లాక్‌డౌన్‌కి.. ఏడాది

ABN , First Publish Date - 2021-03-22T05:09:48+05:30 IST

ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా జిల్లాను వీడటంలేదు. నెమ్మదిగా ప్రారంభమై ఉచ్ఛస్థితికి వెళ్లి ఆ తర్వాత విరామం తీసుకున్న వైరస్‌ మళ్లీ విజృంభిస్తోంది.

లాక్‌డౌన్‌కి.. ఏడాది
నరసరావుపేటలో రెడ్‌జోన్‌ (పాతచిత్రం)

జనతా కర్ఫ్యూతో ఆరంభం

జిల్లాలో తొలి మూడు నెలలు ఆంక్షలు కఠినం

లాక్‌డౌన్‌ ప్రారంభమైనప్పుడు ఒక్క కేసు కూడా లేదు 

అన్‌లాక్‌ ప్రారంభంతో జిల్లావ్యాప్తంగా తీవ్రమైన కరోనా 

తగ్గినట్లే తగ్గి వారం నుంచి విజృంభిస్తోన్న వైరస్‌ పంజా 


గుంటూరు, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా జిల్లాను వీడటంలేదు. నెమ్మదిగా ప్రారంభమై ఉచ్ఛస్థితికి వెళ్లి ఆ తర్వాత విరామం తీసుకున్న వైరస్‌ మళ్లీ విజృంభిస్తోంది. ఈ పరిస్థితుల్లో సోమవారంతో లాక్‌డౌన్‌కి ఏడాది పూర్తి కానున్నది. గత ఏడాది ఇదే రోజు(మార్చి 22)న 14 గంటల జనతా కర్ఫ్యూతో కేంద్ర ప్రభుత్వం ప్రజలను సంసిద్ధం చేయగా రాష్ట్ర ప్రభుత్వం అదే రోజు సాయంత్రం వారం పాటు లాక్‌డౌన్‌ని ప్రకటించింది. అయితే కేంద్ర ప్రభుత్వం మూడు రోజుల తర్వాత 25న తొలుత 14 రోజుల లాక్‌డౌన్‌ని అమలులోకి తీసుకొచ్చింది. కాగా లాక్‌డౌన్‌ ప్రారంభమైనప్పుడు జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. గుంటూరులోని మంగళదాసునగర్‌లో తొలి కరోనా కేసు వెలుగులోకి రాగా ఆ తర్వాత కేసుల సంఖ్య క్రమేపి పెరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు లాక్‌డౌన్‌ని జిల్లాలో తొలి మూడు నెలలు చాలా కఠినంగా అమలు చేశారు. ఈ కారణంగా మార్చి నెలలో ఏడు రోజులకు 9 పాజిటివ్‌ కేసులు, ఏప్రిల్‌లో 277, మేలో 214 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. దాంతో కరోనా వైరస్‌ వ్యాప్తి అదుపులోకి వచ్చినట్లేనని అంతా భావించారు. ఎప్పుడైతే ఆంక్షలు సడలించి అన్‌లాక్‌ని ప్రారంభించారో అప్పటి నుంచి కరోనా దాడి చేయడం ప్రారంభించింది. జూన్‌లో 1,095, జూలైలో 14,692, ఆగస్టులో 21,093, సెప్టెంబరులో 18,929, అక్టోబరులో 12,530, నవంబరులో 5,662, డిసెంబరులో 1,875 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. ఇలా క్రమంగా తగ్గి రోజుకు జిల్లా వ్యాప్తంగా 10 కేసులు కూడా నమోదు కాని పరిస్థితికి వచ్చింది. ఇదే సమయంలో ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌, సీనియర్‌ సిటిజన్స్‌, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడంతో మహమ్మారి పీడ తగ్గినట్లేనని అంతా భావిస్తోన్న తరుణంలో మళ్లీ పంజా విసరడం ప్రారంభించింది. గత వారం, పది రోజులుగా నిత్యం రోజుకు 70 నుంచి 80 పాజిటివ్‌ కేసులు వస్తోండటం ఆందోళన కలిగిస్తోన్నది. కరోనా ఉద్ధృతి ఎక్కువ ఉన్న సమయంలో రోజుకు 300 వరకు కేసులు నమోదు కాగా మరణాలు 10 వరకు ఉన్నాయి. ఈ కారణంగానే జిల్లాలో మృతుల సంఖ్య 750కి చేరింది.


