రంగుల్లోనే.. హంగులు
ABN , First Publish Date - 2021-09-03T06:30:59+05:30 IST
నాడు-నేడు కింద తొలి విడతలో పూర్తయిన పాఠశాలల్లో సౌకర్యాలు అటు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులను వెక్కిరిస్తున్నాయి.

లోన లొటారం అన్నట్లుగా కోండ్రుపాడు పాఠశాల
ప్రత్తిపాడు, సెప్టెంబరు 2: నాడు-నేడు కింద తొలి విడతలో పూర్తయిన పాఠశాలల్లో సౌకర్యాలు అటు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులను వెక్కిరిస్తున్నాయి. పాఠశాల హంగులన్నీ రంగుల్లోనే కనిపిస్తున్నట్టుగా బొమ్మలతో సర్వాంగ సుందరంగా కనిపిస్తున్నాయి కాని లోపలకు వెళితే మాత్రం అసౌకర్యాలు వెక్కిరిస్తున్నాయి. ఒక్కో పాఠశాలకు రూ.లక్షలు వెచ్చించినా డబ్బులు సరిపోలేదని, నిధులు మంజూరు కాలేదంటూ రకరకాల వంకలతో ఎప్పటిలాగే తిప్పలు మిగిలాయి. అందుకు ప్రత్యక్ష నిదర్శనంగా మండలంలోని కోండ్రుపాడు ప్రాఽథమిక పాఠశాల నిలుస్తుంది. ఈ పాఠశాలకు రూ.18 లక్షలు మంజూరుకాగా గదులలో టైల్స్‌తో పాటు మరుగుదొడ్లు నిర్మాణం చేశారు. బ్లాక్ బోర్డుల స్థానంలో వైట్ బోర్డులు, బయట వరండాలో విద్యార్థులు తరగతి గదులలోనికి వెళ్లే దారిలో పార్కింగ్ టైల్స్, తాగటానికి సురక్షిత నీరు, విద్యార్థులకు యూనిఫామ్ వంటివి ఏర్పాటుచేయాలి. అయితే వీటిలో ఏ ఒక్కటి కూడా ఈ పాఠశాలలో కనిపించడం లేదు. గతంలో తీసేసిన బండలను దారికి ఉపయోగించారు. విద్యార్థులు మాత్రం కింద కూర్చునే విద్యను అభ్యశిస్తున్నారు. ఇక్కడ ఉన్న ఫర్నీచర్, ఆట వస్తువులతో పాటు ఓ తరగతి గదిలో బెంచీలు గతంలో దాతలు ఇచ్చినవే కావడం కొసమెరుపు. మరి విడుదలైన రూ.18 లక్షలు బండలకు, మరుగుదొడ్లకే సరిపోయినట్టున్నాయి. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు పెదవి విరుస్తున్నారు.
చేతి డబ్బులే రూ.70 వేలు ఖర్చుచేశా
- డీ విజయబాబు, ప్రధానోపాధ్యాయుడు
ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులు సరిపోలేదు. అందుకే బెంచీలు కొనలేదు. డబ్బులు లేకపోవడంతో డీఈ బాపిరెడ్డి సూచన మేరకు టైల్స్ స్థానంలో పాత బండలు వేశాము. ఈ పనులకు కూడా చేతి డబ్బులు రూ.70 వేలు ఖర్చు చేశాను.