కొండను.. కొల్లగొట్టేస్తున్నారు

ABN , First Publish Date - 2021-09-19T05:45:44+05:30 IST

మండలంలోని లాం-తాతారెడ్డిపాలెం గ్రామాల మధ్య ఉన్న కొండ గ్రావెల్‌తో నిండి ఉంది. ఇక్కడకు సమీపంలో పెద్దసంఖ్యలో వెంచర్లు వెలిశాయి. వీటికి గ్రావెల్‌ అవసరం ఉంది. ఇదే అవకాశంగా లాం కొండపై అక్రమార్కులు కన్నేశారు.

కొండను.. కొల్లగొట్టేస్తున్నారు
లాం కొండపై గ్రావెల్‌ను తవ్వి ట్రాక్టర్లకు లోడ్‌ చేస్తున్న ఎక్స్‌వేటర్‌

ప్రైవేటు వెంచర్లకు గ్రావెల్‌ తరలింపు

అనుమతులు గోరంత.. తవ్విదే కొండంత

అధికార పార్టీ అండతో యథేచ్ఛగా తవ్వకాలు

తూతూమంత్రంగా మైనింగ్‌ అధికారుల దాడులు 

తాడికొండ సెప్టెంబరు 18: మండలంలోని లాం-తాతారెడ్డిపాలెం గ్రామాల మధ్య ఉన్న కొండ గ్రావెల్‌తో నిండి ఉంది. ఇక్కడకు సమీపంలో పెద్దసంఖ్యలో వెంచర్లు వెలిశాయి. వీటికి గ్రావెల్‌ అవసరం ఉంది. ఇదే అవకాశంగా లాం కొండపై అక్రమార్కులు కన్నేశారు. గత సంవత్సరం అక్టోబరులో సర్వే నెంబరు 199-ఏలో  ప్రతి నెల 1500 క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌ను తవ్వడానికి అనుమతి తీసుకున్నారు. అయితే  రెండు మూడు ఎక్స్‌కవేటర్లతో పెద్దఎత్తున తవ్వకాలు సాగుతున్నాయి. రోజుకు 200 ట్రిప్పులు వరకు గ్రావెల్‌ను తరలించి జేబులు నింపుకొంటున్నారు. సీనరేజ్‌ కింద ట్రాక్టర్‌కు రూ.800, టిప్పర్‌కు రూ.1600, పది టైర్ల లారీకి రూ.3200 వసూలు చేస్తున్నారు. ఇందులో సగం వాటా నియోజకవర్గంలోని ఓ ముఖ్యనేతకు వెళ్తున్నట్లు సమాచారం. ఇష్టం వచ్చినట్లు తవ్వే క్రమంలో కొండ చరియాలు పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళనకు గురౌతున్నారు. రోజుల తరబడి గ్రావెల్‌ను తవ్వతుంటే పచ్చదనం కనుమరుగైపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యథేచ్ఛగా అక్రమార్కులు కొండను తవ్వేస్తున్నా సంబంధింత అధికారులు మాత్రం ఇటు వైపు కన్నెత్తి చూడటం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీడియాలో కథనాలు వచ్చినప్పుడు మాత్రమే కంటితుడుపు తనిఖీలు చేపడుతున్నారని ఆరోపిస్తున్నారు. పత్రికల్లో వచ్చిన కథనాలకు ఈ నెల 11న మైనింగ్‌, విలిజెన్స అధికారులు దాడులు చేసి ఎక్స్‌వేటర్‌, ట్రాక్టర్‌, లారీలను తనిఖీలు చేసి వేబిల్లులు లేవని రూ.30,091 జరిమానా విధించారు. అయినా గ్రావెల్‌ తవ్వకాలు మాత్రం ఆగలేదు.  

Updated Date - 2021-09-19T05:45:44+05:30 IST