మిర్చి యార్డుకు నెల సెలవు

ABN , First Publish Date - 2021-05-02T05:30:00+05:30 IST

రోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రత దృష్ట్యా మిర్చియార్డు సోమవారం నుంచి నెల పా టు మూతపడనుంది.

మిర్చి యార్డుకు నెల సెలవు

కోల్డ్‌స్టోరేజ్‌లు, గిడ్డంగుల్లో మిర్చి క్రయవిక్రయాలు

ఈనామ్‌ విధానంలో నిర్వహించుకొనేందుకు అనుమతి

జీరో బిజినెస్‌ చేసే వారికి కాసుల పంట


గుంటూరు, మే 2 (ఆంధ్రజ్యోతి): కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రత దృష్ట్యా మిర్చియార్డు సోమవారం నుంచి నెల పా టు మూతపడనుంది. గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది వారం ముందే సెలవులు ప్రకటించారు. దీని దృష్ట్యా రైతులు ఆర్థిక ఇబ్బందులు పడే అవకాశం ఉం డటంతో కోల్డ్‌స్టోరేజ్‌లు, మిర్చి గిడ్డంగుల వద్ద ఈ-నామ్‌ పద్ధతిలో మిరపకాయల క్రయవిక్రయాలకు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆమోదం తెలిపింది. అయితే ఎంత మేరకు ఈనామ్‌ విధానంలో ట్రేడింగ్‌ జరుపుతారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మిర్చి జీరో బిజినెస్‌ చేసేవారు ఈ అవకాశాన్ని పెద్దఎత్తున సొమ్ము చేసుకొనే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. 

గత ఏడాది లాక్‌డౌన్‌ సమయంలోనూ మిర్చియార్డుని రెండునెలలకు పైగానే మూసేశారు. అప్పట్లో కూడా కోల్డ్‌ స్టోరేజ్‌లు, గోడౌన్లలో మిర్చి ట్రేడింగ్‌కి అనుమతించారు. ఆ సందర్భంలో పెద్దఎత్తున అమ్మకాలు జరిగినప్పటికీ ఆశిం చినంతంగా మార్కెట్‌ ఫీజు మార్కెట్‌ కమిటీకి సమ కూరలేదు. ప్రధానంగా బంగ్లాదేశ్‌కి పెద్దఎత్తున రైళ్లు, లారీలద్వారా మిర్చిని ఎగుమతి చేశారు. అలానే స్థాని కంగానూ విక్ర యించారు. ఎగు మతుల విషయంలో ఈనామ్‌ పద్ధతిని పాటించారు. స్థాని కంగా మాత్రం జీరో బిజినెస్‌ చేశా రు. దీని వలన యార్డుకి రూ. 12 కోట్లకు పైగా ఆ దాయానికి గండిపడింది. ఈ నేపథ్యంలో వచ్చే నెలపాటు శీత లగిడ్డంగులు, మిర్చి గోడౌన్ల నుంచి బయటకు తరలివెళ్లే సరుకుపై అధికారవర్గాలు ప్రత్యేకంగా దృష్టి సారించాలి. లేదంటే గత ఏడాది వలే మార్కెట్‌ ఫీజు కోల్పోవాల్సి వస్తుంది. 

కోవిడ్‌ నిబంధనలు పాటించేనా?

కోల్డ్‌స్టోరేజ్‌లు, మిర్చి గోడౌన్లలో కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ మిర్చి క్రయవిక్రయాలకు మార్కెట్‌ కమిటీ అనుమతి ఇచ్చింది. అయితే వాటి వద్దకు రైతులు, వ్యాపారస్థులు, హమాలీలు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున అక్కడ కోవిడ్‌ నిబంధనలు సక్రమంగా పాటిస్తారో, లేదోనన్న భయం ఏర్పడింది. ఇప్పటికే మిర్చియార్డులోని కమీషన్‌ దుకాణాల్లో పని చేస్తే ఐదుగురు గుమాస్తాలు చిన్న వయస్సులోనే కరోనాతో చనిపోయారు. ప్రధానంగా కర్నూలు నుంచి వచ్చిన రైతుల ద్వారా యార్డులో వైరస్‌ బాగా వ్యాప్తి చెందిందని వ్యాపారస్థులు చెబుతున్నారు. మాస్కు ధరించకపోవడం, శానిటైజేషన్‌ చేసుకోకపోవడం, సామాజికదూరం అనేదే పాటించకపోవడమే వందల సంఖ్యలో వ్యాపారస్థులు, వారి సిబ్బంది కరోన వైరస్‌ బారిన పడటానికి ప్రధానంగా కారణంగా మారింది. ఈ నేపథ్యంలో నేటి నుంచి మిర్చి ట్రేడింగ్‌ జరిగే కోల్డ్‌స్టోరేజ్‌ల వద్ద కొవిడ్‌ నిబంధనలు పాటించకపోతే వైరస్‌ వ్యాప్తి మరింతగా జరిగే అవకాశం లేకపోలేదు. 

Updated Date - 2021-05-02T05:30:00+05:30 IST