ఆలకించండి.. ఆదుకోండి

ABN , First Publish Date - 2021-03-22T05:07:07+05:30 IST

గుంటూరు నగరంలో పారిశుధ్యం, మురుగునీటి పారుదల అస్తవ్యస్తంగా ఉంది. అపరిశుభ్రమైన తాగునీరు సరఫరా అవుతోంది.

ఆలకించండి.. ఆదుకోండి
గుంటూరు శివారు కాలనీలో వాటర్‌ ట్యాంక్‌ వద్ద నీళ్లు పట్టుకుంటున్న ప్రజలు

పట్టణాలను పీడిస్తోన్న సమస్యలు

అపరిష్కృత సమస్యలతో సహజీవనం

పారిశుధ్యం, మురుగు పారుదల అస్తవ్యస్తం

ఆక్రమణలు.. ఇరుకు రోడ్లు.. ట్రాఫికర్‌ మధ్య పట్టణవాసి


పేరుకే అవి పట్టణాలు.. కాని సమస్యలు కేంద్రాలు. తాగునీరు సక్రమంగా అందదు.. అందితే కలుషితం. వేసివిలో అయితే నీటి కోసం నిరీక్షించాల్సిందే. శివారు ప్రాంతాల్లోని వారైతే ట్యాంకర్ల కోసం కళ్లుకాయలు కాచేలా ఎదురుచూడాలి. ఇప్పటికీ కుళాయి కనెక్షన్‌ లేని ఇళ్లు పలు పట్టణాలు వేల సంఖ్యలో ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో నీటి వ్యాపారం రూ.కోట్లలో జరుగుతుందంటే మున్సిపాలిటీలు సరఫరా చేసే తాగునీరు ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. రోడ్లు ఉన్నా గుంతలతో నిండి ఉంటాయి. మురుగు పారని డ్రెయిన్లు. వర్షం వస్తే తటాకాలను మరిపించే మార్గాలు.  పిచ్చిమొక్కలతో నిండిన ఖాళీ స్థలాలు. ఇరుకు రోడ్లు.. ఆక్రమణలు.. కదలని వాహనాలతో రోడ్డెక్కాలంటే అటు పాదచారులు, ఇటు వాహన చోదకులు అల్లాడిపోవాల్సిందే. చెత్తాచెదారాలు.. మురుగు.. దుర్వాసనలతో పట్టణవాసులు దుర్భర జీవితం గడుపుతున్నారు. శివారు ప్రాంతాలు, మురికివాడల్లో అయితే.. అన్నీ సమస్యలే. ఇక దోమలు, కుక్కలు, కోతులు.. ఇలా ఎన్నో ఎన్నెన్నో సమస్యలతో సహజీవనం చేస్తున్నారంటే.. వారు పట్టణ ప్రజలు అనడంలో పెద్ద విశేషం ఏమీ లేదు. పాలకులు మారుతున్నారు.. అయినా సమస్యలు తరగడంలేదు.. ఏటికేడు పెరుగుతూనే ఉన్నాయని ప్రజలు ఆవేదన ఆలకించేవారే లేరు. ముక్కు పండి పన్నులు వసూలు చేస్తున్నా.. సమస్యల్లో పుట్టి.. సమస్యల మధ్య పెరుగుతూ.. సమస్యలతో కాలం వెళ్లదీయాల్సి వస్తోందని పురప్రజలు వాపోతున్నారు. ప్లాస్టిక్‌ వినియోగం నియంత్రణలో అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ఏ కాల్వలో చూసినా ప్లాస్టిక్‌ కవర్లు, ప్లాస్టిక్‌ వ్యర్థాలు పేరుకుపోయి కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇటీవల కొలువుదీరిన పురాధీశులు తమ సమస్యలు ఆలకించి ఆదుకోవాలని జిల్లాలోని మున్సిపల్‌ కేంద్రాల్లోని ప్రజలు అభ్యర్థిస్తున్నారు. ఎంతో కాలంగా పట్టణాలను పట్టి పీడిస్తున్న సమస్యల పరిష్కారం కోసం పుర ప్రజలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.


