రియల్‌.. మర్డర్‌

ABN , First Publish Date - 2021-07-08T06:25:17+05:30 IST

తెలతెలవారుతున్న సమయంలో..

రియల్‌.. మర్డర్‌
సంఘటన పై పోలీసులను వివరాలు అడిగి తెలుసుకుంటున్న డాక్టర్‌ చదలవాడ అరవింద బాబు

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి హత్య

నరసరావుపేటలో తెల్లవారుజామున దారుణం


నరసరావుపేట7: తెలతెలవారుతున్న సమయంలో పట్టణవాసులను గగుర్పాటుకు గురి చేసేలా నరసరావుపేట శివార్లలో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి హత్యకు గురయ్యాడు. వెంచర్‌లోని ప్లాట్లు చూసుకుంటూ స్కూటీపై వెళ్తున్న వ్యక్తి ముఖంపై సర్ఫ్‌ చల్లి కొబ్బరిబోండాల కత్తితో నరికేసిన ఘటన బుధవారం తెల్లవారుజామున జరిగింది. ఇందుకు సంబంధించి నరసరావుపేట డీఎస్పీ విజయభాస్కరరావు తెలిపిన వివరాలు.. నరసరావుపేట పట్టణానికి చెందిన కోటపాటి మల్లికార్జునరావు(వెంగమాంబ మల్లికార్జునరావు) కొంతకాలంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడు. బుధవారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చి రావిపాడురోడ్డులోని పెట్రోల్‌ బంకు వద్ద గల టీ స్టాల్‌ వద్దకు చేరుకుని సహచరులతో కలసి టీ తాగాడు. 


5:30 గంటల వరకు అక్కడే ఉన్న అతడు ఆ తర్వాత రావిపాడు రోడ్డులోని సెయింట్‌ మేరీస్‌ స్కూల్‌ ఎదురుగా ఉన్న తన వెంచర్‌ వద్దకు వెళ్లాడు. ఆ ప్రాంతంలో స్కూటీపై వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ముఖంపై సర్ఫ్‌ చల్లటంతో అదుపు తప్పి కింద పడి పోయాడు. ఈ క్రమంలో ఆ వ్యక్తులు కొబ్బరిబోండాలు నరికే కత్తితో ఆయన మెడ, ఎడమ భుజంపై నరికారు. తీవ్ర రక్తస్రావమై ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. హత్య  సమాచారం తెలుసుకున్న డీఎస్పీ విజయభాస్కరరావు, రూరల్‌ సీఐ అచ్చయ్య, ఎస్‌ఐలు లక్ష్మీనారాయణరెడ్డి, శ్రీహరి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం గుంటూరు నుంచి క్లూస్‌ టీమ్‌ను రప్పించారు. ఈ టీమ్‌ స్థలంలో ఆధారాలు సేకరించింది. కాగా 2019 సెప్టెంబరులో పట్టణానికి చెందిన మరో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి రమేష్‌ హత్య కేసులో మల్లికార్జునరావు ప్రధాన నిందితుడు. ఈ క్రమంలో మల్లికార్జునరావు హత్యకు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారమా?, ఆర్థిక లావాదేవీలా?, ఇతర వ్యవహారాలు కారణమా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు. హతుడి కుమారుడు సాయి కృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


నిందితులను కఠినంగా శిక్షించాలి 

మల్లికార్జునరావును హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని టీడీపీ నియోజక వర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు కోరారు. సంఘటనాస్థలాన్ని పరిశీలించిన ఆయన పోలీసులను అడిగి ఘటన వివరాలు తెలుసుకున్నారు. ప్రశాంతంగా ఉండే నరసరావుపేటలో ఇటువంటి హత్యలతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. 


===========================================


Updated Date - 2021-07-08T06:25:17+05:30 IST