కువే. పురపాలక సంఘం శీతకన్ను వేయటంతో పాటు నిధుల లేమి సమస్య వెంటాడుతుంది. స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో కొనసాగుతున్న నైట్ షెల్టర్ అంత ఉపయోగంగా లేదని నిరాశ్రయులు వాపోతున్నారు.
- మాచర్ల పట్టణంలో నైట్ షెల్టర్ ఊసే లేదు. నిరాశ్రయులు రైల్వే స్టేషన్, బస్టాండ్, ఆలయాలను ఆశ్రయిస్తున్నారు. అసలే చలికాలం కావడం, విపరీతంగా చలి ఉండడంతో అల్లాడిపోతున్నారు.
- రేపల్లెలో ఐదో వార్డులో నిరాశ్రయుల వసతి గృహంలో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. 18 మంది ఉంటున్నట్లు సిబ్బంది తెలుపుతున్నా 10 మంది మాత్రమే ఆశ్రయం పొందుతున్నట్లు సమాచారం.
- బాపట్లలోని జీబీసీరోడ్డులో పోలేరమ్మ దేవాలయం సమీపంలో గత ప్రభుత్వ హయాంలో నైట్‌షెల్టర్‌ను ఏర్పాటు చేశారు. అయిఏ దీని గురించి తెలియక పోవడంతో నిరాశ్రయులు అనేకమంది రైల్వేస్టేషన్, బస్టాండ్, ఫుట్‌పాత్‌లపై ఆశ్రయం పొందుతున్నారు.
