ప్రభల నిర్మాణాన్ని ఆపే ప్రసక్తి లేదు

ABN , First Publish Date - 2021-02-26T05:43:33+05:30 IST

కోటప్పకొండ తిరుణాళ్లకు ప్రభల నిర్మాణం జరిగి తీరుతుందని.. ఆపే ప్రసక్తి లేదని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.

ప్రభల నిర్మాణాన్ని ఆపే ప్రసక్తి లేదు
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు 

చిలకలూరిపేట, ఫిబ్రవరి 25: కోటప్పకొండ తిరుణాళ్లకు ప్రభల నిర్మాణం జరిగి తీరుతుందని.. ఆపే ప్రసక్తి లేదని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.  చిలకలూరిపేటలో గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా కోటప్పకొండకి మహాశివరాత్రి సందర్భంగా పురుషోత్తమపట్నం, వివిధ గ్రామాల ప్రజలు ప్రభలు కట్టుకుని వెళ్లే ఆచారం ఉందన్నారు. గ్రామాల్లో పార్టీలు, కుల, మతాలకు అతీతంగా ప్రభలు నిర్మిస్తారన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ ఉంది.. ప్రభలు నిర్మించవద్దని ఫోన్లు చేసి పోలీసులు హెచ్చరించడం మంచి పద్ధతి కాదన్నారు. దశాబ్దకాలంగా జరిగే ఉత్సవాన్ని ఆపడానికి పోలీసులు ఎవరి ప్రశ్నించారు. కావాలంటే బందోబస్తు పెంచి గొడవలు కాకుండా చూసుకోవాలన్నారు. నరసరావుపేటలో విద్యార్థిని అనూష హత్య దుర్మార్గ చర్య అన్నారు.   రాష్ట్రంలోని మరెక్కడా నియోజకవర్గాలలో లేని విధంగా చిలకలూరిపేటలో అధికారపార్టీ అక్రమ మద్యాన్ని ఏరులై పారిస్తున్నదన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గానికి ప్రత్యేకంగా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాన్ని ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మద్యాన్ని నియంత్రించాలన్నారు. నియోజకవర్గంలో పెద్దఎత్తున టీడీపీ మద్ధతుదారులు పంచాయతీలు గెలుచుకున్నారన్నారు. సమావేశంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు షేక్‌ కరిముల్లా,  మండల అధ్యక్షుడు జవ్వాజి మదన్‌, బండారుపల్లి సత్యనారాయణ, గుర్రం నాగపూర్ణచంద్రరావు, జవ్వాజి బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-26T05:43:33+05:30 IST