గుంటూరు నడిబొడ్డులో అక్రమ మైనింగ్..వైసీపీ ఎమ్మెల్యే హస్తం..

ABN , First Publish Date - 2021-10-29T16:04:58+05:30 IST

గుంటూరు: నగరంలో వైసీపీ నేతలు బరితెగించారు.

గుంటూరు నడిబొడ్డులో అక్రమ మైనింగ్..వైసీపీ ఎమ్మెల్యే హస్తం..

గుంటూరు: నగరంలో వైసీపీ నేతలు బరితెగించారు. ఇన్నాళ్లు మారుమూల ప్రాంతాల్లో అక్రమ మట్టి తవ్వకాలను చూశాం.. ఇప్పుడు ఏకంగా నగరం నడిబొడ్డున ప్రభుత్వ స్థలంలోనే అక్రమ మైనింగ్ సాగిస్తున్నారు. రాత్రికి రాత్రే వందల సంఖ్యలో లారీల ద్వార మట్టిని తరలిస్తున్నారు. వైసీపీ నేతల మైనింగ్ దందాపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం..


గుంటూరు నగరంలోని కాకుమానువారితోట సమీపంలో కార్మిక శాఖకు చెందిన స్థలంపై అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల కన్నుపడింది. సుమారు 13 ఎకరాల్లో ఈ భూమి ఉండగా అందులో కార్మికుల క్వార్టర్స్‌, శిక్షణ కేంద్రం ఉన్నాయి. పక్కనే నిరుపయోగంగా ఉన్న ఆరు ఎకరాల భూమిని టీడీపీ ప్రభుత్వ హయాంలో జీజీహెచ్‌ విస్తరణ కోసం కేటాయించారు. ఇది పోను మరో ఏడు ఎకరాల భూమి ఖాళీగా ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నేతల కన్ను ఈ ఖాళీ స్థలంపై పడింది. కార్మికుల సంక్షేమం కోసం వినియోగించాల్సిన ఈ భూమిని మిషన్‌ బిల్డ్‌ ఏపీ పేరుతో అమ్మేయాలని చూసింది. అయితే ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కార్మికులు హైకోర్టుని ఆశ్రయించడంతో దీనిపై స్టే విధించింది. మరికొన్ని రిట్‌ పిటీషన్లు కూడా ఈ స్థలంపై పెండింగ్‌లో ఉన్నట్లు కార్మిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. 


కార్మిక శాఖ భూమిపై ఇద్దరు వైసీపీ నాయకులు కన్నేశారు. హైకోర్టు స్టే విధించిన స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండానే మట్టి తవ్వకాలను చేపట్టారు. కొన్ని రోజులుగా నిత్యం వందల లారీల మట్టిని యంత్రాల ద్వారా తవ్వి తరలిస్తున్నారు. నగరం నడిబొడ్డున ఇంత జరుగుతున్నా ఒక్క అధికారి కూడా కనీసం ఒక్క లారీని కూడా పట్టుకోలేదు.  కాగా ఈ స్థలం తమ ఆధీనంలో లేదని కార్మిక శాఖ చెబుతోంది. మిషన్‌ బిల్డ్‌ ఏపీ కింద ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. మట్టి తవ్వకాల వెనుక స్థానిక ఎమ్మెల్యే ఉండడంతో ఎవరూ అడ్డుకొనేందుకు సాహసించ లేకపోతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అక్రమ మైనింగ్ వ్యవహారంపై టిడిపి, సిపిఐ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పలుమార్లు మట్టి తరలిస్తున్న లారీలు, ట్రాక్టర్లను అడ్డుకొని జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌కు వినతిపత్రం అందజేశారు. గత ప్రభుత్వం ఈ భూమిని జీజీహెచ్‌కు కేటాయించిందని, ఆ భూమిలో వైసిపి నేతలు చేసే అక్రమ మైనింగ్‌ను అడ్డుకోవాలని కోరారు.

Updated Date - 2021-10-29T16:04:58+05:30 IST