12 గంటలు గాలింపు

ABN , First Publish Date - 2021-07-13T05:07:21+05:30 IST

బోయపాలెం క్వారీగుంతల్లో గల్లంతైన యువకుల గాలింపు చర్యలు ఆదివారం రాత్రంతా జరిగాయి.

12 గంటలు గాలింపు
క్వారీలో లభించిన యువకుల మృతదేహాలు

గల్లంతైన యువకుల మృతదేహాల లభ్యం

మధ్యాహ్నానికి కుటుంబ సభ్యులకు అప్పగింత

ప్రత్తిపాడు, జూలై 12: బోయపాలెం క్వారీగుంతల్లో గల్లంతైన యువకుల గాలింపు చర్యలు ఆదివారం రాత్రంతా జరిగాయి. సుమారు 12 గంటలు నిర్విరామంగా వెతుకులాట తరువాత సోమవారం నలుగురి మృతదేహాలను ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది వెలికితీశారు. ఆదివారం రాత్రి సుమారు 9గంటలకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది బోటును సిద్ధంచేసుకుని లోనికి దిగారు. క్వారీలో అడుగుల వ్యవధిలోనే లోతులు మారి పోతున్నాయి. ఒకచోట పది అడుగుల లోతు ఉంటే పక్కనే నలభై అడుగుల లోతు ఉంటుంది. దీనికి తోడు లోపల రాళ్లు ఎక్కువగా ఉండటంతో సిబ్బందికి వెతకడం కష్టంగా మారింది. రాత్రి మొత్తం సిబ్బంది యువకుల కోసం వెతుకుతూనే ఉన్నారు. అర్ధరాత్రి సుమారు 1.30గంటల సమయంలో ఒక మృతదేహం దొరికింది. తెల్లవారుజామున ఐదున్నర సమయంలో, ఏడు గంటల సమయంలో ఒక్కో మృతదేహం చొప్పున దొరికాయి. ఇసుకలో కూరుకునిపోయిన మరో మృతదేహాన్ని 9గంటల సమయంలో బయటకు తీశారు. వెంటనే మృతదేహాలను గుంటూరు జీజీహెచ్‌కు పోస్టుమార్టం నిమిత్తం తరలించి మధ్యాహ్నానికి బందువులకు అప్పగించారు. 12 గంటల పాటు అటు రెవెన్యూ, ఇటు పోలీసు అధికారులతో పాటు యువకుల బంధువులు అలాగే క్వారీ వద్ద ఉండిపోయారు. 

శోక సంద్రంలో ప్రత్తిపాడు

క్వారీలో మునిగి నలుగురు యువకులు మృత్యువాత పడిన సంఘటనతో ప్రత్తిపాడు శోకసంద్రంలో మునిగిపోయింది. కుటుంబసభ్యులు, బంధువులు, తోటి స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. అప్పటివరకు తమతో గడిపినవారు జీవం లేకుండా తిరిగి రావడంతో వారి కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోతున్నారు. చేతికంది వచ్చిన కుమారులు చితికిపోతుంటే ఆ కుటుంబాలు తట్టుకోలేక పోతున్నాయి. ఇద్దరు ఉద్యోగాలు చేస్తూ కుటుంబాలకు ఆసరాగా ఉండగా.. మరొకరు హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చేస్తూ ఉద్యోగం కోసం వెళ్లి వచ్చారు. మరొకరు చదువుతున్నారు. 

  

Updated Date - 2021-07-13T05:07:21+05:30 IST