అవగాహనతో అనర్థాలను అధిగమించాలి

ABN , First Publish Date - 2021-08-27T05:55:46+05:30 IST

సమాజంలో జరుగుతున్న అనర్థాలను గమనిస్తూ మోసాలకు గురికాకుండా ప్రతి ఒక్కరూ సామాజిక పరిస్థితులపై అవగాహన పెంచుకోవాలని హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు.

అవగాహనతో అనర్థాలను అధిగమించాలి
ఈ-నారీ మాసోత్సవ గోడప్రతులను ఆవిష్కరిస్తున్న హోంమంత్రి సుచరిత, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ

ఆడబిడ్డలకు హోంమంత్రి సుచరిత పిలుపు

మంగళగిరి, ఆగస్టు 26: సమాజంలో జరుగుతున్న అనర్థాలను గమనిస్తూ మోసాలకు గురికాకుండా ప్రతి ఒక్కరూ సామాజిక పరిస్థితులపై అవగాహన పెంచుకోవాలని హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు.   స్థానిక రాష్ట్ర మహిళా కమిషన్‌ కార్యాలయంలో గురువారం ఈ-నారి మాసోత్సవ కార్యక్రమం గోడప్రతులను ఆవిష్కరించి ప్రసంగించారు. రాష్ట్రంలో వర్సిటీలు, అనుబంధ కళాశాలల విద్యార్థినులకు ఆన్‌లైన్‌ భద్రతకు సంబంధించి అవగాహన కార్యక్రమాలను రాష్ట్ర మహిళా కమిషన్‌, సైబర్‌ పీస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి నెలరోజులపాటు నిర్వహించనున్నట్టు చెప్పారు. దిశ యాప్‌ను అందరూ వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ ప్రతి విశ్వవిద్యాలయం నుంచి పది వేల మంది విద్యార్థినులు ఈ- సెమినార్లు, వెబినార్లలో పాల్గొంటారని వివరించారు. మహిళా సాధికారిత- పథకాలు-ఫలితాలు అనే అంశమై ఈ చర్చాగోష్లులు జరుగుతాయన్నారు. నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈ-నారి కార్యక్రమం శుక్రవారం నుంచి ప్రారంభం కానుందని చెప్పారు. కార్యక్రమంలో మహిళా కమిషన్‌ సభ్యులు జయలక్ష్మి, గజ్జెల లక్ష్మి, డైరెక్టర్‌ ఆర్‌ సూయజ్‌, కార్యదర్శి నిర్మల, ప్రొఫెసర్లు డాక్టర్‌ సరస్వతి, డాక్టర్‌ సునీత, డాక్టర్‌ సంధ్య తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-08-27T05:55:46+05:30 IST