గంజాయి.. గుప్‌గుప్‌

ABN , First Publish Date - 2021-10-04T05:45:58+05:30 IST

గతంలో కేవలం ఇంజనీరింగ్‌ విద్యార్థులో, డబ్బున్న ప్రముఖుల పిల్లలో వినియోగించేవారు. అది కూడా రెండో కంటికి తెలియకుండా గుట్టుగా సాగిపోయేది.

గంజాయి.. గుప్‌గుప్‌

పట్టణాల నుంచి పల్లెల వరకు

విశాఖ నుంచి యథేచ్ఛగా రవాణా

జిల్లావ్యాప్తంగా విచ్చలవిడిగా అమ్మకాలు 

ముందుగా మత్తుకు ఆపై డబ్బు కోసం స్మగ్లింగ్‌ 


గంజాయి.. గుప్పు గుప్పుమంటున్నది. మత్తులో యువత జోగుతుంది. ఒకప్పడు గంజాయి అంటే విక్రయించే వారిని వేళ్లపై లెక్కపెట్టే పరిస్థితి. అవసరమైన వారికి దొరకడం కూడా కష్టంగా ఉండేది. అయితే ప్రస్తుతం జిల్లాలో మత్తు పదార్థాలు ప్రమాదఘంటికలు మోగిస్తున్నాయి. మద్యం కంటే కూడా గంజాయి వివిధరకాలైన డ్రగ్స్‌ విచ్చలవిడిగా లభ్యమవుతున్నాయి. దీంతో మత్తు వినియోగం ఊహించని విధంగా పెరిగిపోయింది. గతంలో కేవలం నగరాలు, పట్టణ ప్రాంతాలకే పరిమితమైన గంజాయి నేడు పల్లెల వరకు పాకింది. జిల్లా వ్యాప్తంగా గంజాయి విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. మైనర్ల నుంచి పెద్దల వరకు దీనిని యథేచ్ఛగా వినియోగిస్తూ మత్తుకు బానిసలుగా మారుతున్నారు.  


 గంజాయి నుంచి డ్రగ్స్‌ వరకు

మెట్రో పాలిటన్‌ సిటీలను తలదన్నేలా జిల్లాలో మత్తు పదార్థాల వినియోగం ఆందోళనకర స్థాయిలో కొనసాగుతుంది. గతంలో గంజాయి మాత్రమే వినియోగించేవారు నేడు అనేక రకాలైన డ్రగ్స్‌ వినియోగించే స్థాయికి చేరారు. గంజాయి నుంచి లిక్విడ్‌ గంజాయికి పరిమితం కాకుండా సింథటిక్‌డ్రగ్స్‌, ట్రెమిడాల్‌ టాబ్లెట్లు, ఎండీఎంఏ డ్రగ్స్‌ వంటి ఎన్నో కొత్త రకాల డ్రగ్స్‌ జిల్లాలో వినియోగిస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైనవైనా వీటికి బానిసలైనవారు రకరకాల మార్గాల్లో దిగుమతి చేసుకుని వినియోగిస్తున్నారు.


లిక్విడ్‌ రూపంలో..

కిలోల కొద్దీ గంజాయిని దిగుమతి చేసుకోవడంలో ఎదురవుతున్న ఇబ్బందులతో స్మగ్లర్లు పంథా  మార్చారు.  గంజాయిని వేడి చేసి ఉడికించడం ద్వారా లిక్విడ్‌ గంజాయి తయారు చేస్తున్నారు. దీనిని చిన్నిచిన్ని బాటిళ్లలో నింపి ఔషధాల మాదిరిగా దిగుమతి చేసుకుంటున్నారు. ఇది ఏమాత్రం వాసన రాకపోవడం, ఎవరికీ అనుమానం రాదు. వినియోగించడానికి కూడా సులువుగా ఉండటం ఎవరికీ అనుమానం వచ్చే పరిస్థితి లేకపోవడంతో లికిడ్‌ గంజాయికే ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారు.  



(ఆంధ్రజ్యోతి - న్యూస్‌నెట్‌వర్క్‌)

