స్నేహితుడు దూరమవుతున్నాడని.. అతడి భార్య ఫొటోలు మార్ఫింగ్‌ చేసి..

ABN , First Publish Date - 2021-09-02T14:11:08+05:30 IST

ప్రేమించి పెళ్లి చేసుకున్న స్నేహితుడు తనకు దూరమవుతున్నాడన్న కారణంగా..

స్నేహితుడు దూరమవుతున్నాడని.. అతడి భార్య ఫొటోలు మార్ఫింగ్‌ చేసి..

నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు


గుంటూరు: ప్రేమించి పెళ్లి చేసుకున్న స్నేహితుడు తనకు దూరమవుతున్నాడన్న కారణంగా వారిరువురి ఫొటోలను మార్ఫింగ్‌ చేసి స్నేహితుడి బంధువులకు పంపి బ్లాక్‌మెయిల్‌ చేసిన కేసులో యడ్లపాడుకు చెందిన బెజ్జం దేవలాడ్విన్‌ను చేబ్రోలు పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు బుధవారం గుంటూరులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సౌత్‌ డీఎస్పీ జెస్సీ ప్రశాంతి నిందితుడిని మీడియా ఎదుట హాజరుపరచి వివరాలు వెల్లడించారు. వాసిమళ్ల జెవిన్‌టన్‌, దేవలాడ్విన్‌లు ఇద్దరూ స్నేహితులు. 2017లో వీరిరువురు గుంటూరులో ఐటీఐలో కలిసి చదివారు. ఐటీఐ పూర్తి చేశాక 2019లో దూరవిద్య ద్వారా ఇంటర్‌ పూర్తి చేశారు. కాగా గత జులై 18న ఇద్దరూ ఉద్యోగం నిమిత్తం నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని ద్విచక్ర వాహన తయారీ కంపెనీలో చేరారు. అక్కడే ఇద్దరూ గది అద్దెకు తీసుకుని ఉండేవారు. ఇదిలావుంటే గత నెల 7న జెవిన్‌టన్‌ వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడుకు చెందిన తాను ప్రేమించిన ప్రవళికను వివాహం చేసుకున్నా డు. అయితే అప్పటివరకు దేవకు, జెవిన్‌టన్‌కు మధ్య సంబంధం కొనసాగేది.


అయితే జెవిన్‌టన్‌ పెళ్లి చేసుకుని వెళ్లిపోవటంతోపాటు తాను పూర్తిగా దూరం కావటంతో దేవ జీర్ణించుకోలేకపోయాడు. ఈ క్రమంలో జెవిన్‌టన్‌ పంపిన అతని పెళ్లి ఫొటోలను మార్ఫింగ్‌ చేసి అసభ్యకరమైన సందేశాలతో బాధితురాలు సెల్‌కు పంపాడు. దీంతో బాధితురాలు గత నెల 27న వట్టిచెరుకూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సౌత్‌ డీఎస్పీ జెస్సీ ప్రశాంతి ఆధ్వర్యంలో చేబ్రోలు సీఐ ఎం.మదుసూధనరావు ఆధ్వర్యంలో వట్టిచెరుకూరు ఎస్‌ఐ డి.మహేంద్ర సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆయా ఫొటోలను దేవ పంపినట్టు గుర్తించి బుధవారం నిందితుడు దేవను అరెస్టు చేసినట్టు డీఎస్పీ ప్రశాంతి తెలిపారు. కేసును చేధించిన అధికారులు, సిబ్బందిని ఆమె అభినందించారు.

Updated Date - 2021-09-02T14:11:08+05:30 IST