భూ ఆక్రమణలపై సీబీఐ విచారణ జరిపించాలి..

ABN , First Publish Date - 2021-10-30T04:41:17+05:30 IST

బొల్లాపల్లి మండలంలోని భూఆక్రమణలపై సీబీఐ విచారణ జరిపించాలని టీడీపీ నరసరావుపేట పార్లమెంటు అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు డిమాండ్‌ చేశారు.

భూ ఆక్రమణలపై సీబీఐ విచారణ జరిపించాలి..
సమావేశంలో మాట్లాడుతున్న జీవీ ఆంజనేయులు

పాసు పుస్తకాలకు రూ.కోట్లు వసూలు చేశారు..

ఎమ్మెల్యే బొల్లాపై.. జీవీ తీవ్ర ఆరోపణలు

క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌

వినుకొండ, అక్టోబరు 29: బొల్లాపల్లి మండలంలోని భూఆక్రమణలపై సీబీఐ విచారణ జరిపించాలని టీడీపీ నరసరావుపేట పార్లమెంటు అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు డిమాండ్‌ చేశారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తహసీల్దార్‌ను అడ్డుపెట్టుకొని దాదాపు రూ.10కోట్లకు పైగా వసూళ్లు చేశారని ఆరోపించారు. ఒక్కో పాస్‌పుస్తకానికి రూ.10వేలు చొప్పున తీసుకుని 7వేలకు పైగా పాస్‌ పుస్తకాలు మంజూరు చేశారన్నారు. చుక్కల భూములు, పోరంబోకు, ప్రభుత్వ భూములకు అడ్డగోలుగా తనకు కావాల్సిన వారికి ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. ఆ బుక్‌లను బ్యాంక్‌ల్లో పెట్టి మోసం చేసి లోన్ల రూపంలో నగదును కాజేస్తున్నారన్నారు. బొల్లాపల్లి మండలంలో  అటవీ భూములకు సైతం పాస్‌పుస్తకాలు మంజూరు చేస్తున్నారన్నారు.  పేదల దగ్గర పాస్‌పుస్తకాలకు వసూళ్లు చేసిన డబ్బులు తిరిగి ఇవ్వకపోతే ఎమ్మెల్యే బొల్లాను తండాల్లోని ప్రజలు తండాల్లో తిరగనివ్వరని  అన్నారు. అదేవిధంగా జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీరంగనాథరాజు వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వినుకొండ పట్టణంలో మాస్టిన్‌కాలనీ, ధర్మపురి కాలనీల్లో పేదలకు స్థలాలు ఇచ్చామని అన్నారు. టీడీపీ హయాంలో పేదలకు 5సెంట్ల ఇళ్ల స్థలాలను ఇచ్చి ఇళ్లు నిర్మించి ఇచ్చామని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలో సెంటు భూమి ఇచ్చి పేదలను దగా చేశారని అన్నారు. ఈ భూ పంపిణీలో కూడా ఎమ్మెల్యే బొల్లా రూ.18కోట్లు కాజేశారని చెప్పారు. తానుకాని, తన కుటుంబసభ్యులు కాని ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని ఉంటే నిరూపించాలని సవాల్‌ విసిరారు. ఎమ్మెల్యేతో పాటు బొల్లాపల్లి రెవెన్యూ అధికారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని జీవీ డిమాండ్‌ చేశారు. సమావేశంలో గోవిందునాయక్‌, హనుమానాయక్‌, పల్లమీసాల దాసయ్య, గోవిందరాజులు, ఎ.శ్రీను తదితరులు పాల్గొన్నారు.   


Updated Date - 2021-10-30T04:41:17+05:30 IST