గతంలో కేవలం ఇంజనీరింగ్‌ విద్యార్థులో, డబ్బున్న ప్రముఖుల పిల్లలో వినియోగించేవారు. అది కూడా  రెండో కంటికి తెలియకుండా గుట్టుగా సాగిపోయేది. గంజాయి, డ్రగ్స్‌ వంటి మత్తు పదార్థాల కొనుగోలుకు అవసరమైన డబ్బు తల్లిదండ్రులు ఇవ్వకుంటే ఇంట్లో ఖరీదైన వస్తువులను సైతం ధ్వంసం చేస్తూ బీభత్సం సృష్టిస్తున్న వారెందరో ఉన్నారు. వారి నుంచి తమను కాపాడాలనే వినతులతో పోలీసులను ఆశ్రయిస్తున్న తల్లిదండ్రులు ఇటీవల కాలంలో ఎందరో ఉన్నారు. గతంలో మత్తు పదార్థాలు వినియోగించేవారిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చేది. నేడు ఇటువంటి ముఠాలు, వినియోగిస్తున్నవారు పోలీసులకు ఎక్కడపడితే అక్కడ పట్టుబడుతున్నారు. జిల్లాలోకి విశాఖ మన్యం నుంచి గుట్టుగా గంజాయి అక్రమంగా రవాణా అవుతుంది. విశాఖలోని నర్సీపట్నం, అరకు, చింతపల్లి, ఏజెన్సీ నుంచి పెద్ద ఎత్తున గంజాయి దిగుమతి చేసుకుంటున్నారు. ముందుగా స్నేహితుల ద్వారా గంజాయి లాంటి మత్తు పదార్థాలకు అలవాటు చేసుకుంటున్న విద్యార్థులు ఎందరో ఉన్నారు. ఇలాంటి వారు ఆ తరువాత బానిసలుగా మారి అవి లేకపోతే బతకలేని పరిస్థితికి చేరుతున్నారు. ఈ విధంగా జిల్లాలో మత్తుకు బానిసలైన ఎంతోమంది యువకులు కాలక్రమేణా దీనిని వ్యాపార సాధనంగా మార్చుకుంటున్నారు. దీంతో వీరు మత్తుపదార్థాల  స్మగ్లింగ్‌లోకి అడుతు పెడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా గడచిన ఏడాదిన్నరలో పట్టుబడిన 365 మందిని పోలీసులు వివిఽధ కోణాల్లో విచారించగా విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. గంజాయి కొనుగోలుకు అవసరమైన డబ్బు లేక దీనిని వ్యాపారంగా మలుచుకుని ఒకవైపు తాము తాగుతూ మరోవైపు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసు విచారణలో తేలింది. కొందరు సరదాగా ద్విచక్ర వాహనాలపై విశాఖ ఏజన్సీకి వెళ్లి తెచ్చుకుంటున్నట్లు ఇటీవల పోలీసులకు పట్టుబడిన యువకులు వెళ్లడించారు. పలు చోట్ల గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు జరుగుతుండటంతో ఎక్కువగా యువత, కార్మికులు, కూలీలు బానిసలుగా మారుతున్నారు. మద్యం ధరలు మూడు రెట్లు పెరగటంతో నిరుద్యోగ యువత, కార్మికులు, వ్యవసాయకూలీలు అందుబాటు ధరకు వస్తున్న గంజాయి, నాటుసారా మత్తుపానియాలు, పదార్థాలకు బానిసలుగా మారుతున్నారు. తక్కువ ధరకు ఎక్కడైనా అందుబాటులో ఉంటుండటంతో మత్తు కోసం యువత, కార్మికులు గంజాయిని ఆశ్రయిస్తున్నారు.   


కొరియర్‌ద్వారా డ్రగ్స్‌ 

జిల్లాలో ఇటీవల కాలంలో డ్రగ్స్‌ వినియోగిస్తూ పట్టుబడుతున్నవారి సంఖ్య ఆందోళన  కలిగిస్తుంది. మత్తు వ్యవహారం కేవలం గంజాయికేగాక ఎవరికీ తెలియని, ఎక్కడా దొరకని డ్రగ్స్‌ కూడా వినియోగిస్తున్నారు. వీటిని చివరకు ఆన్‌లైన్‌లోనూ, కొరియర్‌ ద్వారానూ దిగుమతి చేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల మంగళగిరి  పోలీసులు, ఎస్‌ఈబీ బృందాలు దాడిచేసి వివిఽధరకాలైన డ్రగ్స్‌ను పట్టుకున్న  విషయం కలకలం రేపింది. టాబ్లెట్‌లు, పేపర్‌లో ఉన్న డ్రగ్స్‌ను పోలీసులు స్వాఽధీనం చేసుకున్నారు. వీటిని ఓ యాప్‌ ద్వారా  ఆన్‌లైన్‌ తెప్పించినట్లు పోలీసులు గుర్తించారు.


ఏడాదిన్నరలో 6750 కిలోల గంజాయి స్వాధీనం

గడచిన ఏడాదిగా స్థానిక పోలీసులతో కలిసి ఎస్‌ఈబీ బృందాలు గంజాయి, డ్రగ్స్‌ వంటి మాదక ద్రవ్యాలపై విస్తృత దాడులు చేస్తూ పెద్ద ఎత్తున అరెస్టులు చేస్తున్నాయి. గత ఏడాది మే నుంచి ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 6750 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 127 కేసులు నమోదు చేశారు.  ఆయా కేసుల్లో 325 మందిని అరెస్టు చేసి 40 వాహనాలను సీజ్‌ చేశారు. అలాగే వారి నుంచి 55 గ్రాముల సింథటిక్‌ డ్రగ్‌, 25 రెమిడాల్‌ ట్యాబ్లెట్లు, 8.068 గ్రాముల ఎంబీఎంఏ వంటి డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. 