జిల్లా కేంద్రం.. సమస్యలనేకం

గుంటూరు నగరంలో పారిశుధ్యం, మురుగునీటి పారుదల అస్తవ్యస్తంగా ఉంది. అపరిశుభ్రమైన తాగునీరు సరఫరా అవుతోంది. నగరంలో ఇంటింటికి కుళాయిలు అటకెక్కాయి. ఇప్పటికీ పైపులైను లేని ప్రాంతాలు అనేకం ఉన్నాయి. ట్యాంకుల ద్వారా సరఫరా, డయల్‌ ట్యాంకర్‌ తదితరాలు అమలు కావడంలేదు. ప్రపంచ బ్యాంక్‌ సహకారంతో నగరంలో రూ.460 కోట్లతో చేపట్టిన సమగ్ర తాగునీటి పథకం పనులు అరకొరగానే జరిగాయి. పాతగుంటూరులోని ప్రగతినగర్‌, అంబేద్కర్‌నగర్‌, చాకలిగుంట, జియావుద్దీన్‌నగర్‌, రెడ్డిపాలెం శివారు ప్రాంతాలైన శివనాగరాజుకాలనీ,ఆంజనేయకాలనీ, హిమనీనగర్‌, సరస్వతి నగర్‌, ఇన్నర్‌రింగ్‌ రోడ్డు, ఫేజ్‌ 1-2 ఇరువైపుల, గోరంట్ల, స్వర్ణబారతినగర్‌, జర్నలిస్టుల కాలనీ, టిడ్కో హౌసింగ్‌ ఇళ్లు తదితర ప్రాంతాల్లో పైపులైన్లు ఏర్పాటు చేయలేదు. ఇక ట్రాపిక్‌ సమస్య రోజురోజుకు జటిలమవుతోంది. పట్నంబజార్‌, పాతబస్టాండ్‌, ఆర్టీసీ బస్టాండు, నాజ్‌సెంటర్‌, ఓల్డుక్లబ్‌ రోడ్డు, కొత్తపేట, ఆర్‌ అగ్రహారం, అరండల్‌పేట, బ్రాడీపేట, కొరిటెపాడు వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్యతో ఆ ప్రాంత ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. రోడ్ల కంటే డ్రెయిన్లు, కల్వర్టులు ఎత్తుగా నిర్మించడంతో ఓ మోస్తరు వర్షానికి రోడ్లపై నీరు నిలిచి చెరువులను మరిపిస్తుంటాయి. నగరంలోకి వచ్చే ప్రధాన రహదారుల్లో ముఖ్యమైన పలకలూరు రోడ్డు, సీతయ్య డొంక మార్గాల్లో మోకాలిలోతు గుంతలు ఉన్నాయి. పారిశుధ్యం అధ్వానంగా ఉంది. దోమలు, కుక్కల సమస్యలతో ప్రజలు అల్లాడుతున్నారు.  


రోజుమార్చి రోజు తాగునీరు

చిలకలూరిపేట పట్టణంలో ప్రధాన కాల్వలు, అంతర్గత కాల్వలపై అక్రమ నిర్మాణాల కారణంగా పారిశుధ్య సిబ్బంది పూడిక తీసేందుకు వీలుపడటం లేదు. దీంతో మురుగు పేరుకుపోయి దుర్వాసనతో పాటు దోమల ఉధృతి పెరిగింది. సుబ్బయ్యతోట ప్రాంతం నుంచి బయటకు వెళ్లే సరైన మార్గం లేక తరచూ మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోంది. వర్షం పడినప్పుడల్లా సంజీవ్‌నగర్‌లో మోకాలిలోతు నీరు చేరుతోంది. పండరీపురం, సుబ్బయ్యతోట ప్రాంతాల్లో దశాబ్దాలక్రితం నిర్మించిన కాల్వలు శిథిలావస్థకు చేరాయి. పట్టణంలో రోజుమార్చి రోజు తాగునీటి సరఫరా జరుగుతుంది. శివారుకాలనీలకు ట్యాంకర్లతోనే సరఫరా చేస్తున్నారు. అమృత్‌ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పథకానికి సంబంధించి మునిసిపల్‌ వాటా నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చెల్లించలేదు.  పలు ప్రాంతాల్లో సీసీ రోడ్లు పగలగొట్టి పైపులైన్లు వేసి వాటిని సక్రమంగా పూడ్చలేదు. సాగర్‌ కుడి కాల్వ జీబీసీ కెనాల్‌ నుంచి మంచినీటి చెరువుల వరకు తాగునీటి పైపులైన్ల నిర్మాణం నిలిచిపోయింది. మెయిన్‌బజారు, చలివేంద్రం, బజారు, స్టీలుకొట్ల బజారు, మార్కెట్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా ఉంది. దశాబ్దాలకాలంగా రహదారుల విస్తరణ జరగలేదు. ఎన్‌ఆర్టీ సెంటర్‌, విజయబ్యాంకు సెంటర్‌, అడ్డరోడ్డు సెంటర్‌లలో జాతీయ రహదారి దాటాలంటే ప్రజలు నరకయాతన పడుతున్నారు. పద్మశాలిపేట, రజకకాలనీ, పురుషోత్తమపట్నంలోని పట్టణ ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లో సరైన వైద్య సౌకర్యాలు లేవు.


