కృష్ణానదిలో మునిగి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మృతి

ABN , First Publish Date - 2021-07-26T05:58:07+05:30 IST

ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ స్నేహితులకు పార్టీ ఇచ్చేందుకు విజయవాడ వెళ్లి అనంతలోకాలకు చేరుకున్నాడు.

కృష్ణానదిలో మునిగి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మృతి
ఘంటా రాజశేఖర్‌

స్నేహితులకు పార్టీ ఇవ్వటానికి వెళ్లి అనంతలోకాలకు

కుటుంబంలో తీరని విషాదం

గుంటూరు, జూలై 25: ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ స్నేహితులకు పార్టీ ఇచ్చేందుకు విజయవాడ వెళ్లి అనంతలోకాలకు చేరుకున్నాడు. నగరంలోని బొంగరాలబీడు ప్రాంతానికిచెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు ఘంటా రాజశేఖర్‌ (22) విజయవాడలోని భవానీపురం ఘాట్‌వద్ద జరిగిన ప్రమాదంలో మృత్యువాతపడ్డాడు. ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.  జిల్లాలోని ముస్తాపురానికి చెందిన ఘంటా బాలరాజు, మేరి ప్రతిమలకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు రాజశేఖర్‌ బీటెక్‌ పూర్తిచేసి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. కరోనా నేపథ్యంలో కొంతకాలంగా ఇంటి వద్ద నుంచే పనిచేస్తున్నాడు. ఇదిలావుంటే రాజశేఖర్‌ పనిచేస్తున్న కంపెనీలో ఉద్యోగం పర్మినెంట్‌ కావటంతో స్నేహితుడు పార్టీఇవ్వాలని అడిగాడు. దీంతో శనివారం తన స్నేహితుడైన అజర్‌ అలీ, మరొకరితో కలిసి విజయవాడ వచ్చాడు. అక్కడ ఓ హోటల్‌లో పార్టీఇచ్చిన అనంతరం ఇద్దరుస్నేహితులతో కలిసి భవానీపురంలోని కృష్ణానది ఘాట్‌ వద్దకు వెళ్లాడు. తొలుత ఇద్దరు స్నేహితులు నీటిలోదిగగా రాజశేఖర్‌ ఒడ్డున రాయిపై కూర్చున్నాడు. అయితే రాయి జారటంతో నీటిలో పడిపోయాడు. నీటిలో కొట్టుకుపోతున్న రాజశేఖర్‌ను కాపాడేందుకు ఇద్దరు స్నేహితులు ప్రయత్నించగా సాధ్యంకాక వారుకూడా నీట మునిగారు. గమనించిన స్థానికులు వెంటనే దిగి వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. ఇద్దరు స్నేహితులను కాపాడగలిగినప్పటికీ రాజశేఖర్‌ వారికి కనిపించలేదు. నీటిలో కొట్టుకుపోవటంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో తల్లిదండ్రులు శనివారం రాత్రి విజయవాడ చేరుకుని భవానీపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. గాలించగా ఆదివారం ఉదయం అక్కడకు సమీపంలో మృతదేహాన్ని గుర్తించారు. పోస్టుమార్టం అనంతరం సాయంత్రం మృతదేహాన్ని అప్పగించారు.

 

Updated Date - 2021-07-26T05:58:07+05:30 IST