పరిశ్రమకు.. సున్నం

ABN , First Publish Date - 2021-10-30T05:06:30+05:30 IST

లైమ్‌సిటీగా పేరొందిన పిడుగురాళ్ల సున్నం పరిశ్రమ మనుగడకు ముప్పొచ్చినట్లు కనిపిస్తుంది. పట్టణంలోని పిల్లుట్ల రోడ్డులో సుమారు 270 సున్నపు బట్టీల నుంచి వివిధ రాష్ట్రాల్లోని కెమికల్‌, షుగర్‌, పేపర్‌ మిల్లులకు సున్నం ఎగుమతి అయ్యేది. సున్నపు బట్టీలకు అనుబంధంగా సున్నం మిల్లులు కూడా ఇక్కడ ఏర్పాటయ్యాయి. సున్నం పరిశ్రమలో వచ్చిన సంక్షోభంతో

పరిశ్రమకు.. సున్నం
పిడుగురాళ్ల సమీపంలో ఉన్న బట్టీలు

లైమ్‌సిటీలో కూలీల విలవిల

సంక్షోభంలో సున్నం పరిశ్రమ 

ముడిసరుకు, బొగ్గు ధరలతో కుదేలు

ప్రభుత్వ నిబంధనలతో వ్యాపారం డల్‌

పెరిగిన ఉత్పత్తి ఖర్చు.. తగ్గిన ఎగుమతులు 


పిడుగురాళ్ల, అక్టోబరు 29: లైమ్‌సిటీగా పేరొందిన పిడుగురాళ్ల సున్నం పరిశ్రమ మనుగడకు ముప్పొచ్చినట్లు కనిపిస్తుంది.  పట్టణంలోని పిల్లుట్ల రోడ్డులో సుమారు 270 సున్నపు బట్టీల నుంచి వివిధ రాష్ట్రాల్లోని కెమికల్‌, షుగర్‌, పేపర్‌ మిల్లులకు సున్నం ఎగుమతి అయ్యేది.   సున్నపు బట్టీలకు అనుబంధంగా సున్నం మిల్లులు కూడా ఇక్కడ ఏర్పాటయ్యాయి.   సున్నం పరిశ్రమలో వచ్చిన సంక్షోభంతో వ్యాపారులు కుదేలవుతున్నారు. వేలాది మందికి ఉపాధి వనరుగా ఉన్న సున్నం పరిశ్రమలో ప్రస్తుతం కూలీల పరిస్థితి ఏరోజుకారోజు అన్నట్టుగా ఉంది. పెరిగిన ముడి సరుకు, బొగ్గు ధరలతోపాటు ప్రభుత్వ ఆంక్షలతో పరిశ్రమ కుదేలవుతుంది. దీంతో పరిశ్రమ నిర్వహణపై వ్యాపారులు అయిష్టత చూపుతున్నారు. ఉత్పత్తి ఖర్చు పెరగటంతోపాటు ఎగుమతులు తగ్గిపోయాయి.   నష్టాల బాటన ఉన్న సున్నంబట్టీలు క్రమేపీ సున్నాన్ని కాల్చటం తగ్గించేశాయి. ప్రస్తుతం 150 బట్టీల వరకే ఉత్పత్తులను కొనసాగిస్తున్నాయి.


జియోట్యాగ్‌తో బొగ్గుకు కొరత 

సున్నం బట్టీలకు బొగ్గు వివిధ రాష్ట్రాల నుంచి వస్తుంటుంది. ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలోనే బొగ్గు లారీలకు జియోట్యాగ్‌ అమర్చుకోవాలనే నిబంధన  విధించారు. పక్క రాష్ట్రాల నుంచి వచ్చే లారీలకి ఇక్కడున్న వ్యాపారులు ఎలా జియోట్యాగ్‌ చేయాలో అర్థంకాక అయోమయంలో ఉన్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు వివరించినా పట్టించుకునే వారే లేరు. ఈ నిబంధనతో బట్టీల వద్ద బొగ్గు నిల్వలు నిండుకున్నాయి. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే బొగ్గు నిల్వలు పూర్తిగా అయిపోయే పరిస్థితి ఉంది.   


సీనరేజ్‌ రెట్టింపు 

గతంలో సీనరేజ్‌ టన్నుకు రూ.127 ఉండగా ఇప్పుడు మైనింగ్‌ శాఖ అదనంగా  రూ.90 పెంచింది. అసలే నష్టాల బాటలో ఉన్న సున్నం పరిశ్రమకు సీనరేజ్‌ బాదుడు కూడా ఓ రకంగా వ్యాపారులను కుదేలయ్యేలా చేసింది. బొగ్గు ధరలు కూడా ఒకప్పుడు టన్ను రూ.8200 ఉండగా ఆ తరువాత రూ.9500 ఇప్పుడు రూ.12వేలకు పైగా పలుకుతుంది. పెట్రోకోక్‌ అయితే గతంలో రూ.12 వేలు ఉండగా తరువాత రూ.15 వేలు, ఇప్పుడు రూ.20 వేలకు చేరుకుంది. ఝరియా బొగ్గే కాకుండా పెట్రోకోక్‌ కూడా సక్రమంగా దిగుమతి కాకపోవటంతో కొంతమంది మధ్యవర్తులు, దళారుల ద్వారా అధిక ధరలకు కొనుగోలు చేసి దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని వ్యాపారులు వాపోతున్నారు. ఉన్న బట్టీలను మూసివేయలేక నష్టాలను చవిచూడలేక వ్యాపారులు సతమతమవుతున్నారు. సున్నం తయారీకి ఉపయోగించే ముడిసరుకైన సున్నపురాయి కూడా వారు చెప్పిన ధరకే కొనుగోలు చేయాల్సి వస్తుంది లేదంటే సరఫరా నిలిపివేస్తామన్న బెదిరింపులు కూడా వ్యాపారులు ఎదుర్కోవాల్సి వస్తుంది.


బొగ్గుసరఫరా సక్రమంగా ఉండాలి 

విపరీతంగా పెరిగిన బొగ్గు ధరతో ఉత్పత్తి వ్యయం పెరిగిపోయింది. దీంతో పరిశ్రమ నిర్వాహణ భారంగా మారింది. సున్నానికి గిట్టుబాటు ధర లేదు. ప్రభుత్వం కల్పించుకొని బొగ్గును రాయితీతో సరఫరా చేస్తే కొంతమేలు కలుగుతుంది. 

- పల్చూరి నాగేశ్వరరావు, లైమ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు


 

రోజూ కూలి రూ.వందే

ఇరవై ఏళ్లుగా సున్నం బట్టీల్లో పనిచేస్తున్నాను. ఒకప్పుడు రోజువారి  కూలి రూ.400 వరకు ఉండేది. ఇప్పుడు సున్నపు పరిశ్రమలో వస్తున్న మార్పులతో రోజుకు రూ.100 మాత్రమే చేతికొస్తున్నాయి. వస్తున్న ఆదాయంతో ఇద్దరు పిల్లలతో కుటుంబపోషణ భారంగా మారింది.

- బత్తుల చిలకమ్మ, కూలి


Updated Date - 2021-10-30T05:06:30+05:30 IST