తాగునీరివ్వండి సారూ..

సుమారు లక్షకు వరకు జనాభా ఉన్న పిడుగురాళ్లలో పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా అందని ద్రాక్షాగానే మిగిలింది. తాగునీటి పథకం పనులు మరమ్మత్తులతోనే సరిపోతుంది. సగం పట్టణానికే గతంలో వేసిన పైపులైన్ల ద్వారా నీటి సరఫరా అరకొరగానే అందుతుంది. దీంతో ప్రజలు క్యాన్‌ వాటర్‌పైనే అధారపడుతున్నారు. పారిశుధ్యం పడకేస్తున్నా పట్టించుకునే వారే లేరు. జానపాడు రోడ్డులో డ్రెయిన్‌లో మురుగు పారుదల లేదు. ఐలాండ్‌ సెంటర్‌, జానపాడు రోడ్డు, మాయబజార్‌, పోలీస్టేషన్‌ సెంటర్లలో ట్రాఫిక్‌ నియంత్రణ చేపట్టాల్సి ఉంది. రహదారికి ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తొలిగించాలి. ప్రభుత్వ ప్రాథమిక కేంద్రం, ముఖ్యమంత్రి ఆరోగ్యకేంద్రం ఉన్నప్పటికీ ప్రాథమిక చికిత్సకు కూడా సరైన సదుపాయంలేదు. 


అపరిశుభ్ర నీరే దిక్కు

వినుకొండలో పారిశుధ్యం, తాగునీరు, ట్రాఫిక్‌, రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. సుమారు 70 వేలు జనాభా ఉన్న పట్టణానికి సింగరచెరువు ద్వారా  తాగునీరు అందాల్సి ఉంది. చెరువు కట్టలను మెరుగుపరిచారే తప్ప నీటి శుద్ధిపై అధికారులు శ్రద్ధ చూపకపోవడంతో నీరు పాచిపట్టి దర్శనమిస్తున్నాయి. ఇంటింటికి కుళాయిలు లేవు. ట్యాంక్‌ల నిర్వహణ కూడా అంతంత మాత్రంగానే ఉంది. పట్టణంలో నరసరావుపేటరోడ్డులోని అరుణ హాల్‌ పక్కన పారిశుధ్యం లోపించింది. సులబ్‌ కాంప్లెక్స్‌లు లేకపోవడంతో బహిరంగ ప్రదేశాల్లోనే ప్రజలు మలమూత్రాలకు వెళ్తున్నారు. పట్టణంలో సీసీ రోడ్లు వేసిన నెలల వ్యవధిలోనే దెబ్బతిన్నాయి.   కారంపూడి, మార్కాపురం, నరసరావుపేటరోడ్లతో పాటు లాయర్‌స్ర్టీట్‌లో కూడా ట్రాఫిక్‌ సమస్య ఎక్కువగా ఉంది.  





మాచర్లంతా.. మౌలిక సమస్యలే

మాచర్ల పట్టణంలో ప్రధానంగా పారిశుధ్యం, తాగునీరు, వీధి దీపాలు తదితర మౌలిక వసతుల లేమి కనిపిస్తోంది. శివారు కాలనీల్లో సరైన రహదారులు లేవు. నీటి వసతి కూడా అంతంత మాత్రమే. పురపాలక సంఘం నుంచి నీటి ట్యాంకరు వెళ్తేనే తప్ప దాహం తీరని వార్డులు అనేకం ఉన్నాయి. సైడు కాలువలు లేక  సంగతి  పట్టణ నడిబొడ్డు ఉన్న రహదారులపైకి మురుగు పొంగిపొర్లుతున్నాయి. పూడికతీత, మరమ్మతులు నిర్వహించక పోవడంతో డ్రెయిన్లు అధ్వానంగా ఉన్నాయి. ఏ వీధి చూసినా వందల సంఖ్యలో గుంపులు గుంపులుగా కోతులు సంచరిస్తున్నాయి.  శివారు ప్రాంతాల్లో కొండరాళ్లు, ముళ్ల పొదల మధ్యనే గృహాలకు చేరుకోవాల్సిన దుస్థితి నెలకొంది. 


