పెద్దల సభకు.. మరో ఇద్దరు

ABN , First Publish Date - 2021-11-10T04:57:58+05:30 IST

పెద్దల సభకు జిల్లా నుంచి మరో ఇద్దరు ఎన్నికకానున్నారు. స్థానిక సంస్థల కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ పదవులకు మంగళవారం నోటిఫికేషన్‌ వెలువడింది.

పెద్దల సభకు.. మరో ఇద్దరు

జిల్లాకు రెండు ఎమ్మెల్సీ పదవులు

షెడ్యూల్‌ ప్రకటనతో వైసీపీలో సందడి

మండలికి మరోసారి ఉమ్మారెడ్డి, కొత్తగా మర్రికి చోటు 

నేడో.. రేపో పేర్లు ప్రకటించనున్న సీఎం జగన్‌

స్థానిక సంస్థల్లో బలం ఉండటంతో వీరి ఎన్నిక ఏకపక్షమే

రిటర్నింగ్‌ అధికారిగా రెవెన్యూ జేసీ దినేష్‌కుమార్‌


గుంటూరు, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): పెద్దల సభకు జిల్లా నుంచి మరో ఇద్దరు ఎన్నికకానున్నారు. స్థానిక సంస్థల కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ పదవులకు మంగళవారం నోటిఫికేషన్‌ వెలువడింది. దీంతో వైసీపీలో ఎన్నికల సందడి మొదలైంది. ఈ కోటాలో జిల్లాలో రెండు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 16న నోటిఫికేషన్‌ వెలువడనుండగా 23 వరకు నామినేషన్ల దాఖలకు అవకాశం ఉంది. 26వ తేదీతో ఉపసంహరణకు గడువు ముగుస్తుంది. డిసెంబరు 10న ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. 14న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. వీరికి ఓటు వేసే అర్హత కార్పొరేటర్లు, కౌన్సెలర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలకు ఉంటుంది. వీరిలో ఎక్కువ శాతం మంది వైసీపీ వారే. దీంతో టీడీపీ ఎన్నికల బరిలోకి దిగే అవకాశం ఉండకపోవచ్చు. ఒకవేళ పోటీ జరిగినా వైసీపీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయం ఏకపక్షమే అని చెప్పవచ్చు.   అయితే ఆ రెండూ ఎమ్మెల్సీ పదవులు ఎవరికి ఇచ్చేది ఇప్పటికే వెల్లడి కావటంతో కొత్తవారు ఎవరూ వాటిపై ఆశలు పెట్టుకుని ప్రయత్నాలు చేయటం లేదు. గతంలో ఈ రెండు స్థానాల నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు(వైసీపీ), అన్నం సతీష్‌ ప్రభాకర్‌(టీడీపీ) ఎన్నికయ్యారు. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందే టీడీపీని వీడి బీజేపీలో చేరిన అన్నం సతీష్‌ తన పదవికి రాజీనామా చేయటంతో అప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగానే ఉంది. ఇక ఉమ్మారెడ్డి పదవీకాలం ఇంతకమునుపే ముగియటంతో ఖాళీ ఏర్పడింది. వైసీపీలో సెంట్రల్‌ కమిటీ మెంబర్‌గా వ్యవహరిస్తున్న సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు తిరిగి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడం ఖాయమని చెబుతున్నారు. ఇక రెండో స్థానం నుంచి చిలకలూరిపేటకు చెందిన సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌కి పోటీ చేసే అవకాశం ఇవ్వనున్నారు. ఆయనకు ఈ అవకాశం ఎప్పుడో దక్కాల్సి ఉంది. 2019 ఎన్నికల్లో మర్రిని తప్పించి మహిళ, బీసీ కోటాలో విడదల రజనికి అవకాశం కల్పించారు. రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేస్తానని నాటి ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్‌ సభాముఖంగా  మర్రి అభిమానులకు హామీ ఇచ్చారు. అయితే ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకే ఇంత సమయం పట్టింది. అయితే ఈ పర్యాయం ఖాయమే అయినప్పటికీ ముఖ్యమంత్రి జగన్‌ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.


అమలులోకి వచ్చిన ఎన్నికల కోడ్‌

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో మంగళవారం నుంచి జిల్లావ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది.  ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా జాయింట్‌ కలెక్టర్‌(రైతుభరోసా, రెవెన్యూ) ఏఎస్‌ దినేష్‌కుమార్‌ని నియమించారు.   డిసెంబరు 14న కౌంటింగ్‌ ముగిసేంత వరకు కోడ్‌ అమలులో ఉంటుంది. దీంతో కొత్తగా అభివృద్ధి కార్యక్రమాలకు బ్రేక్‌ పడినట్లే. అయితే గురువారం గుంటూరులో జరిగే సీఎం జగన్‌ పర్య టన కూడా రద్దయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు గుంటూరు నగర పాలకసంస్థలో ఆరో డివిజన్‌కు ఉపఎన్నిక జరుగుతుందని, ఈ పరిస్థితుల్లో కోడ్‌ అమల్లో ఉన్నట్లేనని అధికారులు చెప్తున్నారు. 

Updated Date - 2021-11-10T04:57:58+05:30 IST