సస్యరక్షణ చర్యలతో తామరపురుగు నివారణ

ABN , First Publish Date - 2021-11-23T05:59:59+05:30 IST

మిర్చి పైరును ఆశించి తీవ్రనష్టాన్ని కలుగజేస్తున్న కొత్తరకం తామర పురుగును సమగ్ర సస్యరక్షణ చర్యలతో నివారించవచ్చునని లాం ఉద్యాన పరిశోధనా స్థానం కీటకవిభాగం శాస్త్రవేత్త ఎం.శిరీష తెలిపారు.

సస్యరక్షణ చర్యలతో తామరపురుగు నివారణ
మాట్లాడుతున్న లాం శాస్త్రవేత్త ఎం.శిరీష

లాం ఉద్యాన పరిశోధనాస్థానం కీటకశాస్త్రవేత్త శిరీష

యడ్లపాడులో పర్యటించిన లాం శాస్త్రవేత్తల బృందం

యడ్లపాడు, నవంబరు 22: మిర్చి పైరును ఆశించి తీవ్రనష్టాన్ని కలుగజేస్తున్న కొత్తరకం తామర పురుగును సమగ్ర సస్యరక్షణ చర్యలతో నివారించవచ్చునని లాం ఉద్యాన పరిశోధనా స్థానం కీటకవిభాగం శాస్త్రవేత్త ఎం.శిరీష తెలిపారు. పీఆర్‌ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో లాం వ్యవసాయ శాస్త్రవేత్తలతో కలసి ఆమె సోమవారం యడ్లపాడులోని మిర్చిపంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆకులపైన, అడుగు భాగాలతోపాటు పూతలో అధికసంఖ్యలో  తామర పురుగులు ఆశించడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. క్షేత్ర పరిశీలన అనంతరం స్థానిక పీఆర్‌ విజ్ఞాన కేంద్రానికి చేరుకుని రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా డాక్టర్‌ శిరీష మాట్లాడుతూ ఇండోనేషియా, మలేషియా తదితర దేశాల్లో ఉన్న ఈ కొత్తరకం తామరపురుగు మనదేశంలో తొలిసారి 2015లో బొప్పాయితోటల్లో గుర్తించారన్నారు. క్రమంగా కూరగాయలు, ఇతర పంటలకు వ్యాపించి ఈ ఏడాది మిరప పంటపై తీవ్రప్రభావాన్ని చూపిస్తోందన్నారు. తామరపురుగు ఆకుకింది, పై భాగాలలో గీకి తినడంవల్ల నల్లని, పసుపురంగు మచ్చలు ఏర్పడతాయన్నారు. కొత్తగా వచ్చే ఆకులు ఇటుకరాయి రంగులో కనిపిస్తాయన్నారు. పూతలో పుప్పొడిని పూర్తిగా తినివేయడంతో పూత రాలిపోతుందన్నారు. రైతులు దీనిని ఎర్రనల్లిగా భావించి ఎబాసిన్‌, మెటబుల్‌ సల్ఫర్‌ లాంటి మందులు ఎక్కువగా వినియోగించి నష్టపోతున్నారన్నారు. తామర పురుగుకు సంబంధించిన మందులను వాడుకోవడం ద్వారా పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చన్నారు. లాంఫాం తెగుళ్ళ విభాగం శాస్త్రవేత్త విజయలక్ష్మి మాట్లాడుతూ విచక్షణారహితంగా రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకం తెగుళ్ళ వ్యాప్తికి కారణమన్నారు. జెమిని వైరస్‌, కుకుంబర్‌ మొజాయిక్‌ వైరస్‌ తెగుళ్ళు, నివారణ చర్యల గురించి అవగాహన కల్పించారు. లాం పరిశోధనా కేంద్రం పూర్వ శాస్త్రవేత్త వేణుగోపాలరావు రైతులు సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. కార్యక్రమంలో రైతుసంఘం నాయకులు నూతలపాటి కాళిదాసు, జరుగుల శంకరం, ముత్తవరపు శీతారామయ్య, పోపూరి పుల్లారావు, వివిధ గ్రామాల  రైతులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-11-23T05:59:59+05:30 IST