కంటైన్‌మెంట్‌ జోన్లలో పస్తులు

కరోనా లాక్‌డౌన్‌ సమయంలో జిల్లా ప్రజలు పడ్డ బాధలు వర్ణనాతీతం. పనులు లేక కంటైన్‌మెంట్‌ జోన్లలో పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇతర ప్రాంతాల  నుంచి వలస వచ్చిన వారు బతుకుజీవుడా అంటూ కాలి నడక వందల కిలోమీటర్లు ప్రయాణించి స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న  వారు ఇక్కడికి తరలి వచ్చారు. దాతలు నిత్యం వేల మంది ప్రజలకు భోజనం, నిత్యావసరాలను ఉచితంగా అందించి అండగా నిలిచారు. అమ్మ ఛారిటబుల్‌ ట్రస్టు అయితే నిత్యం వేల మందికి భోజనం పెట్టి ఆకలి తీర్చింది. చనిపోయిన వారి మృతదేహాలను కనీసం చూసేందుకు కూడా బంధువులు రాని పరిస్థితిలో జిల్లా యంత్రాంగం, ట్రస్టులు ముందుకొచ్చి అంతిమ సంస్కారాలు నిర్వహించాయి.


మళ్లీ ఆ పరిస్థితులు తెచ్చుకోవద్దు

కరోనాతో ప్రజలు అటు ఆర్థికంగాను, ఇటు సామాజికంగానూ నలిగిపోయారు. తిరిగి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. మాస్కు, భౌతిక దూరం, తరచుగా చేతులు శానిటైజేషన్‌ చేసుకొంటూనే ఉండాలని  స్పష్టం చేస్తోన్నారు. వ్యాక్సిన్‌ వేసుకొన్నా ఇవి తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు. అయితే జిల్లాలో చాలామంది తమకేమి కాదు అన్న నిర్లక్ష్య ధోరణిని అవలంభిస్తోన్నారు. ఈ నేపథ్యంలో అందరూ కొవిడ్‌ నిబంధనలు పాటించకపోతే మరోసారి లాక్‌డౌన్‌ పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు.


కొనసాగుతోన్న ఉధృతి

తాజాగా జిల్లాలో 79 కేసులు

గుంటూరు(మెడికల్‌): జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఆదివారం జిల్లాలో కొత్తగా 79 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 368 కేసులు నమోదైతే, అత్యధిక కేసులతో జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. గుంటూరు నగరంలో అత్యధికంగా 21 కేసులు వెలుగు చూశాయి. హెల్త్‌ బులెటిన్‌ ప్రకారం అమరావతి, అచ్చంపేట,  ఫిరంగిపురం,  సత్తెనపల్లి, తుళ్లూరు, మాచర్ల, దుగ్గిరాల, కొల్లూరు, పొన్నూరులో రెండేసి, గుంటూరు రూరల్‌,  పెదకాకాని, ప్రత్తిపాడు, తాడికొండ, మాచవరం, పిడుగురాళ్ల, రెంటచింతల, నూజెండ్ల, బాపట్ల, చేబ్రోలు, చెరుకుపల్లి, పిట్టలవానిపాలెంలో ఒక్కొక్కటి, మంగళగిరిలో 8, తాడేపల్లి, వినుకొండ, భట్టిప్రోలు, రేపల్లె, తెనాలిలో 4, గుంటూరునగరంలో 21 కేసులు నమోదయ్యాయి. వేమూరు మండలంలోని పోతుమర్రు పాఠశాలలో ఓ ఉపాధ్యాయురాలికి కరోనా సోకడంతో శనివారం పాఠశాలకు సెలవు ప్రకటించారు. కొల్లూరు మండలం క్రాపలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికురాలికి, ఓ విద్యార్థికి పాజిటివ్‌ వచ్చింది. 

Updated Date - 2021-03-22T05:09:48+05:30 IST