వలసల పేరుతో.. ఎత్తుగడ!

ABN , First Publish Date - 2021-02-26T06:09:46+05:30 IST

ఇతర పార్టీల నుంచి పెద్దఎత్తున తమ పార్టీలోకి వలసలు జరుగుతున్నాయని అధికారపార్టీ నాయకులు బిల్డప్‌ ఇస్తున్నారు.

వలసల పేరుతో..  ఎత్తుగడ!

ఇతర పార్టీల నుంచి వైసీపీలోకి చేరుతున్నట్లు బిల్డప్‌లు

వారంతా అభ్యర్థుల అనుచరులేనంటున్న ప్రతిపక్షాలు

 మున్సిపల్‌ ఎన్నికల్లో సిత్రాలు..!


గుంటూరు, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): ఇతర పార్టీల నుంచి పెద్దఎత్తున తమ పార్టీలోకి వలసలు జరుగుతున్నాయని అధికారపార్టీ నాయకులు బిల్డప్‌ ఇస్తున్నారు. నిత్యం ఏదో ఒక డివిజన్‌/వార్డులో బహిరంగ సభలు ఏర్పాటు చేసి టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి వైసీపీలోకి పలువురు చేరుతున్నట్లు ఢంకా బజాయిస్తున్నారు. అయితే వైసీపీ వాళ్లు చెబుతున్నట్లుగా వారెవ్వరూ తమ పార్టీలో ఎప్పుడూ క్రియాశీలకంగా లేరని ప్రతిపక్షాలు స్పష్టం చేస్తున్నాయి. ఓటర్లను తమ వైపు తిప్పుకొనేందుకు ఇదొక చీప్‌ ట్రిక్‌గా కొట్టిపారేస్తున్నాయి. అభివృద్ధి పడకేయడం, రేషన్‌కార్డుల తొలగింపు, ఇంటిపన్ను పెంచబోతుండటం వంటి కారణాలతో వైసీపీ ప్రభుత్వంపై పట్టణ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, దాని నుంచి దృష్టి మళ్లించేందుకు ఇలా బోగస్‌ చేరికల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని విమర్శిస్తున్నాయి. 

మునిసిపల్‌ ఎన్నికల పోలింగ్‌ తేదీ మరో రెండు వారాల్లోకి వచ్చేసింది. మార్చి 10వ తేదీన పోలింగ్‌ జరగనుంది. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారం 8వ తేదీ సాయంత్రం వరకే ప్రచారాలకు అనుమతి ఉంటుంది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా వైసీపీ అభ్యర్థులు గుంటూరు నగరంతో పాటు మునిసిపాలిటీల్లో ఓటర్లను ఏమార్చేందుకు ఇతర పార్టీల నుంచి తమ పార్టీలోకి చేరుతున్నారని పేర్కొంటూ వారి ఫొటోలు, పేర్లతో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం వేళ నాయకులను పిలిపించి వైసీపీ ప్రభుత్వ విధానాలు నచ్చి టీడీపీ, బీజేపీ, జనసేన నుంచి నాయకులు తమ పార్టీలోకి చేరుతున్నారని సభలు నిర్వహిస్తున్నారు. అయితే వైసీపీ నాయకులు చెబుతున్న ఇతర పార్టీల కార్యకర్తల పేర్లు చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇందుకు కారణం వారిలో చాలామంది సంబంఽధిత అభ్యర్థి అనుచరులే. అయినప్పటికీ వారిపై వేరే పార్టీల ముద్ర వేసి తమ పార్టీలోకి చేరుతున్నట్లు చిత్రీకరిస్తున్నారు. 


ప్రత్యర్థులపె మునిసిపల్‌ వర్గాలకు ఫిర్యాదులు

కొన్నిచోట్ల వైసీపీ అభ్యర్థులు తమ ప్రత్యర్థులను ఏదో ఒక విధంగా దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు, పోస్టర్లు, పార్టీ కార్యాలయాలపై ఫిర్యాదులు చేస్తున్నారు. టౌన్‌ప్లానింగ్‌ అక్రమ ఆక్రమణల నిర్మూలన దళం సిబ్బందికి ఫోన్‌ చేసి ప్రతిపక్షాల బ్యానర్లు, ఫ్లెక్సీలు తొలగించమని ఒత్తిడి పెంచుతున్నారు. వీళ్లు మాత్రం యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న ప్రస్తుత తరుణంలో అనుమతి లేనిదే ఎలాంటి రాజకీయ పార్టీల ఫ్లెక్సీలను బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేయరాదు. వైసీపీ అభ్యర్థులకు ఈ నిబంధన లేకుండా పోయింది. బహిరంగ ప్రదేశాల్లో, విద్యుత్‌ స్తంభాలకు యథేచ్ఛగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా తమ సభలు, ర్యాలీలకు మునిసిపల్‌ శానిటేషన్‌ వర్కర్లని వినియోగిస్తున్నారు. 

Updated Date - 2021-02-26T06:09:46+05:30 IST