అట్రాసిటీ చట్టం లేకుండా చేయాలని కుట్ర

ABN , First Publish Date - 2021-07-30T06:07:38+05:30 IST

వైసీపీ ప్రభుత్వం అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ.. దళితులకు రక్షణగా ఉన్న ఆ చట్టాన్ని లేకుండా చేయాలని కుట్ర చేస్తోందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు తెలిపారు.

అట్రాసిటీ చట్టం లేకుండా చేయాలని కుట్ర
మాజీ మంత్రి నక్కా ఆనందబాబు

దళితులపైనే ఎస్సీ, ఎస్టీ చేసులు పెట్టిన ఘనత జగన్‌దే

గుంటూరు, జూలై 29(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వం అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ.. దళితులకు రక్షణగా ఉన్న ఆ చట్టాన్ని లేకుండా చేయాలని కుట్ర చేస్తోందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు తెలిపారు. గురువారం ఆయన గుంటూరులోని తన కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తోందనడానికి ప్రత్యక్ష ఉదాహరణ దేవినేని ఉమాపై అక్రమంగా కేసు పెట్టడమేనని తెలిపారు. ప్రశ్నించే గొంతుకల్ని అక్రమంగా జైలుకి పంపేందుకే ఈ చట్టాన్ని వాడుతున్నారన్నారు. దళితులను వైసీపీ మొదటి నుంచి ఓటుబ్యాంక్‌గానే చూస్తోందే తప్ప వారి హక్కులు, ప్రయోజనాలు కాపాడటంలో శ్రద్ధ చూపడంలేదన్నారు. తూర్పుగోదావరిలో వైసీపీ  ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు దళిత యువకుడు వరప్రసాద్‌కి శిరోముండనం చేశారని, ఆ కేసులోని కమల క్రిష్ణమూర్తిపై చర్యలు తీసుకోలేదన్నారు. విశాఖలో మరో యువకుడికి శిరోముండనం చేశారని, డాక్టర్‌ సుధాకర్‌ని మానసికంగా హింసించి చంపేశారని ఆరోపించారు.  మద్యం ధరలపై ప్రశ్నించిన చిత్తూరు జిల్లా యువకుడు అనుమానస్పదంగా చనిపోయాడని, జడ్జి రామకృష్ణపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని దళితులపైనే ప్రయోగించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అని వివరించారు. ప్రభుత్వం దళిత వ్యతిరేకత మానుకోవాలని లేకపోతే దళితుల చేతిలో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆనందబాబు హెచ్చరించారు. 

చరిత్ర హీనులుగా.. వైసీపీ ఎంపీలు : కనపర్తి

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను పార్లమెంటులో ప్రశ్నించలేని 22 మంది వైసీపీ ఎంపీలు చరిత్ర హీనులుగా మిగిలిపోనున్నారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు విమర్శించారు. పార్టీ పశ్చిమ కార్యాలయంలో గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసులకు భయపడి సీఎం జగన్‌ రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టారని ఆరోపించారు. 25 మంది ఎంపీలను ఇస్తే కొండలు పిండి చేస్తామని ఉత్తరకుమార ప్రగల్భాలు పలికిన జగన్‌రెడ్డి నేడు తన ఎంపీలను కోల్డ్‌స్టోరేజీలో పెట్టి, తాను తాడేపల్లి ప్యాలెస్‌లో ఎందుకు నిద్రపోతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. రాజీనామాల నుంచే వైసీపీ పుట్టుకొచ్చిందని గొప్పలు చెబుతున్న ప్రభుత్వ సలహాదారు సజ్జల, టీడీపీ ఎంపీల రాజీనామా సవాలుకు ఎందుకు తోకముడిచారో సమాధానం చెప్పాలన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కుక్కిన పేనులా ఉన్న మంత్రి కొడాలి నాని థైర్య, సాహసాలు ఏ పాటివో తమకు తెలుసని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి దేవినేనిపై రెండేళ్లుగా ఏదో ఒక తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టించాలన్న వైసీపీ నేతల కుట్ర నేడు తీరిందన్నారు. ఉమ పది రోజులు జైల్లో ఉంటే రాబోయే రోజుల్లో దానికి కారకులైన వైసీపీ నేతలు ఎన్ని రోజులు జైలో ఉండాల్సి వస్తుందో గుర్తుంచుకోవాలన్నారు. జగన్‌ ఫ్యాక్షన్‌ ఉచ్చులో ఎమ్మెల్యేలు పావులుగా మారోద్దని కనపర్తి హితవు పలికారు. 

Updated Date - 2021-07-30T06:07:38+05:30 IST