హాట్‌స్పాట్‌గా.. లైమ్‌సిటీ

పిడుగురాళ్లలో గంజాయి అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఎక్కువ మంది సున్నపుబట్టీల కార్మికులుండటంతో గంజాయి అమ్మకాలు ఎక్కువయ్యాయి.  రోజంతా రెక్కలుముక్కలు చేసుకొని సంపాదించినదంతా గంజాయి మత్తుకోసం ఖర్చుచేస్తున్నవారెందరో ఉన్నారు. మార్కెట్‌యార్డు, అసంపూర్తిగా ఉన్న బైపాస్‌రోడ్డు, చెరువుకట్ట ప్రాంతం, లెనిన్‌నగర్‌లోని ఖాళీ ప్రాంతాలతోపాటు రహదారిలో వాహనాలు తక్కువగా ఉండే ప్రాంతాల్లో పలువురు గంజాయి మత్తులో ఊగిపోతున్నారు. సున్నపుబట్టీలు ఎక్కువగా ఉన్న లెనిన్‌నగర్‌ ప్రాంతమే గంజాయి వ్యాపారానికి స్థావరంగా ఉంది. అధికారులు అడపాదడపా దాడులకే పరిమితమవుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. గంజాయి వ్యాపారానికి అధికార పార్టీ చోటామోటా నాయకులు అండగా ఉన్నారన్న ఆరోపణలున్నాయి.


గంజాయి మత్తులో పల్లెలు

చిలకలూరిపేట నియోజకవర్గంలో పోలీసుల కళ్లుగప్పి గుట్టుగా గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం. జిల్లాలోని అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతమైన గణపవరంలో గంజాయి అమ్మకాలు జోరుగా జరుగుతున్నట్లు సమాచారం. తెనాలి రైల్వేస్టేషన్‌ రోడ్డు కేంద్రగా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి.   మారీస్‌పేట స్కూల్‌ వెనుక రైల్వేలైన్‌ ప్రాంతంలోనూ విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం. కర్లపాలెం మండలంలో గంజాయి మత్తులో గతంలో ఓ యువకుడ్ని హత్య చేశారంటే దీని వినియోగం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. బాపట్ల పరిసర ప్రాంతాలకు కూడా అరకు, విశాఖప్రాంతాల నుంచి రవాణా చేస్తున్నట్లు సమాచారం. పొన్నూరు పట్టణంలోని రైల్వేస్టేషన్‌రోడ్డు, ఆలూరుకట్ట, గణేష్‌భవన్‌రోడ్డు, ఇటికంపాడు రోడ్డు తదితర ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయని సమాచారం. విజయవాడ నుంచి పొన్నూరు, ఒంగోలు, నెల్లూరు ప్రాంతాల్లో రైళ్లలో అధికంగా అక్రమ రవాణా జరుగుతుంది. 


వ్యూహాత్మకంగా చర్యలు

జిల్లాలో ఇటీవల కాలంలో పెరుగుతున్న గంజాయి, డ్రగ్స్‌ వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు వ్యూహాత్మకంగా చర్యలు తీసుకుంటున్నాం. కాలేజీలు, ఎక్కువగా వినియోగించే వారిపై నిఘా ఉంచి వారిని గుర్తించి చర్యలు తీసుకుంటున్నాం. డ్రగ్స్‌ కొనుగోలు, ఆన్‌లైన్‌ రవాణా, విక్రయాలపై నిఘా పెట్టాము. కొరియర్‌ సర్వీసులపై తనిఖీలు, డెకాయ్‌ ఆపరేషన్‌ ద్వారా గంజాయిని పట్టుకుంటున్నాము. ఇద్దరు ఎస్పీలు జేడీతో కలిపి టాస్క్‌ఫోర్స్‌ కూడా ఏర్పాటు చేశాం. డ్రగ్స్‌ను క్షణాల్లో గుర్తించే స్పాట్‌ డ్రగ్‌ టెస్టింగ్‌ కిట్స్‌ పోలీసు శాఖకు అందుబాటులోకి వచ్చాయి. ఈ పరికరం డ్రగ్స్‌ను  గుర్తించడంలో సత్ఫలితాన్ని ఇస్తుంది. 

- బిందుమాధవ్‌, జేడీ, ఎస్‌ఈబీ

     


Updated Date - 2021-10-04T05:45:58+05:30 IST