ప్రభుత్వ అనాలోచిత చర్యలతోనే కరోనా విజృంభణ

ABN , First Publish Date - 2021-05-19T05:25:39+05:30 IST

వైసీపీ ప్రభుత్వ అనాలోచిత చర్యలతోనే రాష్ట్రంలో కరనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తోందని టీడీపీ గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ విమర్శించారు.

ప్రభుత్వ అనాలోచిత చర్యలతోనే కరోనా విజృంభణ
తెనాలి శ్రావణ్‌కుమార్‌

తెనాలి శ్రావణ్‌కుమార్‌

గుంటూరు, మే 18(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ అనాలోచిత చర్యలతోనే రాష్ట్రంలో  కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తోందని టీడీపీ గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ విమర్శించారు. మంగళవారం ఆయన ఆన్‌లైన్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 30శాతానికి చేరిందని.. మరోపక్క బ్లాక్‌ ఫంగస్‌ ముప్పు ముంచుకొస్తున్నా వైద్యం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.  ఈనెల 16న రికార్డు స్థాయిలో 24వేల 171 కేసులు నమోదుకాగా, పొరుగున ఉన్న తెలంగాణలో కేవలం 3,816 కేసులు మాత్రమే నమోదు కావడాన్ని పరిశీలిస్తే రాష్ట్రంలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చన్నారు. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో 30శాతం మందికి ఆక్సిజన్‌ అవసరమవుతుండగా, అందులో కేవలం 10శాతం మందికి కూడా ఆక్సిజన్‌ బెడ్లు లభించని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.  రాష్ట్రంలో తొలివిడత వ్యాక్సినేషన్‌ వేసే కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేశారని.. మొదటి డోసు తీసుకున్న  73లక్షల మందిలో 40శాతం కూడా రెండో దశ వ్యాక్సినేషన్‌ పూర్తికాలేదని విమర్శించారు. బ్లాక్‌ ఫంగస్‌ సోకిన వ్యాధిగ్రస్తులకు ఉచితంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేసేవిధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు, ఆక్సిజన్‌ అందక మృతి చెందిన వారికి రూ.25లక్షల పరిహారం అందించాలని శ్రావణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. 

  

Updated Date - 2021-05-19T05:25:39+05:30 IST