గుంటూరు జిల్లా: వైసీపీ ఎంపీపై ప్రజల ఆగ్రహం
ABN , First Publish Date - 2021-12-09T16:51:47+05:30 IST
ఎంపీ నందిగాం సురేష్‌ను చూడాలంటే సోషల్ మీడియా ఇంటర్వ్యూల్లోనూ, టీవీల్లో చూసుకోవాల్సిందేనని...

గుంటూరు జిల్లా: బాపట్ల పార్లమెంట్ నుంచి గత ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎంపీగా నందిగాం సురేష్ గెలుపొందారు. ఆయన స్థానికేతరుడు అయినప్పటికీ బాపట్ల ప్రజలు ఆయనకు అండగా నిలిచారు. ఎన్నో ఆశలతో ఓట్లు వేసి ఎంపీగా గెలిపించారు. కానీ ఆయన మాత్రం గెలిచిన తర్వాత నియోజకవర్గం ప్రజలకు అసలు కనిపించడంలేదని, ఆ పార్టీవారే బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు. తమ ఎంపీని చూడాలంటే సోషల్ మీడియా ఇంటర్వ్యూల్లోనూ, టీవీల్లో చూసుకోవాల్సిందేనని స్థానికులు చర్చించుకుంటున్నారు. కనీసం తన పార్లమెంట్ పరిధిలో వరదలు వచ్చి రైతులు కష్టాల్లో ఉన్నా.. ఆయన వచ్చి పలుకరించని పరిస్థితిపై స్థానికులు మండిపడుతున్నారట.. ఆ ఎంపీ మాత్రం తనను గెలిపించిన నియోజకవర్గం ప్రజలను వదిలేసి తన సొంతూరులో ఉండే తాడికొండ నియోజకవర్గం వ్యవహారాల్లో ఎక్కువ చొరవ చూపుతున్నారని విమర్శలు ఉన్నాయి. సీఎం జగన్ చూపుకోసం, పార్టీ అగ్రనేతల అనుగ్రహం కోసం అనునిత్యం ప్రయత్నిస్తుంటారని సొంత పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు.