కర్ఫ్యూలో.. కాలు నిలవదు..!

ABN , First Publish Date - 2021-05-19T05:20:13+05:30 IST

మహమ్మారి కట్టడికంటూ ఈ నెల 5 నుంచి అమలు చేస్తున్న కర్ఫ్యూ ఫలితాలు ఇస్తున్నాయా ..? ఈ ప్రశ్నకు సమాధానం దొరకదు.

కర్ఫ్యూలో.. కాలు నిలవదు..!
ఉదయం 7గంటలకే అమరావతి రోడ్డు వద్ద ఓ వైన్స్‌ ముందు మందుబాబుల క్యూ

వద్దన్నా.. రోడ్డెక్కాల్సిందే..? 

కర్ఫ్యూ సమయంలో కానరాని స్వీయ నియంత్రణ

విరామ సమయంలో ఇష్టారాజ్యం

సాయంత్రం చల్లబడగానే రోడ్లపైకి.. 

అసలు కర్ఫ్యూ ఉందో లేదో అన్నట్లు బయటకు జనం

ఫ నిబంధనలు మరింత కఠినం చేస్తేనే సరి!


(ఆంధ్రజ్యోతి, గుంటూరు)

మహమ్మారి కట్టడికంటూ ఈ నెల 5 నుంచి అమలు చేస్తున్న కర్ఫ్యూ ఫలితాలు ఇస్తున్నాయా ..? ఈ ప్రశ్నకు సమాధానం దొరకదు. వరుసగా కేసులు పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది.. ఆయినా ప్రజల్లో మాత్రం బాధ్యత కనిపించడం లేదు. కర్ప్యూను నెలాఖరువరకు  పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేవలం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ప్రజలు బయట తిరిగేందుకు, వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఈ పాక్షిక లాక్‌డౌన్‌తో కొంతవరకైనా కేసులను అదుపు చేయవచ్చని భావించగా చివరకు చూస్తే విఫల యత్నమే మిగిలించిందని నిపుణులు చెబుతున్నారు. 

విరామంలో ఇష్టారాజ్యం

కరోనా విలయతాండవం చేస్తున్నా ప్రజల్లో మాత్రం ఇంకా నిర్లక్ష్యం కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజలు ఇష్టానుసారం బయట తిరిగేస్తున్నారు. కనీస జాగ్రత్తలు పాటించడం లేదు. వ్యాపార దుకాణాల వద్ద గుంపులు గుంపులుగా చేరుతున్నారు. మాస్కు ధరించడంపై అందరిలో అవగాహన వచ్చినా భౌతికదూరం అన్నమాట మరిచిపోయారు. ఉదయం 7 గంటల నుంచే మద్యం దుకాణాల ముందు, బార్లలో జనాలు బారులు తీరుతున్నారు. ఇక రోడ్లపై తోపుడు బండ్లు, టిఫెన్‌ బండ్లు తదితర చిరువ్యాపారుల వద్ద కనీస జాగ్రత్తలు కనపడటం లేదు. 

సాయంత్రం నాలుగింటికి రోడ్లపైకి..

నగరంలోని ప్రధాన రహదారులు వాకర్స్‌తో సాయంత్రం 4నుంచి కళకళాడుతున్నాయి. రాత్రి 8గంటల వరకు పెద్ద ఎత్తున గుంపులు, గుంపులుగా జనాలు బయటకు వస్తున్నారు.  ఇక ఇన్నర్‌ రింగ్‌రోడ్డులో ఖాళీ స్థలాల్లో యువకులు హల్‌ చల్‌ చేస్తున్నారు. కనీసం మాస్కులు కూడా లేకుండా పుట్టినరోజు వేడుకలు కూడా చేసుకుంటున్నారు. ఇక రాత్రి సమయంలో మందుబాబులు ఖాళీ ప్రదేశాల్లో మద్యం తాగుతూ కనిపిస్తున్నారు.  ప్రధాన కూడళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ కఠినంగా ఉంటున్నా సందులో మాత్రం వ్యాపార కార్యకలాపాలు యఽథేచ్ఛగా జరుగుతున్నాయి. షెట్టర్లు కాస్త కిందకు దించుకొని చిల్లర వ్యాపారులు అమ్మకాలు జరుపుతున్నారు. 

కఠినంగా ఉండటం లేదు...

గత సంవత్సరం ఇదే రోజుల్లో కరోనా నియంత్రణలో భాగంగా పోలీసులు వ్యవహరించిన తీరుకు... ప్రస్తుతం వ్యవహారానికి చాలా తేడా కనిపిస్తోందని కొందరు విమర్శిస్తున్నారు. పోలీసులు  కాస్త చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందంటున్నారు. గత సంవత్సరం ఎక్కడికక్కడ కూరగాయాల మార్కెట్లు ఏర్పాటు చేయటం, ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశంలోకి ప్రజలను రానివ్వకుండా కట్టడి చేశారు. ఈసారి మాత్రం అది కనపడటం లేదు. ఆంక్షలు మీరిన వారిపై కఠినంగా వ్యవహరించారు. ప్రస్తుతం ప్రధాన కూడళ్లలో తప్ప మిగతా చోట్ల అంత కఠినంగా వ్యవహరించటం లేదన్న వివర్శులు వస్తున్నాయి. చాలా వరకు కుటుంబంలో ఒకరికి పాజిటివ్‌ వస్తే దాదాపుగా మిగిలిన వారూ పాజిటివ్‌గా తేలుతున్నారు. బయటకు వెళ్లిన వ్యక్తి నిర్లక్ష్యం మూలంగా ఆ కుటుంబం ఇంట్లో ఉన్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోతోందని నిపుణులు అంటున్నారు. 
Updated Date - 2021-05-19T05:20:13+05:30 IST