రైతుని ఆదుకోలేని జగన్‌ సీఎంగా అనర్హుడు

ABN , First Publish Date - 2021-12-31T05:59:47+05:30 IST

రాష్ట్రంలో రైతుల్ని ఆదుకోలేని జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా అనర్హుడని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు విమర్శించారు.

రైతుని ఆదుకోలేని జగన్‌ సీఎంగా అనర్హుడు
మాజీ మంత్రి ఆనందబాబుకు ధాన్యం రాశి చూపి సమస్యలు వివరిస్తున్న రైతులు

మీడియేటర్లు, రాజకీయ బ్రోకర్ల అడ్డాగా పాలన

ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి ఆనందబాబు ఆగ్రహం

వేమూరు, డిసెంబరు 30: రాష్ట్రంలో రైతుల్ని ఆదుకోలేని జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా అనర్హుడని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు విమర్శించారు. గురువారం అమర్తలూరు మండలం పెదపూడి వంతెన నుంచి  పెరవలిపాలెం, పెరవలి, వేమూరు మీదగా వేమూరు రైతు భరోసా కేంద్రం వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఆర్‌బీకే వద్ద ఆరబోసిన ధాన్యం రాశులు పరిశీలించి రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.  అనంతరం అక్కడ బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీడియేటర్లు, రాజకీయ బ్రోకర్లకు అడ్డాగా రాష్ట్రంలో జగన్‌ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఆర్‌బీకేల పేరుతో రైతును దగా చేస్తున్నారన్నారు. తేమ వంకతో ధర తగ్గించి ఇస్తున్నారని, వైసీపీకి చెందిన బ్రోకర్లు, మిల్లర్లకే ధాన్యాన్ని కట్టబెడుతున్నారని ఆరోపించారు. రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని, గిట్టుబాటు ధర అందిస్తామని ప్రగల్భాలు పలికిన సీఎం దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారన్నారు. నియోజకవర్గంలోని 89 గ్రామాల పరిధిలో రైతులు వద్ద 30 లక్షల ధాన్యం బస్తాలున్నాయని, ఇప్పటి వరకు ఎన్ని కొన్నారో అధికారుల వద్ద లెక్కలు లేవన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర మేరకు బస్తాకు రూ.1474 ఇస్తారా? లేదా అంటూ వ్యవసాయ అధికారులను నిలదీశారు. వరదల వల్ల పంట నష్టం వాటిల్లితే ఎక్కడికక్కడ నష్టాన్ని తగ్గించి చూపే ప్రయత్నం చేశారే కానీ ఆదుకునే పాపాన పోలేదన్నారు. బాపట్ల పార్లమెంటరీ అధికార ప్రతినిధి జొన్నలగడ్డ విజయబాబు, మాజీ ఎంపీపీలు దండె వెంకటసుబ్బారావు, డాక్టర్‌ మధుసూదనప్రసాద్‌, మైనేని మురళీకృష్ణ, గొట్టిపాటి భానుగంగాధర్‌, యలవర్తి బ్రహ్మానందం, శరణుగిరి, ప్రసాద్‌, శివారెడ్డి, ఎల్లారెడ్డి, టి.సాయిబాబు, గోపాలం సుబ్బారావు, కర్ణ శ్రీను, అమ్మిశెట్టి కిషోర్‌బాబు, రవికాంత్‌, సుధాకర్‌, సురేంద్ర, ఐదు మండలాల రైతు నాయకులు వేలాదిగా పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-31T05:59:47+05:30 IST