సర్పంచ్‌ భర్త హత్య

ABN , First Publish Date - 2021-12-09T05:51:57+05:30 IST

పాతకక్షల నేపథ్యంలో సర్పంచ్‌ భర్త హత్యకు గురైన ఘటన రాజుపాలెం మండలంలోని నెమలిపురి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.

సర్పంచ్‌ భర్త హత్య
సర్పంచ్‌ భర్త కొర్రకూటి శ్రీనివాసరావు మృతదేహం వ ద్ద రోదిస్తున్న కుటుంబసభ్యులు

పాత కక్షల నేపథ్యంలో ఘటన

 రాజుపాలెం, డిసెంబరు 8: పాతకక్షల నేపథ్యంలో సర్పంచ్‌ భర్త హత్యకు గురైన ఘటన రాజుపాలెం మండలంలోని నెమలిపురి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాలు ఇలా ఉన్నాయి... గ్రామ సర్పంచ్‌ కొర్రకూటి వెంకాయమ్మ భర్త శ్రీనివాసరావు(46), అదేగ్రామానికి చెందిన కుర్రా వీరనారాయణకు గతంలో గొడవలు జరిగాయి. 2014 ఎన్నికల తర్వాత గొడవలు జరిగి కేసులు కూడా పెట్టుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో బుధవారం శ్రీనివాసరావు ద్విచక్రవాహనంపై పొలానికి వెళ్లి వస్తుండగా  పోలేరమ్మగుడి వద్దకు వచ్చేసరికే వీరనారాయణ ఆపాడు. మాట్లాడే క్రమంలో  రాడ్డు తీసుకొని బలంగా తలపై కొట్టాడు. దీంతో తీవ్ర రక్తస్రావమైన శ్రీనివాసరావును హుటాహుటిన చికిత్స నిమిత్తం పిడుగురాళ్ల ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అప్పటికే శ్రీనివాసరావు మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోస్టుమార్టం నిమిత్తం శ్రీనివాసరావు మృతదేహాన్ని సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. సత్తెనపల్లి డీఎస్పీ ఆర్‌.విజయభాస్కరరెడ్డి, సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్‌ఐ అమీర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాసరావు మృతదేహాన్ని బుధవారం ఏరియా వైద్యశాలలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు, వైసీపీ నేతలు సందర్శించి నివాళులర్పించారు. 


Updated Date - 2021-12-09T05:51:57+05:30 IST