మిర్చి.. అదే ధర!

ABN , First Publish Date - 2021-08-22T04:59:59+05:30 IST

మిర్చి ధర గత కొన్ని నెలల నుంచి స్థిరంగా కొనసాగుతోంది. దీంతో శీతల గిడ్డంగుల్లో నిల్వచేసిన రైతులు, వ్యాపారస్థులు ఆందోళన చెందుతున్నారు.

మిర్చి.. అదే ధర!

కోల్డు స్టోరేజీల్లో నిల్వలు

రైతులు, వ్యాపారుల దిగాలు

గత్యంతరం లేక నష్టానికి విక్రయం


గుంటూరు, ఆగస్టు 21 (ఆంధజ్యోతి): మిర్చి ధర గత కొన్ని నెలల నుంచి స్థిరంగా కొనసాగుతోంది. దీంతో శీతల గిడ్డంగుల్లో నిల్వచేసిన రైతులు, వ్యాపారస్థులు ఆందోళన చెందుతున్నారు. సహజంగా ఏటా ఆగస్టు నెల వచ్చేసరికే ధర పెరగడం ప్రారంభమై కొత్త కాయలు మార్కెట్‌ కమిటీకి వచ్చేంతవరకు కొనసాగేది. ఇప్పుడు ఆ పరిస్థితి గుంటూరు మిర్చియార్డు పరిధిలో ఏ కోశాన కనిపించడం లేదు. మిర్చి సీజన్‌లో ధర ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది. కొన్ని రకాలు అయితే ఇంకా ధర తగ్గాయి. దీంతో నిల్వ చేసిన మిర్చికి శీతల గిడ్డంగులు ఖర్చులు అదనంగా చేరాయి. ఈ పరిస్థితుల్లో తాము తీవ్రంగా నష్టపోవాల్సిందేనానని కోల్డ్‌స్టోరేజ్‌లలో నిల్వ చేసుకొని మార్కెట్‌ గిరాకీ కోసం ఎదురు చూస్తోన్న వారు వాపోతున్నారు. 

గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లోనూ మిర్చి ధర క్వింటాలుకు సగటున రూ.10 వేలకు అటు ఇటుగా కొనసాగింది. ఆ సందర్భంలో మిర్చియార్డుకు రోజుకు రెండు లక్షల టిక్కీల వరకు విక్రయానికి రావడంతో కొంతమంది వ్యాపారులు రైతుల వద్ద సరుకు కొనుగోలు చేసి కోల్డ్‌స్టోరేజ్‌లలో నిల్వ ఉంచారు. పెద్దరైతులు మాత్రం తమ పంటని అమ్మకుండా వారే సొంతగా శీతల గిడ్డంగుల్లో పెట్టారు. ఇప్పుడు వాటిపై ఒక్కో టిక్కీ(40 కేజీల బస్తా)కి రూ.500 వరకు కోల్డ్‌స్టోరేజ్‌ ఛార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి ఉత్పన్నం అయింది. మరోవైపు మార్కెట్‌లో మేలిమి రకాలకే రూ.11 వేలకు మించి ధర రావడం లేదు. దీని దృష్ట్యా సీజన్‌లో క్వింటాల్‌ రూ.11 వేలు పెట్టి మిర్చిని కొనుగోలు చేసిన వారు ఇప్పుడు మార్కెట్‌లో లభిస్తున్న ధరకు విక్రయించలేని పరిస్థితి నెలకొంది. 

ఇదిలావుంటే ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో పంట పెట్టుబడి, పిల్లల స్కూలు, కళాశాలల ఫీజులు, కుటుంబ అవసరాల కోసం తాము నిల్వ చేసుకొన్న మిర్చిని తప్పక విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలానే బ్యాంకుల నుంచి తీసుకొన్న రుణాలు తిరిగి చెల్లించాలి. ఈ నేపథ్యంలో మరో ప్రత్యామ్నాయం లేక గత కొద్ది రోజుల నుంచి నిత్యం శీతల గిడ్డంగుల నుంచి 50 వేలకు పైగా టిక్కీలను రైతులు బయటకు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. రాబోయే రెండునెలల్లో కోల్డ్‌స్టోరేజ్‌లలో ఉన్న 40 లక్షలకు పైగా ఉన్న మిర్చి టిక్కీలు విక్రయం జరగకపోతే కొత్తగా వచ్చే పంటతో ధర పెరగడం పక్కన పెడితే పతనం అయ్యే ప్రమాదం పొంచి ఉంది. కొవిడ్‌ కారణంగా ఎగుమతులపై ప్రభావం ఎక్కువగా ఉండటంతో డిమాండ్‌ అంతంత మాత్రంగానే ఉంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎగుమతులు పెంచడంపై చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. 

Updated Date - 2021-08-22T04:59:59+05:30 IST