నత్తలా.. నమోదు

ABN , First Publish Date - 2021-05-11T05:53:37+05:30 IST

పేదల కోసం ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశ పెట్టింది. అయితే కొందరి నిర్లక్ష్యం వల్ల అర్హులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందలేక పోతున్నారు.

నత్తలా.. నమోదు

జీజీహెచ్‌లో నిలిచిన ఆరోగ్యశ్రీ 

సాకులతో చేతులెత్తేసిన హార్వే ఏజెన్సీ 

నష్టపోతున్న కరోనా బాధితులు, వైద్యులు


గుంటూరు(సంగడిగుంట): పేదల కోసం ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశ పెట్టింది. అయితే కొందరి నిర్లక్ష్యం వల్ల అర్హులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందలేక పోతున్నారు. కరోనా కష్ట కాలంలో ఆరోగ్య శ్రీ అండగా ఉండాలి. అయితే గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో హార్వే ఏజెన్సీ నిర్వాహంతో ఆరోగ్య శ్రీ నమోదు ప్రక్రియ సక్రమంగా సాగడంలేదు. ఒక రకంగా చెప్పాలంటే నమోదు ప్రక్రియ నిలిచిపోయినట్లేనని పలువురు ఆరోపిస్తున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా కరోనా బాధితుల నమోదు ప్రక్రియకు ప్రభుత్వం హార్వే ఏజెన్సీకి బాధ్యత అప్పగించింది. ప్రతి నమోదుకు ప్రభుత్వం ఏజెన్సీకి రూ.660 చొప్పున ఇస్తుంది. అయితే కరోనా చికిత్సలు ప్రారంభమైనప్పటి నుంచి కుంటి సాకులు చెబుతూ ఏజెన్సీ నిర్వాహకులు కరోనా బాధితుల నమోదు ప్రక్రియ సక్రమంగా చేయడంలేదు. ప్రస్తుతం జీజీహెచ్‌లో 1500కు పైగా కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. వీరిలో 1000 మందికి పైగా ఆరోగ్యశ్రీ అర్హత ఉంటుంది. అయితే గత 15 రోజుల నుంచి పదుల సంఖ్యలో కూడా రోగుల పేర్లను ఆరోగ్య శ్రీ కింద నమోదు జరగలేదు. దీంతో కరోనా బాధితులు తీవ్రంగా నష్టపోతున్నారు. బెడ్డు, ఆక్సిజన్‌ మాత్రమే జీజీహెచ్‌లో ఉచితంగా దొరుకుతున్నాయి. మిగిలినవన్నీ రోగులు కొనుగోలు చేసుకోవాల్సి వస్తుంది. అదే సమయంలో ఆస్పత్రికి, కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులకు కూడా నష్టం జరుగుతోంది. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుతున్నట్లు నమోదైతే కరోనా బాధితుడికి అవసరమైన మందులను ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా నేరుగా ఆస్పత్రే అందిస్తోంది. ఆస్పత్రిలో లేకపోయినా బయట నుంచి కొనుగోలు చేసి అయినా మందులు ఉచితంగా సరఫరా చేస్తోంది. అంతేగాకుండా చికిత్సకు అవసరమయ్యే ప్రతి రూ.100లో 40 శాతం  ప్రభుత్వ ఆస్పత్రికి జమవుతాయి. మరికొంత భాగం చికిత్స అందించిన వైద్యుడి ఖాతాలో జమవుతాయి. గత కొన్నేళ్లుగా ఆస్పత్రిలో అభివృద్ధి కార్యక్రమాలు  జరిగాయంటే కేవలం ఆరోగ్యశ్రీ నిధుల వల్లనే అని  చెప్పాలి. అయితే హార్వే ఏజెన్సీ నిర్వాకంతో వీటన్నిటికీ అవకాశం లేకుండా పోయింది. అయినా ఎందువల్లనో అధికారులు కూడా ఏజెన్సీ నిర్వాకంపై పట్టీపట్టనట్లుగా ఉంటున్నారనే ఆరోపణలు వస్తున్నారు.  


Updated Date - 2021-05-11T05:53:37+05:30 IST