సమస్యల నిలయంగా రేపల్లె  

తీరప్రాంతంలోని రేపల్లె పురపాలక సంఘం సమస్యల నిలయంగా ఉంది. పట్టణంలో 28 వార్డుల్లో ఏళ్ల తరబడి సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. 50వేల జనాభా ఉన్న పురపాలక సంఘానికి కంపోస్టు యార్డు లేదు. దీంతో ఉత్పత్తి అయ్యే చెత్తాచెదానాలపే అరవపల్లి రోడ్డులో మౌంట్‌పోర్టు సమీపంలో వేస్తున్నారు. దీంతో  ఆ చుట్టు పక్కలవారంతా అనేక రకాలుగా ఇబ్బందులకు గురువుతున్నారు. 5 దశాబ్దాలుగా పాతపట్నం రహదారి అభివృద్ధికి నోచుకోలేదు. పక్కా డ్రెయినేజి వ్యవస్థలేక ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. చిన్నపాటి వర్షం వస్తే రోడ్లు చెరువుల్లా మారుతున్నాయి. తాగునీటి పైపులు మార్చకపోవటంతో ఎక్కడికక్కడ పగిలిపోయి లీకులు అవుతున్నాయి. 


తెనాలి.. మురుగుమయం

తెనాలి పట్టణాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల పరిష్కారం కోసం ప్రజలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. పట్టణ శివారులోని అన్ని వార్డుల్లో మురుగు సమస్య తాండవిస్తోంది. చెత్తా చెదారం, వ్యర్థాలు, ఫ్లాస్టిక్‌ సంచులతో డ్రెయిన్లు నిండిపోతున్నాయి. బోస్‌రోడ్డులోని మెట్రో షూమార్ట్‌ దగ్గర, మెయిన్‌రోడ్డు, గంగానమ్మ గుడి ప్రాంతాల్లో ట్రాఫిక్‌ నిత్యం రద్దీగా ఉంటుంది. ఎన్ని సార్లు ఎన్ని ప్రణాళికలు చేసినా ట్రాఫిక్‌ నియంత్రణ చేయలేకపోతున్నారు. కొంతకాలంగా రోడ్ల నిర్మాణం జరగలేదు. దీంతో పట్టణంలో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. కొన్ని ప్రధాన వీధులు చిధ్రమయ్యాయి. చినకుపడితే చిత్తడిగా  మారుతున్నాయి.


సత్తెనపల్లాంతా.. సమస్యలే

సత్తెనపల్లి పట్టణం సమస్యలకు నెలవుగా ఉంది. డ్రెయిన్లు లేక పలు ప్రాంతాల్లో మురుగునీరు రోడ్ల పక్కనే నిలిచి పారిశుధ్యం క్షీణించింది. దోమలు వృద్ధి చెందుతున్నాయి. యానాదికాలనీ, శివాజి 6వ నగర్‌లైన్‌లోని కొత్తకాలనీ ప్రాంతాల్లో పారిశుధ్యం అధ్వానంగా ఉంది. ఖాళీస్థలాలు చెత్తాచెదారాలతో నిండుతున్నాయి. వర్షాలు పడినప్పుడల్లా నరసరావుపేటరోడ్డులోని పాత డంపింగ్‌యార్డు ప్రాంతంలో పారిశుధ్యం క్షీణించి స్థానికులు విషజ్వరాలబారిన పడుతున్నారు. దీనిని తొలగించాలనే డిమాండ్‌ ఉన్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. స్ర్టామ్‌వాటర్‌ డ్రెయిన్‌ నిర్మాణాలు పూర్తిచేయాలి. వెంకటపతి కాలనీలోని కొంత ప్రాంతం, శివాజినగర్‌ 6వ లైన్‌లోని కొత్తకాలనీ , అచ్చంపేటరోడు మంచినీటి పథకం పైపులైన్లు ఏర్పాటు చేయాలి. రక్షిత మంచినీరు కూడా కొన్నిసార్లు క్లోరినేషన్‌ జరగటం లేదు. మురికివాడల్లో కుళాయి కనెక్షన్లు లేదు. ఎస్‌బీఐ రోడ్డు, రైల్వేస్టేషన్‌ రోడ్డు, భవిరిశెట్టివారివీధి, గార్లపాడు బస్టాండ్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా ఉంది. పార్కింగ్‌ స్థలాలు ఎక్కడా లేవు. నిత్యం 22 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతున్నా సరైన డంపింగ్‌యార్డు లేదు. వడ్డవల్లిలో ముఖ్యమంత్రి ఆరోగ్యకేంద్రంపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించలేదు.  


 

Updated Date - 2021-03-22T05:07:07+05:30 IST