నర్సింగ్‌ నియామకాల్లో... ఇష్టారాజ్యం!

ABN , First Publish Date - 2021-09-02T05:47:28+05:30 IST

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో తాత్కాలిక పద్ధతిపై చేపట్టిన నియామకాల ప్రక్రియ గందరగోళానికి తెరలేపింది.

నర్సింగ్‌ నియామకాల్లో... ఇష్టారాజ్యం!

ప్రకటన సమయంలో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌.. 

అది అమలు చేయకుండానే నియామకాలు 

అవినీతి ఆరోపణలకు ఆస్కారం!


గుంటూరు(జీజీహెచ్‌), సెప్టెంబరు1: గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో తాత్కాలిక పద్ధతిపై చేపట్టిన నియామకాల ప్రక్రియ గందరగోళానికి తెరలేపింది. గత నెలలో ప్రభుత్వాసుపత్రిలో తాత్కాలిక పద్ధతిలో పనిచేయటానికి 54 మంది స్టాఫ్‌నర్సులు, 36 ఎంఎన్‌వోలు, 46 టెక్నికల్‌ సిబ్బంది నియామకాలకు సూపరింటెండెంట్‌ పేరుతో పత్రికాప్రకటన ఇచ్చారు. దీనిలో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ప్రకారం నియామకాల ప్రక్రియ ఉంటుందని స్పష్టంగా తెలిపారు. దీనిని అనుసరించి వందల సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మెరిట్‌లిస్టు ఇవ్వకుండానే గత నెల 30వ తేదీ ఎటువంటి పలువురికి నియామక పత్రాలు అందజేశారు. అయితే దీనిలో ఎక్కడా రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అమలు చేయలేదు. దీనిపై జీజీహెచ్‌ ఏవో పూసర్లపాటి శ్రీనివాసులును వివరణ కోరగా తమ పై అధికారులు ఆర్వోఆర్‌ అవసరం లేదని మెరిట్‌ ప్రాతిపదికనే నియామకాలు చేపట్టాలని సూచించినందువల్లే మెరిట్‌ ప్రకారం నియామక పత్రాలను అందించినట్లు తెలిపారు. ప్రకటన సమయంలో ఎందుకలా ఇచ్చారో తనకు తెలియదన్నారు. జీజీహెచ్‌లో కొవిడ్‌ నేపథ్యంలో గత ఏడాది చేపట్టిన ప్రక్రియ  గందరగోళానికి దారి తీసిన పద్ధతి ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఆ నియామకాల గందరగోళమే పలువురు ఉద్యోగుల స్థానచలనానికి కూడా కారణమైంది. గత అనుభవాలను మరచి మరలా అదే తప్పు చేయటం గమనార్హం. నిబంధనల ప్రకారం మెరిట్‌ లిస్టును విడుదల చేసి అభ్యంతరాలు పరిశీలించిన తర్వాతే నియామకపత్రాలు ఇవ్వాలి.. కానీ ఎటువంటి ప్రకటనలు లేకుండా నేరుగా అభ్యర్థులకు ఫోన్‌ చేసి నియామకపత్రం ఇవ్వటంతో అవినీతి ఆరోపణలకు ఆస్కారం ఏర్పడింది.

Updated Date - 2021-09-02T05:47:28+05:30 IST