నేడే.. పరిషత్‌ ఫలితాలు

ABN , First Publish Date - 2021-09-19T05:41:17+05:30 IST

జిల్లాలో పరిషత్‌ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది.

నేడే.. పరిషత్‌ ఫలితాలు
గుంటూరు లాడ్జి సెంటర్‌లోని ఏఎల్‌ బీఈడీ కళాశాలలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని, కలెక్టర్‌, తదితరులు

ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి

ఉదయం 7 నుంచి కౌంటింగ్‌ ప్రారంభం

45 జడ్పీటీసీ, 571 ఎంపీటీసీ స్థానాలకు లెక్కింపు

ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు, ఏజెంట్లు గైర్హాజరయ్యే అవకాశం

ఎన్నికల ఏర్పాట్లపై ఎస్‌ఈసీ నీలం సాహ్ని సమీక్ష, పరిశీలన 


జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి జిల్లాలో ఎన్నికలు జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల కౌంటింగ్‌ని ప్రారంభించి మధ్యాహ్నం లోపే పూర్తి చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఏకగ్రీవాలు పోను మొత్తం 571 ఎంపీటీసీ, 45 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 14 కేంద్రాలను వివిధ కళాశాలల్లో 657 టేబుళ్లని వినియోగించనున్నారు. మొత్తం 788 మంది కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, 3,154 మంది సిబ్బందిని నియమించారు.  లెక్కింపు పూర్తి ఫలితాలు వెలువడిన తర్వాత జనం గూమిగూడటం, విజయోత్సవ ర్యాలీలపై నిషేధం విధించారు. ఎన్నికల ఏర్పాట్లపై శనివారం ఎస్‌ఈసీ నీలం సాహ్ని గుంటూరులో ప్రత్యేకంగా సమీక్షించడంతో పాటు స్వయంగా పరిశీలించారు. 


గుంటూరు, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పరిషత్‌ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఈ ప్రక్రియ సజావుగా పూర్తి చేయడానికి ప్రతీ కేంద్రానికి డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి అఽధికారిని, నాలుగు రెవెన్యూ డివిజన్లను పర్యవేక్షించే బాధ్యతను జేసీలకు కేటాయించారు. ఇప్పటికే రెండుసార్లు కౌంటింగ్‌పై శిక్షణ ఇచ్చారు. మూడో దశ శిక్షణ ఆదివారం ఉదయం 6 గంటలకు ఇచ్చి నేరుగా కౌంటింగ్‌ కేంద్రానికి పంపించనున్నారు. కౌంటింగ్‌ కేంద్రానికి వచ్చే అభ్యర్థులు, ఏజంట్లకు కోవిడ్‌ టెస్టు ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి చేశారు. లెక్కింపు కేంద్రాల్లో సీసీ కెమెరాలతో పాటు వీడియో కెమెరాలతో రికార్డింగ్‌ చేయాల్సిందిగా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. అయితే పరిషత్‌ పోరులో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతుందని, ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడంలేదని పోలింగ్‌ సమయంలోనే ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించాయి. ఈ పరిస్థితుల్లో ఆదివారం జరిగే కౌంటింగ్‌ని కూడా బహిష్కరించాలని పలు పార్టీలు నిర్ణయించాయి. 


లెక్కింపు ప్రక్రియ సజావుగా నిర్వహించాలి

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా, సజావుగా నిర్వహించి విజయవంతం అయ్యేలా అధికారులు ప్రణాళిక ప్రకారం కృషి చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని అదేశించారు. శనివారం ఆమె కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా నీలంసాహ్ని మాట్లాడుతూ తక్కువ సమయం ఉన్నందున జిల్లా యంత్రాంగం మొత్తాన్ని ఓట్లు లెక్కింపు ప్రక్రియలో భాగస్వామ్యం చేయాలన్నారు. కౌంటింగ్‌ పూర్తయ్యి తుది ఫలితాలు ప్రకటన సమయంలో అంకెల విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.  సమస్యాత్మక ప్రాంతాల్లోని కౌంటింగ్‌ కేంద్రాల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజలు గుమికూడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా ఎన్నికల పరిశీలుకుడు డాక్టర్‌ లక్ష్మీనరసింహం మాట్లాడుతూ కౌంటింగ్‌ ఏజెంట్లు, సిబ్బందిలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ వేసుకున్నవారిని లేదా ఆర్‌టీపీసీఆర్‌, యాంటి జెన్‌ నెగిటివ్‌ రిపోర్టు ఉన్న వారిని మాత్రమే కౌంటింగ్‌ కేంద్రాలలోకి అనుమతించాలని తెలిపారు. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను పవర్‌ పాయింట్‌ ప్రజేంటేషన్‌ ద్వారా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ వివరిస్తూ 571 ఎంపీటీసీ స్థానాలు, 45 జడ్పీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు కోసం 14 కేంద్రాలలలో 620 కౌంటింగ్‌ టేబుల్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఐజీ త్రివిక్రమవర్మ మాట్లాడుతూ ఓట్లు లెక్కింపు సందర్భంగా జిల్లాలో 144 సెక్షన్‌ విధించామన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడు అంచెల భద్రత ఏర్పాటు చేశామన్నారు. అనంతరం గుంటూరు లాడ్జి సెంటర్‌లోని ఏఎల్‌ బీఈడీ కళాశాలలోని ఓట్ల లెక్కింపు కేంద్రంలోని ఏర్పాట్లను ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని, ఇతర అధికారులు పరిశీలించారు. సూపర్‌ వైజర్లతో ఓట్లు లెక్కింపు విధానంపై కమిషనర్‌ నీలం సాహ్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అర్బన్‌, రూరల్‌ ఎస్పీలు ఆరీఫ్‌హఫీజ్‌, విశాల్‌గున్నీ, జేసీలు ఏఎస్‌ దినేష్‌కుమార్‌, రాజకుమారి, అనుపమ అంజలి, కే శ్రీధర్‌రెడ్డి, డీఆర్వో కొండయ్య, జడ్పీ సీఈవో చైతన్య, డీపీవో కేశవరెడ్డి, గుంటూరు  ఆర్డీవో భాస్కరరెడ్డి, తహసీల్దారు తాతా మోహనరావు, తదితరులు పాల్గొన్నారు.


కౌంటింగ్‌కు విస్తృత ఏర్పాట్లు : కలెక్టర్‌ 

నరసరావుపేట: కౌంటింగ్‌కు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ తెలిపారు. నరసరావుపేటలో కౌంటింగ్‌ కేంద్రాన్ని కలెక్టర్‌ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కౌంటింగ్‌ సిబ్బందికి శిక్షణ ఇచ్చామన్నారు. సిబ్బంది అందరూ వ్యాక్సిన్‌ తీసుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శేషిరెడ్డి, కమీషనర్‌ రామచంద్రారెడ్డి, ఎంపీడీవోలు బూచిరెడ్డి, అర్జునరావు తదితరులున్నారు.


ర్యాలీలు, ఊరేగింపుల నిషేధం : ఎస్పీలు

గుంటూరు: ఓట్ల లెక్కింపు అనంతరం ఎక్కడా విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతులు లేవని రూరల్‌, అర్బన్‌ ఎస్పీలు విశాల్‌గున్నీ, ఆరిఫ్‌ హఫీజ్‌ తెలిపారు.  ఎవరైనా ఊరేగింపులకు, ర్యాలీలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తప్పవన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచల బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.    అత్యంత సమస్యాత్మక, సమస్యాత్మక గ్రామాల్లో కౌంటింగ్‌ అనంతరం ఎటువంటి ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు చెప్పారు.  అర్బన్‌ పరిధిలోని లాడ్జి సెంటరులోని ఏఎల్‌ బీఈడీ కళాశాల, వట్టిచెరుకూరు పరిధిలోని పుల్లడిగుంటలో మలినేని ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రాలను అర్బన్‌ ఎస్పీ పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ గంగాధరం, డీఎస్పీలు సుప్రజ, సీతారామయ్య, రమణకుమార్‌, ఎస్‌బీ సీఐ బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-19T05:41:17+05:30 IST