ఉన్నత విద్య దళిత ఆదివాసీల రాజ్యాంగ హక్కు

ABN , First Publish Date - 2021-11-09T05:41:48+05:30 IST

ఉన్నత విద్య దళిత ఆదివాసీ విద్యార్థుల రాజ్యాంగపు హక్కు అని దళిత బహుజన ఫ్రంట్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు కొరివి వినయ్‌కుమార్‌ పేర్కొన్నారు.

ఉన్నత విద్య దళిత ఆదివాసీల రాజ్యాంగ హక్కు
మాట్లాడుతున్న కొరివి వినయ్‌కుమార్‌ వేదికపై దేవకుమార్‌ తదితరులు

డీబీఎఫ్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు వినయ్‌కుమార్‌

గుంటూరు, నవంబరు 8: ఉన్నత విద్య దళిత ఆదివాసీ విద్యార్థుల రాజ్యాంగపు హక్కు అని దళిత బహుజన ఫ్రంట్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు కొరివి వినయ్‌కుమార్‌ పేర్కొన్నారు. దళిత బహుజన రీసోర్స్‌ సెంటర్‌, జాతీయ దళిత మానవహక్కుల ప్రచారోద్యమం సంయుక్త ఆధ్వర్యంలో దళితగిరిజన విద్యార్థులకు ‘ఉన్నత విద్యావకాశాలు - బడ్జెట్‌ కేటాయింపులు’ అనే అంశంపై రాష్ట్రస్థాయి సదస్సు అరండల్‌పేటలోని ఓ హోటల్‌లో సోమవారం జరిగింది. సదస్సుకు డీబీఆర్‌సీ రాష్ట్ర కార్యదర్శి అల్లడి దేవకుమార్‌ అధ్యక్షత వహించారు. వినయ్‌కుమార్‌ మాట్లాడుతూ అణగారినవర్గాల విద్యాభివృద్ధికి అవసరమైన విధానాలు రూపొందించి అమలు చేయటం ప్రభుత్వాల బాధ్యతని గుర్తుచేశారు. విద్య ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు విద్యావకాశాలు సన్నగిల్లుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. జాతికి జరుగుతోన్న అవమానాలు, వివక్షత రూపుమాపటం ఆయా వర్గాలలోని యువత ఉన్నత విద్యావకాశాలు సాధించటం ద్వారానే సాధ్యమవుతుందని వివరించారు. జాతీయ మానవహక్కుల ప్రచారోద్యమం ప్రధాన కార్యదర్శి దీనా పల్లికల్‌ మాట్లాడుతూ జాతీయస్థాయిలో దళిత గిరిజనులకు ఉన్న విద్యావకాశాలపై సర్వే నిర్వహించగా కేవలం 14 శాతంమంది మాత్రమే పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ స్థాయికి చేరుతున్నాయని, జాతీయస్థాయిలో ఆరు లక్షల మంది స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేయగా కేవలం 50శాతం మాత్రమే స్కాలర్‌షిప్పులు పొందారని పేర్కొన్నారు. కొవిడ్‌ కష్టకాలంలో ఆన్‌లైన్‌ విద్యను కంప్యూటర్లు, మొబైల్స్‌, ఇంటర్నెట్‌ కనెక్షన్‌ వంటివి లేకపోవటం వలన దళిత గిరిజన విద్యార్థులు పొందలేకపోయారని ఆవేదన వ్యక్తంచేశారు.  కార్యక్రమంలో ఎన్‌సీడీహెచ్‌ఆర్‌ అడ్వకసీ కోఆర్డినేటర్‌ ఆదికాంత , ఎస్సీ, ఎస్టీ జేఏసీ కన్వీనర్‌ అశోక్‌, సాల్మన్‌పాల్‌, డాక్టర్‌ చుక్కా నాగభూషణం, మురికిపూడి దేవపాల్‌, కిరణ్‌కుమార్‌, బి.రమణమూర్తి, అనీల్‌కుమార్‌ తదితరులున్నారు. 


Updated Date - 2021-11-09T05:41:48+05:30 IST