ఆస్తి వివాదంతోనే అన్నదమ్ముల హత్య

ABN , First Publish Date - 2021-09-02T05:53:40+05:30 IST

పొలం గట్ల వద్ద ఉన్న పాతకక్షలు, ఆస్తి వివాదాల నేపథ్యంలోనే మాచర్ల మండలం రాయవరంలో మట్టా బాలకృష్ణ, ఆయన తమ్ముడు శివ అలియాస్‌ శివాజీలను ఆర్మీ మాజీ జవాను మట్టా సాంబశివరావు తుపాకీతో కాల్చి చంపినట్టు రూరల్‌ సీసీఎస్‌ ఎస్పీ ఎనవీఎస్‌ మూర్తి తెలిపారు.

ఆస్తి వివాదంతోనే అన్నదమ్ముల హత్య
వివరాలు వెల్లడిస్తున్న సీసీఎస్‌ ఎస్పీ ఎనవీఎస్‌ మూర్తి, పక్కన గురజాల డీఎస్పీ జయరామ్‌ప్రసాద్‌, మాచర్ల రూరల్‌ సీఐ భత్సవత్సల రెడ్డి, ఎస్‌ఐ ఆదిలక్ష్మి, వెనుక నిందితుడు సాంబశివరావు

ఆర్మీ మాజీ జవాన అరెస్టు.. పిస్టల్‌, 16 బుల్లెట్లు స్వాధీనం

గుంటూరు, సెప్టెంబరు 1: పొలం గట్ల వద్ద ఉన్న పాతకక్షలు, ఆస్తి వివాదాల నేపథ్యంలోనే మాచర్ల మండలం రాయవరంలో మట్టా బాలకృష్ణ, ఆయన తమ్ముడు శివ అలియాస్‌ శివాజీలను ఆర్మీ మాజీ జవాను మట్టా సాంబశివరావు తుపాకీతో కాల్చి చంపినట్టు రూరల్‌ సీసీఎస్‌ ఎస్పీ ఎనవీఎస్‌ మూర్తి తెలిపారు. ఈ మేరకు బుధవారం గుంటూరులోని పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడైన మట్టా సాంబశివరావును మీడియా ఎదుట హాజరుపరచి వివరాలు వెల్లడించారు. బాలకృష్ణ, శివలతో సుమారు 12 ఏళ్లుగా వారికి దూరపు బంధువైన సాంబశివరావుతో గొడవలు ఉన్నాయి. బాలకృష్ణ, శివలను చంపేందుకు తుపాకీ తీసుకురావాలని సాంబశివరావును ఆయన తండ్రి చెన్నయ్య ఒత్తిడి చేశాడు.    ఆర్మీ జవానగా జమ్మూకాశ్మీర్‌ ప్రాంతంలో పని చేసే సమయంలో సాంబశివరావు తుపాకీ లైసెన్సు తీసుకున్నాడు. 2018లో ఉద్యోగ విరమణ చేసి తుపాకీతో సొంతూరు రాయవరం చేరుకున్నాడు. ఈ క్రమంలో గత నెల 29న పొలం, ఇంటి వద్ద వారి మధ్య వివాదం జరిగింది. అవకాశం కోసం ఎదురుచూసిన సాంబశివరావు తుపాకీతో కాల్పులు జరపగా బాలకృష్ణ(35), శివ (33) మృతి చెందారు. వారి అన్న కుమారుడైన మట్టా వీరాంజనేయులుకు గాయాలు కాగా ఆయనను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ కేసులో సాంబశివరావును అరెస్టు చేసి అతడి నుంచి తుపాకీతోపాటు 16 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. తుపాకీ లైసెన్సు తీసుకున్నప్పుడు 29 బుల్లెట్లు కొనుగోలు చేసినట్టు ఎస్పీ తెలిపారు. కాగా నిందితుడు 13 బుల్లెట్లు వినియోగించినట్లు ఎస్పీ తెలిపారు. సాంబశివరావు తండ్రి చెన్నయ్య కూడా నిందితుడిగా ఉన్నాడని, త్వరలో ఆయనను కూడా అరెస్టు చేస్తామన్నారు. నిందితుడ్ని అరెస్టు చేసిన గురజాల డీఎస్పీ జయరాంప్రసాద్‌, మాచర్ల రూరల్‌ సీఐ భక్తవత్సలరెడ్డి, ఎస్‌ఐ ఆదిలక్ష్మి, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. 


గన లైసెన్సులపై వివరాల సేకరణ


మాచర్ల పరిధిలోని రాయవరంలో మాజీ ఆర్మీ జవాన మట్టా సాంబశివరావు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందిన నేపథ్యంలో రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ గన లైసెన్సులపై దృష్టి సారించారు. గన లైసెన్సు కలిగిన వారి వివరాలను బయటకు తీయాలని అధికారులను ఆదేశించారు. ఆర్మీకి సంబంధించిన వారు ఎప్పుడు ఉద్యోగ విరమణ చేశారు, ప్రస్తుతం వారు ఏం చేస్తున్నారు, వారిలో ఎవరిపైనైనా కేసులు, ఫిర్యాదులు ఉన్నాయా వంటి వివరాలను కూడా విచారించి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. ఏడాదికాలంగా జిల్లాలో గన లైసెన్సు కలిగిన సాధారణ వ్యక్తుల లైసెన్సును రెన్యూవల్‌ చేయటం లేదని ఎస్పీ తెలిపారు. కేవలం మాజీ సైనికోద్యోగులకు, బ్యాంక్‌ సెక్యూరిటీ, ఇతర సెక్యూరిటీ విభాగాలను దృష్టిలో ఉంచుకొని మాత్రమే రెన్యూవల్‌ చేస్తున్నామన్నారు. ఉద్యోగ విరమణ తర్వాత తుపాకీని పోలీసు కార్యాలయంలో అందజేసిన సాంబశివరావు పవర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు వద్ద సెక్యూరిటీగా ఉద్యోగం చేస్తున్న నేపథ్యంలో తిరిగి ఇచ్చామన్నారు. అక్కడ ఉద్యోగం చేసిన 15 రోజులకే మానేసినట్టు తెలిపారు. 


Updated Date - 2021-09-02T05:53:40+05:30 IST