మూడు రాజధానుల ఆలోచన దేశ సమగ్రతకు ముప్పు
ABN , First Publish Date - 2021-11-29T05:24:03+05:30 IST
మూడు రాజధానుల ఆలోచనతో దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లుతుందని భువనేశ్వరి పీఠం అధిపతి కమలానంద భారతీస్వామి అన్నారు.

కమలానంద భారతీస్వామి
తెనాలి అర్బన్, నవంబరు 28: మూడు రాజధానుల ఆలోచనతో దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లుతుందని భువనేశ్వరి పీఠం అధిపతి కమలానంద భారతీస్వామి అన్నారు. ఈ ఆలోచనతో భవిష్యత్తులో మూడు రాష్ట్రాల కోసం డిమాండ్ రావచ్చని అభిప్రాయపడ్డారు. తెనాలి వైఖాసన సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం గోవర్ధనస్వామి ఆలయంలో జరిగిన కార్తీక వనసమారాధలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లు వెనక్కు తీసుకోవడం స్వాగతిస్తున్నామన్నారు. రాజధాని అంశం, ఒక పార్టీకి సంబంధించినది కాకుండా ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండాలన్నారు. ప్రభుత్వాలు, పార్టీలు శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తించాలని, రాజధానిగా అమరావతినే అభివృద్ధి చేయాలని సూచించారు. బీజేపీ నాయకురాలు సాధినేని యామినీశర్మ మాట్లాడుతూ అమరావతిని ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారని దానికే తమ పార్టీ కట్టుబడి ఉంటుందన్నారు. రైతులు తమ భూములను త్యాగం చేశారని వారిని ఇబ్బందులు పెడితే తగిన శాస్త్రి తప్పదన్నారు. ఎం.శ్రీనివాసమూర్తి అధ్యక్షతన జరిగిన సభలో అర్చక సమాఖ్య నాయకులు ఆత్రేయబాబు, వేణుగోపాల్, శ్రీనివాసచక్రవర్తి, మాధవకుమార్ తదితరులు ప్రసంగించారు.