కక్షసాధింపు తప్ప.. అభివృద్ధి లేదు

ABN , First Publish Date - 2021-11-23T05:39:40+05:30 IST

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా అంగీకరించిన వైఎస్‌ జగన అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులంటూ బిల్లుపెట్టటం హాస్యాస్పదమని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తెలిపారు.

కక్షసాధింపు తప్ప.. అభివృద్ధి లేదు
మాట్లాడుతున్న యరపతినేని

మాజీ ఎమ్మెల్యే యరపతినేని 

పిడుగురాళ్ల, నవంబరు 22: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా అంగీకరించిన వైఎస్‌ జగన అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులంటూ బిల్లుపెట్టటం హాస్యాస్పదమని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం పిడుగురాళ్ల టీడీపీకార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అమరావతి ఏకైక రాజధానిగా ప్రకటించాలని కోరుతూ రాజధాని ప్రాంతరైతులు, మహిళలు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు నిర్వహిస్తున్న మహా పాదయాత్రకు వైసీపీ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందన్నారు. అహంకారం పెరిగి పతనానికి వైసీపీ ప్రభుత్వం దిగజారేసమయం ఆసన్నమైందని యరపతినేని పేర్కొన్నారు. ఏ నాడు రాజకీయాల వైపు అడుగువేయని చంద్రబాబు సతీమణిపై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయటం దుర్మార్గమని, మహిళలను గౌరవించలేని వైసీపీ నేతలకు త్వరలోనే బుద్ధిచెప్పే రోజులు ఆ పార్టీ నుంచే మొదలవుతాయన్నారు. గతంలో ఏపార్టీ అధికారంలో ఉన్నా అభివృద్ధినే కొనసాగించగా ఇప్పుడు వైసీపీ మాత్రం కక్షసాధింపు, అక్రమ కేసుల వైపు నడవటం తప్ప అభివృద్ధి సంక్షేమమేమీ రాష్ట్రంలో కనిపించటం లేదన్నారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు కానిస్టేబుల్‌, మెప్మా ఉద్యోగిరాజీనామా చేయటం నిదర్శనమన్నారు. పోలీసులు, అధికారులు ఇకపై ఆత్మపరిశీలన చేసుకొని న్యాయంవైపు అడుగులు వేయాలని హితవుపలికారు. వైసీపీ, టీడీపీ మధ్య రాజకీయ విభేదాలే తప్ప వ్యక్తిగత విభేదాలకు తావులేదని యరపతినేని వివరించారు. ప్రభుత్వ వైఫల్యాలపై అలుపెరగని పోరాటంచేస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకుడు కంచేటి శివ, పలువురు పాల్గొన్నారు. 


Updated Date - 2021-11-23T05:39:40+05:30 IST