కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం

ABN , First Publish Date - 2021-05-06T05:14:53+05:30 IST

రాష్ట్రం కరోనా మహమ్మారితో అతలాకుతలమై పోతుంటే రోమ్‌ నగరం తగలబడుతున్నప్పుడు ఫిడేలు వాయిస్తున్న నీరో చక్రవర్తి లాగా రాష్ట్రంలో జగన్‌ పరిపాలన కొనసాగుతోందని మాజీ శాసనసభ్యుడు, టీడీపీ సీనియర్‌ నాయకుడు యరపతినేని శ్రీనివాసరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.

కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం
యరపతినేని శ్రీనివాసరావు

మాజీ ఎమ్మెల్యే యరపతినేని 

పిడుగురాళ్ల, మే 5: రాష్ట్రం కరోనా మహమ్మారితో అతలాకుతలమై పోతుంటే రోమ్‌ నగరం తగలబడుతున్నప్పుడు ఫిడేలు వాయిస్తున్న నీరో చక్రవర్తి లాగా రాష్ట్రంలో జగన్‌ పరిపాలన కొనసాగుతోందని  మాజీ శాసనసభ్యుడు, టీడీపీ సీనియర్‌ నాయకుడు యరపతినేని శ్రీనివాసరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన వైసీపీ నేడు ప్రజలను రక్షించి ప్రాణాలు కాపాడకుండా చేతులెత్తేసి చోద్యం చూస్తోందన్నారు. ఆక్సిజన్‌ను సమకూర్చడంలో కూడా జగన్‌ ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. రాష్ట్రంలో రోజుకు 20వేల మందికి కరోనా సోకి ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వాసుపత్రుల్లో పడకలు లేక,  ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు చెల్లించలేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. 18 సంవత్సరాలు నిండినవారికి కొవిడ్‌ టీకా సమకూర్చడంలో రాష్ట్రప్రభుత్వం విఫలం చెందిందని ఆరోపించారు. కేవలం రూ.1,600 కోట్లతో రాష్ట్రప్రజలందరికీ టీకాలు వేసే అవకాశమున్నా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయకపోవటం విడ్డూరమని విమర్శించారు. రెండో డోస్‌ కోసం ఎందరో ప్రభుత్వాసుపత్రుల చుట్టూ తిరుగుతున్నా వారికి టీకాలు అందజేయలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు.  గురజాల నియోజకవర్గంలో నేటి వరకు కొవిడ్‌ క్వారంటైన్‌ సెంటర్లను ఏర్పాటుచేయకపోవటం  విచారకరమని అన్నారు. కొవిడ్‌ ఉధృతి తగ్గే వరకు ఉపాఽధి పనులను నిలిపివేసి జాబ్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి  కనీస వేతనం అందించాలని యరపతినేని డిమాండ్‌ చేశారు. భవన నిర్మాణ కార్మికులు, సున్నంబట్టీలు, సున్నమిల్లులు, క్వారీలలో ప్రస్తుతానికి పనులు లేక కార్మికుల కుటుంబాలన్నీ ఆర్థిక ఇబ్బందులు పడుతున్నావారిని ప్రభుత్వం గుర్తించి నిత్యావసర సరుకులు, వైద్య సదుపాయం కల్పించి ఆదుకోవాలని యరపతినేని ప్రభుత్వాన్ని కోరారు. 

Updated Date - 2021-05-06T05:14:53+05:30 IST