పార్టీలకతీతంగా పంటను కొనుగోలు చేయాలి
ABN , First Publish Date - 2021-05-22T04:32:21+05:30 IST
పంట కొనుగోలులో సొసైటీ ఉద్యోగులను ఒత్తిళ్లకు గురిచేసి రైతులకు అన్యాయం చేయడం సిగ్గుచేటని టీడీపీ నరసరావుపేట పార్లమెంటు అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు.

జీవీ ఆంజనేయులు
వినుకొండ, మే 21: పంట కొనుగోలులో సొసైటీ ఉద్యోగులను ఒత్తిళ్లకు గురిచేసి రైతులకు అన్యాయం చేయడం సిగ్గుచేటని టీడీపీ నరసరావుపేట పార్లమెంటు అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పంట కొనుగోలులో పాలకులు రాజకీయ విభేదాలు చూపి రైతులకు అన్యాయం చేయడం తగదన్నారు. రైతులు పండించిన పంటకు ఒక రకం, వైసీపీ రైతులు పండించిన పంటకు మరో రకంగా రేట్లు నిర్ణయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గ్రామాల్లో రాజకీయ రంగు పులిమి అమాయక రైతులను అధికార పార్టీ నాయకులు అన్యాయం చేయడం దుర్మార్గమని, రాష్ట్రంలో రైతు వ్యతిరేక పాలన సాగుతుందనడానికి ఇదే నిదర్శనమన్నారు. వేల్పూరులో రాజకీయ భేదాలు చూపుతూ రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆయన విమర్శించారు. మార్క్‌ఫెడ్ ద్వారా రైతులు పండించిన పంటను ఈ-క్రాప్ నమోదు ఆధారంగా కొనుగోలు చేయాల్సి ఉండగా, రైతులు మొక్కజొన్న పంటని కొనుగోలు కేంద్రానికి తెస్తే వైసీపీ నాయకులు అనుకూలమైన వారికి టోకెన్లు ఇచ్చి కొనుగోలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇప్పటికైనా పార్టీలకతీతంగా రైతులు పండించిన మొక్కజొన్న పంటను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.