శేషవాహనంపై శ్రీవారి ఊరేగింపు
ABN , First Publish Date - 2021-03-25T05:38:56+05:30 IST
బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ 22వ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం ఉభయదేవేరి సమేతుడైన స్వామి ఉత్సవమూర్తులకు శేషవాహనంపై ఊరేగింపు నిర్వహించారు.
గుంటూరు (సాంస్కృతికం), మార్చి 24: బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ 22వ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం ఉభయదేవేరి సమేతుడైన స్వామి ఉత్సవమూర్తులకు శేషవాహనంపై ఊరేగింపు నిర్వహించారు. మూలవిరాట్‌లకు విశేష అభిషేకాలు, అర్చనలు, అలంకరణ జరిగాయి. విష్వక్సేన ఆరాధన, పుణ్యావహచనం, నిత్యహోమం, నవకుంభారోహణం, వెంకటేశ్వర మహామంత్ర హోమం తదితర పూజాకార్యక్రమాలు జరిగాయి. సాయంత్రం ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య అధ్యక్షతన బ్రహ్మోత్సవ ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు. శ్రీ శృంగేరి శ్రీవిరూపాక్ష పీఠాధిపతులు గంభీరానంద భారతీస్వామి గాయత్రీ మంత్ర విశిష్టతపై అనుగ్రహభాషణం చేశారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ కోగంటి శ్రీరంగనాయకి బ్రహ్మోత్సవాల విశిష్టతపై ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. సభలో డాక్టర్ కొండబోలు బసవపున్నయ్య, డాక్టర్ మద్దినేని గోపాలకృష్ణ, డీఎస్పీ గోలి లక్ష్మయ్య, భారతీయ ధార్మిక విజ్ఞాన పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు బొల్లేపల్లి సత్యనారాయణ తదితరులు ప్రసంగించారు. సభానంతరం తెనాలికి చెందిన శ్రీ షిరిడి సాయి సేవా సమితి నిర్వాహకులు వెంపటి సత్యనారాయణ బృందం ఆలపించిన భక్తి సంగీత విభావరి ప్రేక్షకులను అలరింపజేసింది.